హామీల అమలులో కేంద్రం విఫలం

స్వార్థానికి హక్కులను తాకట్టుపెట్టిన చంద్రబాబు
బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం
హామీలు అమలు చేసేలా పోరాటం చేస్తాం
పార్లమెంట్‌ ఆవరణలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల ధర్నా
ఢిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం, సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. విభజన సమయంలో ఆంధ్రరాష్ట్రానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్‌ ఆవరణలో పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు నిరసన వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విభజన హామీలపై, ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై ఎటువంటి ప్రస్తావన లేకుండా ప్రజలను తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. నాలుగు సంవత్సరాలుగా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో విభజన హామీల సాధనకు అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులను కలిసి ఎన్నో వినతిపత్రాలు అందించామని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలైనా కేంద్రం ఒక్క హామీని కూడా నెరవేర్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
భాగస్వామ్యంతో సాధించిందేంటీ?
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధించారో చెప్పాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తన స్వార్థానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు కాలరాస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజుపట్నం పోర్టు వంటి అంశాలను సాధిస్తామన్నారు. 
 
Back to Top