చింతమనేనిని తక్షణమే టీడీపీ సస్పెండ్ చేయాలి

హైదరాబాద్, నవంబర్ 11: 'సిగ్గులేకుండా పించన్లు తీసుకోండి' అంటూ ప్రజలనుద్దేశించి దురహంకార పూరిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనాయకురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో సోమవారం జరిగిన జన్మభూమి సభలో మాట్లాడిన ప్రభాకర్.. "సిగ్గులేకుండా పింఛన్లు తీసుకోండి. ఆ తరువాత చంద్రబాబు ఫొటోకు నమస్కారం పెట్టి వెళ్లండి" అని పింఛనుదారులకు చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను చులకన చేసి మాట్లాడినందుకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. మంగళవారం ఆమె వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక అహికార టీడీపీ విధానమా అన్నది స్పష్టం చేయాలని కోరారు. వ్యక్తిగతమైనవైతే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో ఈ దురహంకారమే టీడీపీ విధానమని అనుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలను బానిసలు, జీతగాళలా భావించడం టీడీపీ నేతల నరనరాన జీర్ణించుకుపోయిందన్నారు. సిగ్గుపడాల్సింది ప్రజలు కాదని, ఎన్నికల్లో మోసపూరితమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చనందుకు టీడీపీ నేతలే సిగ్గుపడాలని ఆమె అన్నారు.

రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి కీలక వాగ్దానాలే అమలు చేయనందుకు ప్రభుత్వమే సిగ్గు పడాలన్నారు. 'మాఫీ మాయం' అని చంద్రబాబు అనుకూల పత్రికలోనే వార్త రావడాన్ని బట్టి రైతులకు రుణమాఫీ ఉండదనేది స్పష్టమవుతుందని అన్నారు. లబ్దిదారులు చంద్రబాబు ఫొటోకు దండం పెట్టుకోవలని కోరడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ మనుషులను ఫొటోలుగా మార్చి వారికి దండలు వేసే సంస్కృతి టీడీపీదే అని, ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు చేసింది అదేనని వ్యాఖ్యానించారు. పింఛన్లు కూడా పచ్చచొక్కాల వారికే ఇస్తున్నారని, ఏదో ఒక సాకుతో ఈ పథకం నుంచి సాధారణ ప్రజలను తొలగిస్తున్నారని చెప్పారు.

పింఛన్ల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన గ్రామ కమిటీల చైర్మన్లుగా టీడీపీ వారే ఉంటున్నారని, వారే లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఇతర పార్టీల వారు సర్పంచులుగా ఉన్న గ్రామాల్లో కూడా అక్కడి టీడీపీ నేతల జోక్యంతోనే జాబితాలు రూపొందిస్తున్నారని చెప్పారు. కనీసం ఆ సర్పంచులకు జాబితాలు కూడా చూపించడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు పొందడానికి సిద్దంగా ఉన్న 2013 సంవత్సరం లభ్దిదారుల జాబితాను పునఃపరీశీలన పేరుతో ప్రభుత్వం ఆపేయడం దారుణమని అన్నారు.

వీరికి రుణాలు మంజూరయ్యాయని, అయితే కార్పొరేషన్ల నుంచి వచ్చే రూ.60 వేలు సబ్సిడీలో రూ.10వేలు ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పింఛన్లతో సహా అన్ని రకాల సంక్షేమ పథకాల్లో అసలైన వారిని పక్కనబెట్టి పచ్చచొక్కాలు తిడుక్కున్న వారికే ఇస్తున్నారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ వారికే పథకాలు ఇస్తామని చెప్పడం గర్హనీయమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత అందరూ సమానులేనన్న ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన అందరికీ పథకాల ద్వారా లబ్ది చేకూర్చారని తెలిపారు.

Back to Top