చంద్రబాబు అండతోనే అక్రమ మైనింగ్‌


గుంటూరు: చంద్రబాబు అండతోనే గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురజాలకు వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులు బొత్ససత్యనారాయణ, ముస్తాఫా, లేళ్ల అప్పిరెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసుస్టేషన్‌కు తరలించారు. పార్టీ నేతల ఆందోళనతో పోలీసులు వారిని విడుదల చేశారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్‌పై వాస్తవాలు తెలుసుకునేందుకు గురజాలకు వెళ్తుంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. 28 లక్షల టన్నుల తెల్లరాయిని అధికారులు గుర్తించింది వాస్తవం కాదా అని నిలదీశారు. దాన్ని దోచుకుంది టీడీపీ నేతలైతే..కూలిలు  బాధ్యులా అని ప్రశ్నించారు. యరపతినేని పనిమనుషులపై అక్రమ మైనింగ్‌ కేసులు పెట్టారని, ఒక కూలి రూ.63 కోట్ల స్కాం చేశారంటే ఎవరైనా నమ్ముతారా అని ధ్వజమెత్తారు. అమాయకులపై కేసులు పెట్టి ఎమ్మెల్యే యరపతినేని తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.  వీటిపై ప్రశ్నిస్తున్నామని, మైనింగ్‌ వద్ద వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తున్నామని మమ్మల్ని వెళ్లకుండా పోలీసులతో అడ్డుకున్నారన్నారు. మాతో పాటు సంఘం విద్రోహ శక్తులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని మమ్మల్ని వెళ్లకుండా నిర్భందించారన్నారు. సభ పెట్టుకుంటామంటే అనుమతి నిరాకరిస్తున్నారని తప్పుపట్టారు. తాను పదేళ్లు మంత్రిగా పనిచేశానని, ఐదేళ్లు ఎంపీగా పని చేశానని చెప్పారు. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును, వాక్‌ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ దుశ్చర్య, దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని సూచించారు. ప్రకృతిలోని పంచభూతాలను టీడీపీ నాయకులు దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. 
టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ ఏమీ లేదని విమర్శించారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని విమర్శించారు.  ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.
 
Back to Top