వైయస్సార్ - సంక్షేమానికి చిరునామా

  • పేదల పెన్నిధి..సంక్షేమ సారథి
  • నేడు మహానేత 8వ వర్థంతి
  • వైయస్ఆర్ జ్ఞాపకాల్లో తెలుగు ప్రజలు
ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం. ప్రభుత్వాధినేతలు పని చేయాల్సింది ప్రజల కోసం. అధికారంలో ఉండేది ఏ పార్టీ అయినా కావచ్చు. కాని అంతిమ లక్ష్యం మాత్రం ప్రజా ప్రయోజనమే అయ్యిండాలి. ఈ మాటలన్నది ఎవరో కాదు సంక్షేమ పాలకుడు, సుపరిపాలనా సేవకుడు డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి. కోట్లాది మంది మనసులు గెలుచుకున్న నేతగా ఆయన ఎలా మారారు…? గెలిచిన మనసుల్లో దేవుడిగా ఎలా నిలిచిపోయారు…? ఆయన చెప్పిన ఈ మాటలను ఆచరణలో చేసి చూపినందుకే ఆయన ప్రజల మనిషి అయ్యారు. ప్రియతమ నేతగా పేరుగడించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, అధినేతగా అధికారాన్ని అందుకోవడానికి ముందు, ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు వైయస్సార్. వారికి ఏం కావాలో తెలుసుకున్నారు. వారి కలలేమిటో అర్థం చేసుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కోసమే ప్రభుత్వం అని ప్రకటించారు. 

వైయస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం అది. వ్యవసాయం ఒక జూదం అయిపోయింది. రైతు వ్యవసాయం కంటే, ఉరి పోసుకోవడమే సులువనుకుంటున్నాడు. అది చూసి వైయస్ చలించిపోయారు. పాదయాత్ర ఆరంభించి పల్లె పల్లెనా ప్రతి రైతునూ కలిసారు. ఆ సమయంలో ఆయన రైతుల సమస్యలు మాత్రమే వినలేదు. వాటి మూలాలు ఏమిటా అని ఆరా తీసారు. కరువు డొక్కలు ఎండ గడుతుంటే, సాగు నీరు కూడా అందక చేలు బీళ్లు వారుతుంటే, అప్పు చేసి తెచ్చి వేసిన విత్తనాలు దగా చేస్తుంటే, ఎరువుల కోసం అరువులు పుట్టక రైతు పురుగుల మందుకి బలి అవుతున్నాడని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. దానికితోడు కరెంటు కోతలు వారి పాలిట శాపాలయ్యాయి. పల్లెలన్నీ చీకట్లో మగ్గుతుంటే, ఒక్క నగరాన్ని దేదీప్యమానంగా వెలిగించి జబ్బలు చరుచుకుంటోంది నాటి తెలుగుదేశ ప్రభుత్వం. ఆ పాదయాత్ర సాక్షిగా రైతులకు వ్యవసాయాన్ని తిరిగి పండుగలా మారుస్తానని మాట ఇచ్చారు వైయస్సార్. ఇకపై నీరందక చేలు ఎండవని, కరెంటు కోతలు అసలుండవని, పల్లె జీవకళకు ప్రాణం పోస్తానని హామీ ఇచ్చారు వైయస్సార్. అధికారంలోకి వచ్చిన వెంటనే, ఉచిత విద్యుత్ ఫైలు పై సంతంకం చేసి రైతుల గుండెల్లో ఇది రైతు ప్రభుత్వం అనే భరోసాను నింపారు. 

జలయజ్ఞం అంటే ఒక దీక్ష. తెలుగు నేలను సస్యశ్యామంల చేసే ఒక భగీరథ యత్నం. వైయస్సార్ నిత్యకృషీవలుడు. ఆయన అడుగు పెట్టిన చోట ప్రకృతే పులకించి, చినుకులతో స్వాగతించింది. ఆయన జలయజ్ఞానికి అనంత జలసిరి తెలుగు నేల అణువణువునా విస్తరించింది. వైయస్ మదిలో రూపుదిద్దుకుని ప్రాజెక్టులుగా పరవళ్లు తొక్కి పరుగులు తీసింది జలయజ్ఞం. వైయస్సార్ తన పాదయాత్రలో ఒక్క రైతు సమస్యలే కాదు పల్లెలను పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలను కళ్లారా చూసారు. వాటిలో ఆయన్ను కదిలించిన మరో సమస్య మహిళా రుణాలు. అప్పటి తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లో పల్లె ల్లో విస్తరించిన మైక్రోఫైనాన్స్ ముఠాలు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని రుణాలు ఇచ్చేవి. ఆ తరువాత అధిక వడ్డీలను వసూలు చేసేవి. వాటిని కట్టలేక సతమతమౌతుంటే దారుణమైన వేధింపులకు గురి చేసేవి. ఈ దౌర్జన్యాల నుంచి మహిళలకు విముక్తి కలిగించాలనుకున్నారు వైయస్సార్. ప్రైవేటు రుణాల బారిన పడి కుటుంబాలు వీధిన పడకూడదని, మహిళలకు స్వావలంబన కావాలని, తెలుగింటి ఆడపడుచులంతా లక్షాధికారులు కావాలని ఆశించారు. పావలా వడ్డీకే రుణాలు అందించి వారి ఆర్థిక స్వావలంబనకు ఊతం ఇచ్చారు. 

