బాబుకు రాజకీయమంటే కొనడం, అమ్మడమే: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

వ్యక్తిగతంగా చేసిన తప్పుతో నెలకొన్న వివాదాన్ని రెండు రాష్ట్రాలకు, ప్రజలపై రుద్దొద్దని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. రేవంత్ తీగ లాగితే చంద్రబాబు డొంకంతా కదిలిందని చెప్పారు. నిజంగా నైతిక విలువలుంటే చంద్రబాబునాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలను బెదిరించేలా మాట్లాడారని, ఇప్పుడు సభలో కూడా అలాగే మాట్లాడుతున్నారని చెప్పారు.

పార్టీ వాళ్లేమో ఆ గొంతు చంద్రబాబుది కానే కాదని అంటుంటే.. చంద్రబాబు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అయిందంటున్నారని ఇందులో ఏ విషయాలు ప్రజలు నమ్మాలని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని తెలుగు ప్రజలందరికీ అపాధించడం సరికాదని చెప్పారు. ఎంసెట్, నదీజలాలు, విద్యుత్, విద్యార్థుల వివాదాలు తలెత్తినప్పుడు నోరు విప్పని చంద్రబాబునాయుడు ఇప్పుడు సొంత వ్యవహారాన్ని మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపెట్టి గందరగోళం రేపుతున్నారని చెప్పారు.

బాబుకు రాజకీయమంటే కొనడం, అమ్మడమే: బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయమంటే కొనడం, అమ్మడమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చంద్రబాబు రాజీనామా కోరుతూ మహాధర్నా నిర్వహించారు. నీచరాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని బాలినేని తెలిపారు. చంద్రబాబు తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కొవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

నిప్పు అయితే తప్పుకో: ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: ఓటుకు నోటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా కోరుతూ ఆయన మంగళవారం ఉరవకొండలో మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషి అయితే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి... ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించుకోవాలన్నారు. తాను చేసిన తప్పును రెండు రాష్ట్రాల మధ్య తగాదాగా మార్చుతున్నారని చంద్రబాబుపై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.

Back to Top