పాక్ చెర‌లో ఉన్న మ‌త్స్య‌కారుల‌ను విడిపించాలి



న్యూఢిల్లీ: బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్‌ కోస్టు గార్డు చెరలో చిక్కుకున్నార‌ని, వారిని విడిపించాల‌ని ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ‌స్వ‌రాజ్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు కోరారు. ఇవాళ బాధిత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు కేంద్ర మంత్రిని క‌లిశారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ తీర ప్రాంత భద్రతా దళం చేతిలో బందీగా మారారు. పాక్ అరెస్టు చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన  20 మంది, విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. చేపల వ్యాపారం చేసే ఓ కాంట్రాక్టర్ దగ్గర గుజరాత్‌లో పని చేస్తున్న ఈ 28 మంది పొరబాటున పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ప్రస్తుతం కరాచీలో ఉన్నట్లు తెలుస్తోంది.  

28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. నిద్రాహారాలు మాని తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేర‌కు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో బాధిత కుటుంబ స‌భ్యులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి త‌మ వారిని విడిపించాల‌ని కోరారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రిని క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. 
Back to Top