వైయస్‌ పథకాలకు ప్రభుత్వం తూట్లు

వేముల, 20 అక్టోబర్ 2012 : వైయస్‌ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందనీ, విద్యార్థులకు మొండిచెయ్యి చూపిస్తోందనీ ఆమె దుయ్యబట్టారు. ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందనీ, ముందుచూపు లేకపోవడం వల్ల కనీస అవసరాలకు కూడా దిక్కు లేకుండా పోయిందనీ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రెండో రోజు పాదయాత్రలో భాగంగా వేములలో జరిగిన భారీ బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో  (వైఎస్ఆర్ జిల్లా) వేముల గ్రామం చేరుకున్న షర్మిలకు ఘనస్వాగతం లభించింది. ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ కాంగ్రెస్, టిడిపిల తీరును ఎండగట్టారు. తన పాలనలో రైతులను పూర్తిగా నిర్లక్ష్య్యం చేసిన బాబు ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. బాబు హయాంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. షర్మిలను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. వైయస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్. విజయమ్మ కూడా సభలో పాల్గొన్నారు.

షర్మిల మాటల్లోనే...


"రైతుపరిస్థితి ఘోరంగా ఉంది. చీనీ చెట్ల వల్ల తాలూకాలో రూ.500 కోట్ల నష్టం వచ్చిందని చెబుతున్నారు. వేరుశెనగ పంట కూడా నష్టమే తెచ్చిపెట్టిందట. అప్పులు, వడ్డీలతో రైతు సతమతమౌతున్నాడు. రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటల బీమా ఇప్పించేవారు, ఒక్కోసారి 90 శాతం దాకా ఇన్సూరెన్సు వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. జగనన్న చెబుతాడు, నిద్రపోతున్నవారిని లేవవచ్చు, కానీ నిద్ర నటిస్తున్నవారిని లేపలేమట. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందో లేక మొద్దునిద్ర నటిస్తోందో కిరణ్‌ కుమార్‌ రెడ్డిగు నిద్రపోతున్నారో లేక నటిస్తున్నారో ఆయనకే తెలియాలి మరి. రాజశేఖర్‌ రెడ్డిగారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వమిది. కానీ ఆయనను పూర్తిగా మరచిపోయారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో దోషిగా చేర్చారు. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారు.ఆరోగ్యశ్రీని టోటల్‌గా కట్టిపెడుతున్నారు. ఇలా రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన ప్రతిపథకానికీ తూట్లు పొడుస్తున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రం భయంకరమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి కారణం ఎవరని అడుగుతున్నాం. కేవలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారికి ముందుచూపు లేకపోవడం వల్ల, ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల మనం కొనుక్కోవలసిన విద్యుత్తును మిగతా రాష్ట్రాలు కొనుక్కుపోయాయి. మనం కొనుక్కోవాలన్నా విద్యుత్తు లేదు. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు ఎన్నో విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టారు. వాటిని అటకెక్కించారు. మిగతా రాష్ట్రాలవారు అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు పోతోంటో, మన రాష్ట్రంలో మాత్రం ప్రజలు కనీస అవసరాలకు కూడా దిక్కు లేకుండా అయిపోయారు. ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వానిది కాదా అని అడుగుతున్నాం. నిలదీయాల్సిన తెలుదుదేశం పార్టీ మూడేళ్లుగా చోద్యం చూస్తోంది. ఏమీ చేయలేదు. బాధ్యతను పూర్తిగా విస్మరించింది. చంద్రబాబు సొంతమామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండ్రూపాయల కిలో బియ్యం, పూర్తి మద్యపాన నిషేధం-ఈ రెండు వాగ్దానాలనీ నిలబెట్టుకోలేకపోయాడు. రైతన్న అంటే ఆయనకు చిన్నచూపు. వ్యవసాయం దండగన్నవాడు. విద్యుత్తు చార్జీలను ఎనిమిదిసార్లు పెంచాడు. పెంచిన చార్జీలు కట్టాలని ఒత్తిడి చేశాడు. రాజశేఖర్ రెడ్డిగారు నిరాహారదీక్ష చేశారు. అప్పుడు జరిగిన ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు వెళ్లి పరామర్శించింది ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంబాలను కాదు, కాల్చిన పోలీసులను. అంతటి ఘనుడు బాబు.
రైతులను జైళ్లలో పెట్టించాడు. డబ్బు కట్టకపోతే సామాన్లు ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక నాలుగువేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ప్రపంచంలో ఎక్కడా జరుగలేదు. ఆయనదే ఈ ఘనత.  నేను ముఖ్యమంత్రినైతే మళ్లీ నా హయాం తీసుకొస్తామంటున్నారు. జనం భయపడుతున్నారు. బాబు పాలనే వచ్చి కరువొస్తే మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే తప్ప ఈయన ఆదుకునే మనిషి కాదు అని. జగనన్న నాయకత్వంలో వైయస్సార్ సీపీ మరో ప్రజాప్రస్థానం మొదలుపెట్టింది. ఉద్దేశ్యాలు రెండే. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం ఒకటైతే,  అవిశ్వాసం పెట్టకుండా ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని బాబుగారు ఎందుకు కాపాడుతున్నారో అడగడం మరొకటి. ఇద్దరూ బ్రహ్మాండంగా కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్, టిడిపిలు.
జగనన్న మీదైతే కేసులు పెడతారు. కానీ బాబు గారి మీద విచారణ జరుగకుండా చాలా గొప్పగా మేనేజ్ చేసుకుంటారు. చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు. ఆయన మీద కేసులుండవు. విచారణలుండవు. చిదంబరం దగ్గరకు ఎంపీలను పంపారు. జగన్‌కు బెయిలు రాకుండా జడ్జీని ప్రభావితం చేసే విధంగా ఇడిని ఉసిగొల్పి జగనన్న సాక్షి ఆస్తులను జప్తు చేయాలని కోరారు. చిదంబరం ఆ కుర్చీలో అందుకే కూర్చున్నట్లుగా గంటల వ్యవధిలో జప్తు జరిగిపోయింది. ఇది వారి కుమ్మక్కు రాజకీయాలకు రుజువు కాదా? నిస్సిగ్గుగా వీళ్లిద్దరూ కలిసి జగనన్నను అన్యాయంగా జైల్లో పెట్టినందుకు నిరసనగా  వైయస్సార్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తా నల్లబ్యాడ్జీ పెట్టుకుని ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. జగనన్న మళ్లీ రాజన్న రాజ్యం తెస్తాడని నమ్మకమున్న ప్రతి ఒక్కరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనగా నాతో కలిసి కదం తొక్కాలనీ, వైయస్సార్ పార్టీని బలపరచాలనీ,  జగనన్నను ఆశీర్వదించాలనీ నా ప్రార్థన. మనకు మళ్లీ రైతన్నను ప్రేమించే నాయకుడు కావాలి. పేదవారి బిడ్డలను కూడా తన బిడ్డలతో సమానంగా చూసే నాయకుడు కావాలి. పేదవారి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలనుకునే నాయకుడు కావాలి."  ఈ సభతో .షర్మిల రెండవ రోజు పాదయాత్ర ముగిసింది.

Back to Top