విభజన ప్రకటనపై పార్టీ నాయకుల స్పందన

‌రాహుల్ కోసమే రాష్ట్ర విభజన : భూమన
తిరుపతి :

రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ విభజించిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఓ మాట, గల్లీలో ఓ మాట మాట్లాడుతూ ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని‌ ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు‌ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని వ్యాఖ్యానించారు. స్వార్థం కోసం సోనియా సీమాంధ్ర ప్రజల గుండెల్లో గునపాలు దింపారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు నిదర్శనం : కాపు
అనంతపురం‌ :
రాష్ట్ర విభజన కారణంగా ఎదురయ్యే సమస్యలను చర్చించకుండా, సీమాంధ్ర ప్రాంత ప్రజలతో సమన్వయం సాధించకుండా కేవలం ఓట్లు, సీట్లను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించడం దారుణమని రాయదుర్గం వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ‌విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నీచ సంస్కృతికి, కుటిల రాజకీయాలకు విభజన నిర్ణయం అద్దం పడుతోందన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు : గొల్ల బాబూరావు
విశాఖపట్నం :
కేంద్రం ఏకపక్షంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటుందని తెలిసే మూడు రోజుల క్రితం వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరం పదవులకు రాజీనామా చేశామని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల‌ బాబూరావు తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించారని, పది రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు కేంద్ర ప్రభుత్వం చెంప చెళ్లుమనేలా బుద్ధిచెబుతారని ఆయన హెచ్చరించారు.

సోనియా ఇంటి ముందు దీక్ష చేయండి : జోగి
విజయవాడ :
సమైక్యవాదాన్ని ప్రోత్సహించే కాంగ్రెస్ ఎం‌.పి.లు, మంత్రులు సోనియా ఇంటి ముందు ఆమరణ దీక్ష చేయాలని పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ సూచించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ‌. తెలుగు ప్రజల గుండెలను సోనియా ముక్కలు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ఇమ్మని లేఖ ఇచ్చిన తెలుగుదేశం, తెలంగాణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్‌లను ప్రజలు భూస్థాపితం చేస్తారని చెప్పారు. క్లిష్టమైన ఈ సమయంలో నాయకులందరూ పార్టీలను పక్కన పెట్టి ఉద్యమానికి ముందుకు వస్తే తాము మద్దతు ఇస్తామన్నారు.

విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించాలి : ఆదినారాయణరెడ్డి
కడప :
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పిలుపునిచ్చారు. విభజనకు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమూ కారణమే అన్నారు.

చంద్రబాబు వైఖరి వల్లే ఈ దుస్థితి : గురునాథరెడ్డి
అనంతపురం :
చంద్రబాబు నాయుడు తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం వల్లే ఈ రోజు రాష్ట్రం ముక్కలైందని‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి విమర్శించారు. సీమాంధ్రుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే తెలంగాణ ప్రకటించడం దారుణమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి చేతకాని ముఖ్యమంత్రి ఉండడం వల్లే తెలంగాణ ఏర్పాటైందన్నారు. మహానేత వైయస్ బతికున్న రోజుల్లో తెలంగాణ ఊసే లేదని, ఆయన మరణంతో స్వార్థ‌ రాజకీయాల కోసం ప్రత్యేక తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి దెబ్బతీయడానికే తెలంగాణను ఏర్పాటు చేశారు కానీ.. ఆ ప్రాంతంపై ప్రేమతో కాదన్నారు. రాష్ట్ర విభజనపై అందరి అభిప్రాయాలు సేకరించాల్సిన కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.

అడ్డగోలు విభజనకే వైయస్ఆర్‌ కాంగ్రెస్ వ్యతిరేకం‌ : అంబటి
గుంటూరు :
రాష్ట్రాన్ని విభజించినా.. సమైక్యంగా ఉంచినా.. అది భారత ప్రభుత్వం ఇష్టమని, కేంద్రం ఓ తండ్రిలా రెండు రాష్ట్రాల్ని సమానంగా చూసి భాగ పంపకాలు చేపట్టమని పలు సందర్భాల్లో తమ పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పామని వైయస్ఆర్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. చర్చలు లేని అడ్డగోలు విభజనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. తెలంగాణను విడగొట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండంలా.. కుక్కలు చింపిన విస్తరిలా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఈ విభజనతో కృష్ణా డెల్టా, సాగ‌ర్ ఆయుకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు.

Back to Top