విభజన కుట్రకు మేం సాక్షులుగా ఉండలేం

హైదరాబాద్:

సమైక్య నినాదం ముసుగులో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై చేస్తున్న రాష్ట్ర విభజన కుట్రలో తాము ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనలేమని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ ‌విజయమ్మ స్పష్టంచేశారు. విభజన బిల్లుకు సభ అనుకూలమా? వ్యతిరేకమా? అని నిగ్గు తేల్చేందుకు శాసనసభలో ఓటింగ్ పెట్టా‌లని ఆమె డిమాండ్‌ చేశారు. కానీ తాము ఎన్ని విధాలుగా అడిగినా సమాధానాలు లభించనందున సభ నుంచి వాకౌట్ చేస్తున్నా‌మ’ని ఆమె ప్రకటించారు. అనంతరం పార్టీ సభ్యులందరూ సమైక్య నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

‌శాసనసభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే బిల్లుపై ఓటింగ్ కోసం వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి‌ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఐదు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడింది. రెండవసారి 10.30 గంటలకు మొదలైనప్పుడు కూడా సభలో ఇదే పరిస్థితి పునరావృతమైంది. దీనితో వైయస్ఆర్‌సీపీ సభాపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ మనోహ‌ర్ చె‌ప్పారు. దీనితో పార్టీ ఎమ్మెల్యేలు శాంతించి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. నిరసన వ్యక్తం చేయడానికి శ్రీమతి విజయమ్మకు స్పీకర్ అవకాశం ఇచ్చారు.

‌శ్రీమతి విజయమ్మ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లో...:
- ఎన్నిసార్లు సీఎంకు విన్నవించినా, బీఏసీలో మా పార్టీ విధానం చెప్పినా.. దురదృష్టవశాత్తూ విభజన ప్రక్రియ ముందుకు సాగుతోంది. బిల్లు ఉద్దేశాలు, కారణాలు చెప్పకుండా, ఆర్థికపరమైన సమాచారం ఇవ్వకుండా బిల్లును సభకు పంపించారు.
- విభజన బిల్లును తిరస్కరించడానికి సభలో ఓటింగ్ నిర్వహిస్తారా? నిర్వహించరా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలి. సభానేతగా ముఖ్యమంత్రి అయినా స్పష్టత ఇవ్వాలి.
-‌ ఓటింగ్ ఉంటే ఎలా ఉంటుంది? క్లాజులవారీ‌గానా లేదా షెడ్యూళ్ల వారిగానా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి.
‌- ఎలాంటి స్పష్టత లేకుండా బిల్లు మీద ఎందుకు చర్చ జరగాలి? ఈ విషయాలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోంది?

- ‘విభజన వద్దు. అడ్డుకుందాం...’ అనేది మా పార్టీ విధానం. ఈ మేరకు అఫిడవిట్ల రూపంలో రాష్ట్రపతికి చెప్పాం. 164 నిబంధన కింద మా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పిటిషన్ల రూపంలో సమర్పించాం. బిల్లులోని అన్ని క్లాజులను తొలగించాలని సవరణ ప్రతిపాదనలు ఇచ్చాం.
- విభజన ఎలా జరగాలన్న చర్చలో భాగస్వాములం కాదల్చుకోలేదు.
- సమైక్యం ముసుగులో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి చేస్తున్న విభజన కుట్రలో ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనబోం. అదే సమయంలో.. రాష్ట్రపతి అడిగిన మేరకు మా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం.
- రాష్ట్ర విభజన 10 కోట్ల మందికి సంబంధించిన అంశం. కాంగ్రెస్ ఇంటి విధానం కాదు. వారి (కాంగ్రెస్) స్వార్థం కోసం తెలుగుజాతిని బలిపెట్ట‌వద్దని కోరుతున్నాను.

- సమైక్యాంధ్రలోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. 1972లో ఇందిరాగాంధీ కూడా చెప్పారు. 60 సంవత్సరాలుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు విడదీయాలి? 2,700 సంవత్సరాలు కలిసి ఉన్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలి? బ్రిటిష్, నిజాం కాలంలో విడిపోవాలనుకోలేదు. ఇప్పుడెందుకు విడిపోవాలి?
- విభజనకు శాసనసభ అనుకూలమా?వ్యతిరేకమా? అని చెప్పడానికి ఓటింగ్ నిర్వహించాలి. మా అభిప్రాయం చెప్పమన్నప్పుడు మా ఎమ్మెల్యేలు వచ్చి చెప్తారు. సమైక్యం మా విధానం, నినాదం.

Back to Top