అన్ని నేరాలకు చంద్రబాబే కారణం

– ఎక్సైజ్‌ కమిషనర్‌ను కలిసిన వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతలు
– రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
 

విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న అన్ని నేరాలకు చంద్రబాబే కారణమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. కోర్టులను కూడా ఎక్సైజ్‌ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ విజయవాడలోని ఎక్సైజ్‌ కమిషనర్‌ను వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, 15 రోజుల్లోగా బెల్టు షాపులను రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. ఈ రోజు చంద్రబాబు లిక్కర్‌ అనే తుపాన్‌తో రాష్ట్రంలోని అన్ని వర్గాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. యువత తప్పుదోవ పడుతున్నారని, ఇంట్లో గృహ హింస జరగడానికి, రోడ్డు ప్రమాదాలు జరగడానికి మద్యమే కారణమన్నారు. మహిళలపై, బాలికలపై అత్యాచారాలకు మద్యమే ప్రధాన కారణమన్నారు. మద్యాన్ని కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉన్నా కూడా పట్టించుకోకుండా అన్ని నేరాలకు బాధ్యుడయ్యారని విమర్శించారు. ఇన్నీ చేస్తూ కూడా చంద్రబాబు సిగ్గు లేకుండా విజయవాడ రోడ్లపై మహిళా సంక్షేమం అంటూ ర్యాలీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నా నియోజకవర్గంలోనే చంద్రబాబు తన బినామీలకు తప్పుడు దారిలో మద్యం లైసెన్స్‌ ఇచ్చారన్నారు. మైకెల్‌ అనే వ్యక్తి కల్తీ మద్యం కేసులో గతంలో అరెస్టు అయ్యారన్నారు. ఈ రోజు ఈ మైకెల్‌ టీడీపీ నాయకుడిగా ఉన్నారని, ఈయన అన్న రేషన్‌ బియ్యాన్ని దోచుకొని స్మగ్లింగ్‌ చేస్తూ పీడీ యాక్ట్‌లో ఉన్నారన్నారు.  ఇలాంటి వారిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వివరించారు. నగరి నియోజకవర్గంలో వీరికి దోపిడీకి లైసెన్స్‌ ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు మహిళా సాధికారిత దిశగా ఆలోచన చేయడం లేదని ఫైర్‌ అయ్యారు. ఒక సంతకం పెడితే నిమిషంలోనే అమలులోకి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిది అన్నారు. చంద్రబాబు చేసిన సంతకాలకు విలువ లేకుండా పోయిందన్నారు. 
 
Back to Top