వైయస్ఆర్‌సీపీ ‘ప్రజల మేనిఫెస్టో’కు తుదిరూపు

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎన్నికల మేని ఫెస్టో‌ (ప్రజల మేనిఫెస్టో) రూపకల్పన ముగింపు దశకు వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించేలా పార్టీ మేనిఫెస్టో రూపుదిద్దుకుందన్నారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు, సీనియన్ నాయకులు శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై మేనిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దారని ఆమె చెప్పారు. సమావేశం అనంతరం పద్మ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

పార్టీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జూపూడి ప్రభాకర్‌రావు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పూర్తిగా ‘ప్రజల మేనిఫెస్టో’గా ఉంటుందని చెప్పారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన గుర్తు‌చేసేలా, ఆయన వారసత్వంగా పుట్టిన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కూడా ప్రజా సంక్షేమ‌ం విషయంలో ఎవరూ ఊహించని స్థాయిలో ముందుకు తీసుకుపోతుందని చెప్పారు.  వంద శాతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే ఈ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Back to Top