తిత్లీ తుఫాన్ న‌ష్టంపై వైయ‌స్ జ‌గ‌న్‌కు నివేదికలు


 శ్రీకాకుళం: తిత్లీ తుపాను వల్ల దెబ్బ తిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన రెండు క‌మిటీలు నివేదిక‌లు త‌యారు చేసి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అంద‌జేశారు. క‌మిటీ స‌భ్యులు కొద్ది సేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. పార్టీ నాయ‌కులు భూమన కరుణాకరరెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ నేతలు రెడ్డి శాంతి, రఘురామ్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి పార్టీ అధ్యక్షుడికి నివేదిక సమర్పించారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను పెను విధ్వంసం సృష్టించింన విషయం తెలిసిందే. తిత్లీ తుఫాన్‌ దెబ్బకి  చేతికి అందే పంట నీట ముంచింది.. కడుపు నింపే కొబ్బరితోట కూకటి వేళ్లతో పెకిలించింది. ఇళ్లను కూలగొట్టింది. కొన్ని గ్రామాలు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. తుఫాన్ మరుసటి రోజు జిల్లాలో నదులు ఉగ్రరూపం దాల్చాయి.  ఇప్పటికే  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ రెండు కమిటీలలోని  సభ్యులు బాధిత ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనావేసి ఓ నివేదిక రూపొందించించారు.  ఈ రెండు కమిటీలు నివేదికను వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలిస్తున్నారు. 

Back to Top