వైయస్‌ఆర్‌ ఆశయాలు నెరవేరుద్దాం : సీకే బాబు

చిత్తూరు, 3 సెప్టెంబర్ 2012 ‌: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను కలసికట్టుగా నెరవేరుద్దామని చిత్తూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సి.కె. బాబు పిలుపునిచ్చారు. మహానేత తృతీయ వర్ధంతి సందర్భంగా చిత్తూరులోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉన్న వైయస్‌ఆర్ విగ్రహానికి సికె బాబు‌ తన సతీమణి లావణ్యతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన రాష్ట్రాన్ని 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని, వారిలో వైయస్‌ఆర్ ఒక్కరే ప్రజల ‌గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. అలాంటి ప్రజానేత వర్ధంతి సభను కూడా కొందరు రాజకీయం చేయాలని చూశారని ఆరోపించారు. వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మరింత మెరుగ్గా అమలు పరిచే దిశగా ఈ సభ ప్రభుత్వానికి ఓ అల్టిమేట‌మ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సికె బాబు పిలుపునిచ్చారు. తాను ఎవరికీ తలవంచేది లేదని, భయపడేది అసలే లేదని స్పష్టం చేశారు. నిజమైన ప్రజా బాంధవుడి వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడం తమ బాధ్యతా భావించామని సికె బాబు దంపతులు పేర్కొన్నారు.

'వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన మీరంతా వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులే. మీ మనసులో మీరు ఏది భావిస్తున్నారో మా మదిలో కూడా అదే ఉంది. మనందరి అభిప్రాయమూ ఒక్కటే. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా మనందరం కలసికట్టుగా జననేత వైయస్‌ఆర్‌ ఆశయాలను నెరవేరుద్దాం. వైయస్‌ఆర్‌ కుటుంబానికి మద్దతుగా నిలుద్దాం' అని సికె బాబు దంపతులు పిలుపునిచ్చారు.

సికె బాబు సతీమణి లావణ్య మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా నుంచి కొందరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా వారు చిత్తూరుకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాజశేఖరరెడ్డి మాత్రమే జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేశారని కొనియాడారు.

అంతకు ముందు సికె బాబు దంపతులు తమ నివాసం నుంచి పెద్ద ఎత్తున అనుచరులతో ర్యాలీగా వైయస్‌ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. లావణ్యను ఆయన మోటార్‌ సైకిల్‌ వెనుక కూర్చోబెట్టుకొని స్వయంగా నడుపుకుంటూ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. వర్ధంతి సభ తరువాత పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వైయస్‌ఆర్‌ అభిమానులు, సీకే బాబు అనుచరులు పాల్గొన్నారు.

Back to Top