సాధారణ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి 45% ఓట్లు

హైదరాబాద్:

‌రానున్న లో‌క్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ హవాయే కొనసాగనున్నది. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలుస్తుందని సీఎన్‌ఎన్ ఐబీఎన్-లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడైంది. సీమాంధ్రలో లో‌క్‌సభ స్థానాలతో పాటు, అసెంబ్లీ స్థానాల్లోనూ వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని సర్వే తెలిపింది. ఈ సర్వే ఫలితాలను ప్రసారం చేయగా, రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసిన ఫిబ్రవరి 17 - 23 తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు.

‌ఈ సర్వే ప్రకారం... లోక్‌సభ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 45 శాతం ఓట్లు సాధిస్తుంది. టీడీపీకి 33 శాతం, కాంగ్రెస్‌కు 16 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. బీజేపీ, ఇతర పార్టీలు 3 శాతం ఓట్లు పొందగలుగుతాయి.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీమాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు 45 శాతం, టీడీపీకి 39 శాతం, కాంగ్రెస్‌కు 12 శాతం, బీజేపీకి ఒక శాతం ఓట్లు లభించనున్నాయనని సర్వేలో వెల్లడైంది. తెలంగాణకు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌కు 42 శాతం, కాంగ్రెస్‌కు 20 శాతం, టీడీపీకి 11 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు రానున్నాయి.
సర్వే చెప్పిన ప్రకారం వైయస్ఆర్ కాంగ్రె‌స్ 11 నుంచి 17 లో‌క్‌సభా స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి.
టీడీపీకి 10-16 స్థానాలు, టీఆర్‌ఎస్ 6-12, కాంగ్రెస్ 6-12, ఇతరులకు 1-5 స్థానాలు రానున్నాయి.

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు, టీడీపీకి మధ్య 12 శాతం ఓట్ల వ్యత్యాసం (లోక్‌సభ) ఉండగా.. సీట్ల సంఖ్యకు వచ్చేసరికి రెండు పార్టీల మధ్య ఒకే ఒక్క సీటు తేడా ఉన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించడం విశ్లేషకులను విస్మయపరిచింది.
ఒకటీ రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపించడం సాధారణం. అలాంటిది 12 ‌శాతం ఓట్ల వ్యత్యాసం ఉంటే సీట్ల సంఖ్యలోనూ వైయస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ మధ్య చాలా వ్యత్యాసమే ఉండాలి. ‌ఈ శాంపిల్ సర్వేకు తీసుకున్నది కూడా దేశవ్యాప్తంగా 512 ప్రాంతాల్లో 9,104 మందిని మాత్రమే.

Back to Top