ఒక పేదవాడి అనారోగ్యం ఖరీదు ఒక కుటుంబ జీవనం. ప్రభుత్వాసుప్రతుల్లో సరైన వైద్యం అందక, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక కుమిలిపోయే ఎందరో అభాగ్యులను చూసాక అనుకున్నారు వైయస్సార్ - అందరికీ మెరుగైన వైద్యం అందాలి అని. స్వయంగా డాక్టర్ అయిన ఆయన రాష్ట్రానికి పట్టిన అనారోగ్యానికి ఆరోగ్యశ్రీతో చికిత్స చేయాలనుకున్నారు. ప్రతి పేదవాడూ ఆరోగ్యానికి అర్హుడే అన్నది ఆ డాక్టర్ భావన. ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ది పొందిన ఎన్నో లక్షలమంది వైయస్సే మా ప్రాణదాత అని కన్నీళ్లతో దండం పెడతారు. ఒక నాయకుడిగా కంటే ఒక డాక్టరుగా ఆయన అందించిన ఈ పథకం పేదప్రజలకు సంజీవని లాంటి వరం. ఇందులో భాగంగానే 108 సర్వీసు రాష్ట్రమంతటా జేగంటలా మోగింది. బాధితులు ఎక్కడున్నా ఒక్క ఫోన్ కాల్ తో 108 రక్షకదళం ఆపద్భాంధవుడిలా వచ్చి ఆదుకున్నది. చిన్నారుల్లో వినికిడి లోపానికి ఉచిత శస్త్రచికిత్స చేయించిన ఘనత ఒక్క వైయస్సార్ దే. 

ఫింఛన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సమాజంలో గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారు వైయస్. రాజశేఖర్ రెడ్డి. తమ అవసరాన్నిచెప్పకుండానే గుర్తించిన వైయస్ అంటే ఇంటికి పెద్దకొడుకు కాక ఇంకెవరు అంటారు ఆ వృద్ధులు. ఆ పెద్దకొడుకు హోదాలోనే పిల్లల చదువుల పట్ల కూడా దృష్టి సారించారు వైయస్. పేదరికం కారణంగా ఉన్నత చదువులకు దూరమౌతున్న యువతకు పెద్దన్నగా మారి ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రతిభ ఉన్న పేదవాడు నిశ్చింతగా చదువుకునే అవకాశం కల్పించాడు. 

ఎండ, వాన, చలి, చిచ్చు ఏదొచ్చినా పేదవాడి గుడిసెకి ముప్పే. అయితే ముంపు లేకుంటే చిచ్చు. సొంతానికి గూడు లేని పక్షులైనా ఉండాలి గాని పక్కా ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని కోరుకున్నారు వైయస్సార్. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాడు. వైయస్సార్ ప్రజా సమస్యలను అధ్యయంన చేసారు. నిత్యం వారి సమక్షంలో ఉండి వారి వెతలేమిటో తెలుసుకున్నారు. వాటిని తీర్చే దారులను వెతుక్కున్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా పేదలకు, రాష్ట్రానికి మేలు జరిగే ఏ పథకాన్నీ నీరు కారనీయలేదు. వైయస్ మదిలో పుట్టిన ప్రతి పథకం పేదల ఇంట సిరి సంతోషాలను నింపే సౌభాగ్యలక్ష్మి అయ్యింది.  సంక్షేమ పథకాలు అందించడమే కాదు, అవి అవసరమైన మేరకు అందరికీ అందుతున్నాయో లేదో కూడా అనుక్షణం గమనించారు వైయస్సార్. ఒక మహానేత, ప్రజా హృదయాధినేత అందించిన ఆ పథకాలను తెలుగు ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటునే ఉన్నారు. నేటి పాలకులు ఎలా వాటికి తూట్లు పొడిచారో, చివరకు ఎలా మాయం చేసారో తలుచుకుంటున్నారు. మళ్లీ అలాంటి సంక్షేమ పాలకుడి రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Back to Top