కాంగ్రెస్, టిడిపి అక్రమాలకు చెక్‌ పెట్టాలి

హైదరాబాద్ :

అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, టిడిపిలకు చెక్‌ చెప్పాలని ఎన్నికల సంఘానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తిచేసింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) భేటీ శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో పిఎసి సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సభ్యులు ఎం.వి. మైసూరారెడ్డి, డి.ఎ. సోమయాజులు, భూమా శోభా నాగిరెడ్డి, ముఖ్యనేతలు వై.వి. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సమావేశం అనంతరం శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను ఉసిగొల్పి వైయస్ఆర్‌ కాంగ్రెస్ అభ్యర్థులపై ఆంక్షలు విధిస్తున్నార‌ని ఆరోపించారు. పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన స్వతంత్రులపైనా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థులమని చెప్పకపోతే కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు వివరిస్తూ పార్టీ తరఫున లేఖ రాయనున్నట్లు శోభా నాగిరెడ్డి తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన 800 మంది అభ్యర్థులను జిల్లాల‌ వారీగా ఒకచోట చేర్చి ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించాలని రాజకీయ వ్యవహారాల కమిటీ ఆలోచన చేసిందని శోభా నాగిరెడ్డి చెప్పారు.

Back to Top