గోదావరి జిల్లాల్లో సత్తాచాటిన వైయస్ఆర్‌ కాంగ్రెస్

‌హైదరాబాద్, 28 జూలై 2013:

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శనివారం జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు.‌ ఈ రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయాలు సాధించి టిడిపి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను వెనక్కు నెట్టారు. జంగారెడ్డిగూడెం, కొవ్వూరు డివిజన్లలోని 18 మండలాల్లో 253 పంచాయతీలకు శనివారం పోలింగ్ జర‌గగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 79 పంచాయతీల్లో విజయభేరి మోగించారు.‌ ఈ జిల్లాల్లో 76 పంచాయతీల్లో గెలుపొంది తెలుగుదేశం పార్టీ రెండవ స్థానంలో, అధికార కాంగ్రెస్ పార్టీ 54 పంచాయతీ‌ల్లో గెలిచి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాయి.

మేజర్ పంచాయతీల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ముందంజలో దూసుకుపోయింది. 10 వేల కంటే ఎక్కువ ఓట్లున్న పంచాయతీల్లో పార్టీ పాగా వేసింది. పెనుగొండ, రేలంగి, కొయ్యలగూడెం (పరింపూడి), గోపాలపురం పంచాయతీల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ‌విజయాలు సాధించారు. మంత్రి పితాని సత్యనారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెనుగొండ పంచాయతీలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుదారు ‌విజయా సాధించడం విశేషం.
కాగా, తూర్పుగోదావరి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో తన హవా సాగించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ రెండవ విడతలో కూడా ముందుకు దూసుకుపోయింది. రెండవ విడతలో సైతం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేయాలనుకున్న అధికార కాంగ్రెస్, ‌ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కుట్రలు, కుతంత్రాలు ఓటర్ల ముందు పనిచేయలేదు.

రెండవ విడతలో కాకినాడ, పెద్దాపురం డివిజన్‌ల పరిధిలో 336 పంచాయతీలకు ఎన్నికలు జరగగా శనివారం రాత్రి 11.30 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుదారులు 96 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. రెండవ స్థానంలో తెలుగుదేశం మద్దతుదారులు 94 పంచాయతీల్లో గెలవగా, అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో మాదిరిగానే ఈసారి కూడా మూ‌డవ స్థానంలో 89 పంచాయతీల్లో గెలిచింది. 25 పంచాయతీల్లో స్వతంత్రులు నెగ్గారు. వీరిలో అత్యధికంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సానుభూతిపరులే ఉన్నారు.

తొలి విడతలో ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తెలుగుదేశం, కాంగ్రెస్‌లు అడుగడుగునా కుమ్మక్కు రాజకీయాలు చేసినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి.

Back to Top