టీడీపీ నేత‌లు నిద్ర‌పోతున్నారా?

 - మంత్రి నారాయణకు సొంత ప్రయోజనాలే ముఖ్యం 
– ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేసే కుట్ర 
– టీడీపీ నేతలకు ప్రజల ఆరోగ్యం పట్టదా?
– అసుపత్రి అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు
– టీడీపీ నేతలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే దమ్ముందా?

నెల్లూరు:  ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో సిబ్బంది లేక‌పోతే టీడీపీ నేత‌లు నిద్ర‌పోతున్నారా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాద‌వ్ ప్ర‌శ్నించారు. మంత్రి నారాయణకు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదని ఆయ‌న‌ మండిపడ్డారు. నగరంలోని ప్రభుత్వ వైద్యశాల, ఆసుపత్రిని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆసుపత్రికి చెందిన 85 మంది ఉద్యోగులు డిప్యూటేషన్‌తో పాటు, సెలవులపై వెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మంత్రి నారాయణ తన ఆసుపత్రిని కాపాడుకునేందుకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.  మంత్రి నారాయణకు ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి లేదన్నారు. మంత్రి ఏ రోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో సమావేశం నిర్వహించలేదన్నారు. నోరు తెరిస్తే చాలు నెల్లూరుకు అవి చేశాం..ఇవి చేశామని గొప్పలు చెప్పుకోవడమే కానీ ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో 85 మంది సిబ్బంది అందుబాటులో లేకపోతే మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే సీట్ల కోసం చంద్రబాబు చుట్టూ తిరిగే సమయం టీడీపీ నేతలకు ఉంటుంది కానీ, ప్రజల సమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు. మంత్రులు, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం చేయించుకునే దమ్ముందా అని సవాలు విసిరారు.  

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి క్యాన్సర్‌ ఆసుపత్రి మంజూరైందన్నారు. అయితే ఆ క్యాన్సర్‌ ఆసుపత్రి విశాఖకు తరలిపోతుందన్న ప్రచారం జరుగుతుందన్నారు.  ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. 

 


Back to Top