<strong>ఇళ్ల రిజిస్ట్రేషన్లను వెంటనే పునరుద్ధరించాలి</strong><strong>విజయవాడలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా..</strong>విజయవాడ: ప్రభుత్వం దిగివచ్చి పేద ప్రజలకు సంబంధించిన ఇళ్ల రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. విజయవాడలోని సింగ్‌నగర్, పాయకాపురం, వాంబేకాలనీ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్ సీపీ ఆందోళన చేపట్టింది. ధర్నాలో మల్లాది విష్ణు పాల్గొని మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం చంద్రబాబు ఈ ప్రాంతానికి వచ్చి ఇళ్ల రిజిస్ట్రేషన్ వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశించినా నేటికీ అతీగతి లేదన్నారు. 20 సంవత్సరాల క్రితం పునరావాసం కింద కేటాయించిన ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి.. వారి ఇళ్లను కబ్జా చేసేందుకు కుట్ర చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లను ఎందుకు నిలిపివేశారో చెప్పాలని నిలదీశారు. పలు డివిజన్లలో దాదాపు 20 వేల ఇళ్లు రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయాయన్నారు. ప్రభుత్వం దిగివచ్చి పేద ప్రజలకు సంబంధించిన ఇళ్లను రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే.. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. <strong> </strong>