రామోజీది జర్నలిజమా? ఉన్మాదమా?

హైదరాబాద్:

చంద్రబాబు నాయుడుని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఈనాడు పత్రిక, చానల్‌ను, పాత్రికేయ విలువలనూ పణంగా పెట్టి నీచమైన ప్రయత్నానికి రామోజీరావు ఒడిగడుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. తెరవెనుక ఉండి గతంలో రాజకీయాధికారాన్ని అనుభవించడానికి అలవాటుపడిన రామోజీరావు మళ్లీ అదే దాని కోసం వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన సొంత ఎజెండాను సాధించడం కోసం దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి, తమ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రెండు దేశాల మధ్య వైరుధ్యం కలిగిన ఒక సంస్థకు సంబంధించిన కేసులో అమెరికాలో అభియోగాలు నమోదైతే అందులో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పాత్ర ఉందని భుజాలెగరేసుకుంటూ రామోజీరావు ఈనాడులో కథనాలు రాయించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో శ్రీ వైయస్ జగ‌న్ పాత్ర ఉందని నిరూపిస్తే సాక్షిని రామోజీకి స్వాధీనం చేస్తామని, లేకుంటే ఈనాడును తమకు స్వాధీనం చేయాలని సాక్షి విసిరిన సవా‌ల్‌ను స్వీకరించాలని పద్మ డిమాండ్ చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే సరిపోదని, తాము విసిరిన సవా‌ల్‌కు సమాధానం చెప్పాలని నిలదీశారు. వైయస్, శ్రీ జగన్‌పై వార్తలు రాస్తూ జర్నలిజాన్ని రామోజీరావు ఉన్మాద స్థాయికి తీసుకెళుతున్నారని ఆమె దుయ్యబట్టారు.

'ఒక నాయకుడిని అధికారంలోకి తేవాలన్నది రామోజీరావు సొంత ఎజెండా కావొచ్చు, కానీ అందుకు జర్నలిజాన్నే పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. కేసుతో శ్రీ జగన్‌కు సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి మెలికను ఆయన వేలికి చుట్టాలని రామోజీ, కొన్ని ఇతర పత్రికలు ప్రయత్నిస్తున్నాయి'.

'వైయస్‌ఆర్ మరణం తరువాత రాష్ర్టంలో ఇక తమకు అడ్డు ఉండదని చంద్రబాబు, రామోజీ తదితరుల బృందం భావించింది. అయితే గత నాలుగున్నరేళ్లలో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ ఆవిర్భవించి వై‌యస్ఆర్ మాదిరిగా‌ శ్రీ జగన్‌ కూడా ఒక పెద్ద నాయకుడుగా ఎదుగుతుండటంతో వారు భయపడిపోతున్నారు. తమ శిరస్సుపై పాదం మోపే శ్రీ మహావిష్ణువు రూపంలో శ్రీ జగన్ వారికి కనిపిస్తున్నారు. అందుకే అన్ని ఎజెండాలను పక్కనబెట్టి, ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈనాడులో‌ శ్రీ జగన్‌పై అవాస్తవ కథనాలు వండి వార్చడమే పనిగా పెట్టుకున్నారు'.

'వైయస్ఆర్ మరణించిన వంద రోజుల్లోపే కుట్ర‌ పూరితంగా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం తెరలేపితే ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు? వై‌యస్ మరణం తరువాత ఒక్క సాగునీటి ప్రాజెక్టు ముందుకు సాగకపోతే ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు? విభజనకు వ్యతిరేకంగా రామోజీ ఒక్క సంపాదకీయమైనా రాశారా? నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంటకంగా పరిపాలిస్తూ ఉంటే ప్రజల తరపున ఈనాడు ఒక్కసారైనా నిలబడిందా? ప్రజల‌ మీద విపరీతంగా విద్యుత్ చార్జీల భారం, ఆర్టీసీ చార్జీల బరువు మోపితే ఏనాడూ ఎందుకు స్పందించదు‌'?

- వైయస్ఆర్ మరణించాక గత ఐదేళ్లలో ఈనాడు పత్రిక, రామోజీరావు ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడి పోరా‌డలేదు. మరణించిన వైయస్ఆర్, ఆయన కుమారుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై బురదజల్లుతూ పుంఖానుపుంఖాలుగా పేజీల కొద్దీ వార్తలు రాయడంపైనే ఆసక్తిని చూపింది. ఈనాడు, కొన్ని పత్రికలు కలిసి శ్రీ జగన్‌కు వ్యతిరేకంగా ఎంత కుట్రపూరితంగా రాస్తే ప్రజలు ఆయనను అంతగా అక్కున చేర్చుకుంటున్నారు.  అది రెండు లోక్‌సభ, 20 శాసనసభ స్థానాల ఉప ఎన్నికల సందర్భంగా రుజువైంది.

- 2004లో వైయస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రామోజీరావు ఆ మహానేతకు వ్యతిరేకంగా వార్తలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. 2009 ఎన్నికలకు ముందు విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు, వై‌యస్‌కే పట్టం కట్టారు. ఇపుడు 2014 ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీని నిలువరించేందుకే శ్రీ జగన్‌పై వ్యతిరేక కథనాలు మళ్లీ మొదలుపెట్టారు.

- వైయస్ఆర్ మరణించినపుడు ఆయన చేసిన మంచి పనుల వల్ల రాష్ట్రం అశ్రుధార కార్చిందని రామోజీరావు సంపాదకీయం రాశారు.
‌- చంద్రబాబు ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయలేక ముందు నుంచి పవన్, వెనుక నుంచి పాల్, ఇటు నుంచి బీజేపీ, మరో వైపు నుంచి జేపీ ఇలా అందరి మద్దతు తీసుకుని వస్తున్నారు. ఈనాడుతో సహా అందరూ కలిసి ఎత్తుతున్నా చంద్రబాబు పైకి లేవలేకపోతున్నారు.

Back to Top