బాబు చరిత్ర అంతా రక్తపు మరకలే

 
* ఎన్డీఆర్‌ను వ్యవస్థాపక అధ్యక్షుడిగా తొలగించాకా ఆయన ఫోటో ఎందుకు వాడుతున్నారు?
*పార్టీ వ్యవస్థాపక ఉత్సవాలు జరపడానికి నీకు అర్హత ఉందా?
*మీ వెన్నుపోటు గురించి ఎవరికి తెలియదు?
*ఇప్పుడు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా?
*గతంలో కానీ.. ఇప్పుడు కానీ ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా?
* నువ్వు సీఎం పదవికి అనర్హుడివి

హైదరాబాద్‌: ‘‘చంద్రబాబును చూస్తుంటే నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తుకు వస్తోంది. ‘ది క్యామెల్‌ అండ్‌ డిసర్ట్స్‌’ ఈ కథలో ఒంటె తన యజమానిని మోసం చేసి గుడారిలో నుంచి బయటకు పంపించి చంపేస్తుంది. అచ్చం ఈ కథలోలాగా చంద్రబాబు టీడీపీ నుంచి ఎన్టీఆర్‌ను బయటకు పంపించి ఆయన చావుకు కారణమయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఆయన ఫోటో వాడుకుంటూ పూల దండలు వేస్తూ దొంగనాటకాలు ఆడుతున్నాడు’’ అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు లక్ష్మిపార్వతి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్తపు మరకలేనన్నారు. నమ్మించి వెన్నుపోటు పొడవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. టీడీపీ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాటాడారు.   ఎన్టీఆర్‌ మార్చి 29, 1982లో పార్టీని స్థాపిస్తే చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న చంద్రబాబు ఇందిరాగాంధీ అనుమతిస్తే తనమామ ఎన్టీఆర్‌పై పోటీ అతన్ని మద్రాసు పంపిస్తానని సవాల్‌ చేసిన అతను ఒక సామాన్యుడి చేతిలో చంద్రగిరిలో డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేకపోయారని, ఓడిపోయిన వెంటనే అతను టీడీపీలో చేరారని గుర్తు చేశారు. 

ఏం అర్హత ఉంది బాబూ?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక ఉత్సవాలను జరుపుకోవడానికి చంద్రబాబుకు ఏం అర్హత ఉందో చెప్పాలని లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. ఆగస్టు 27, 1995న బసంత్‌ విహార్‌లో ఎన్టీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడు ఆ ఎన్టీఆర్‌ ఫోటోను ఎలా పెట్టుకుంటారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. దేశంలో విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనన్నారు. ఇటీవల ఒక నటుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఇష్టం లేకపోతే ఆ పార్టీనుంచి నువ్వు బయటకు పోవాలి కానీ.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన్ను బయటకు పంపించే అర్హత మీకెక్కడి అదని ప్రశ్నించిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. 
ముమ్మాటికీ వెన్నుపోటు దినమే
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చేతుల్లోనుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబును నిజమైన ఎన్టీఆర్‌ అభిమానులు ఎవరూ చంద్రబాబును సమర్థించరన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌ తనదనంతరం బాబు చేతుల్లోకి వెళ్లిపోయాక ఆ పార్టీలో ఎన్టీఆర్‌ ఆశయాలు ఒక్కటి కూడా లేవన్నారు. అందుకే ఆ పార్టీని ఇప్పుడు అందరూ తెలుగు దొంగల పార్టీ అని, తెలుగు ద్రోహుల పార్టీ అని అంటున్నారన్నారు. పార్టీ  పండుగ రోజు కాదని, ఇది వెన్నుపోటు దినమని ఎన్టీఆర్‌ అభిమానులు అంటారన్నారు. 

మోసం.. బాబు నైజం
చంద్రబాబు నాయుడు మోసం చేయడంలో దిట్ట అని లక్ష్మీపార్వతి అన్నారు. బాబు అవకాశ వాది అని దుయ్యబట్టారు. బాబుకు సొంతంగా గెలిచే సత్తా లేక అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని గెలిచి తర్వాత వారికి వెన్నుపోటు పొడవడం బాబుకు అలవాటన్నారు. మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీలో చేరి ఆయనను బయటకు పంపించడంతో పాటు, ఆయన పార్టీని, పార్టీ గుర్తును లాక్కోవడంతో పాటు ఎన్టీఆర్‌కు చావుకు కారకుడైన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. 


అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ బాబు
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. పెదబాబు, చినబాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. దాదాపు రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు.బాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అవినీతిలో కూరుకుపోయిందన్నారు.   

చెప్పేది ఘనం..చేసింది శూన్యం
సత్యనాదెంట్లకు ఐటి గురించి చెప్పింది తానేనని, సెల్‌ఫోన్‌ కనుక్కున్నది తానేనని, ఎంతోమంది ప్రధాన మంత్రులను చేశాని, అభివృద్ధికి చిరునామా తానేనని చెప్పుకునే చంద్రబాబు చేసింది మాత్రం శూన్యమన్నారు. అబద్ధాలు చెప్పడం .. ప్రజలను మోసం చేయడం బాబుకు అలవాటన్నారు. చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చెప్పుకోవడానికి ఒక్క మంచి మాట లేదన్నారు. అసలు ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలన్నారు. ఆయన పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. రైతులను కాల్చి చంపించిన ఘనత చంద్రబాబు సొంతమని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై కేంద్రం సీబీఐ విచారణ జరిపిస్తే ఆయన బండారం బయట పడుతుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top