గిరిజనుల సమస్యలు పట్టని సర్కార్

హైద‌రాబాద్‌: గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరితే.... ప్ర‌భుత్వం నిల‌క‌డ లేని సమాధానాలు చెబుతుంద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త చెదారంతో కూడిన నీటిని గిరిజ‌నులు తాగుతున్నార‌ని, అలాంటి నీటిని నిత్య‌ావ‌స‌ర‌ాల‌కు కూడా వినియోగించ‌ర‌ని పుష్ప‌శ్రీ‌వాణి అన్నారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆమె మాట్లాడుతూ... గిరిజ‌న గ్రామాల్లో నిండు గ‌ర్భిణిని డోలీల్లో ఆస్ప‌త్రికి తీసుకెళ్లే ఫొటోల‌ను ఆమె పత్రికాముఖంగా చూపించారు. గిరిజ‌నులు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించుకునేందుకు కాలిన‌డ‌క‌న ఐటీడీఏకు వెళ్తే వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుక‌నే వారే లేర‌న్నారు. పార్వతీపురం ఐటీడీఏలో రెగ్యుల‌ర్ పీఓ లేక‌పోవ‌డంతో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని, ఇంజ‌నీరింగ్ శాఖ పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని ఆమె ఆరోపించారు. 

అర్హులైన ద‌ళిత నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు కేటాయించ‌కుండా అన‌ర్హుల‌కు కేటాయిస్తున్నార‌ని ఆమ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గిరిజ‌న ప్రాంతంలో రోడ్డు ప‌నుల‌కు మంజూరైన రూ. 18కోట్ల‌ నిధులను క‌మీష‌న్‌ల కోసం వెన‌క్కు పంపిచార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌ర్య‌వేక్ష‌ణ లోపం కార‌ణంగా అధికారుల‌ు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గిరిజ‌న ప్రాంతాల‌కు రెగ్యుల‌ర్ పీఓను కేటాయించి, స్థానిక సమస్యలను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top