ప్రజల చెవిలో పూలు పెడుతున్నాడు

అక్రమ ఇంట్లో ఉంటూ పేదల ఇళ్లపై ప్రతాపమా చంద్రబాబు
తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలి
తక్షణ సాయం కింద రూ. 5వేలు చెల్లించాలని డిమాండ్

నెల్లూరుః
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాలుగు రోజులుగా
వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లా,
నెల్లూరులో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు పరిశీలించారు. ఇవాళ ఉదయం వైఎస్ జగన్
నెల్లూరు జిల్లాలోని మన్సుర్ నగర్లో పర్యటించారు. బాధితులను అక్కడి
 పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... భారీ
వర్షాలు, వరదలు వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారన్నారు. గత 15
రోజులుగా పనులకు వెళ్లలేని పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా లేక ప్రజలు
అల్లాడుతుంటే చంద్రబాబు పట్టించుకున్న పాపన పోవడం లేదని వైఎస్ జగన్
మండిపడ్డారు. భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని...తీవ్ర పంట నష్టం
వాటిల్లిందన్నారు. రైతులు, ఇతర బాధితులను వెంటనే ఆదుకోవాలని, తక్షణ సాయం
కింద ప్రతి ఒక్కరికీ రూ. 5వేల ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వం
ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా సర్కార్ కళ్లు తెరిచి
బాధితులను ఆదుకోవాలన్నారు. అధికారులు కొందరి పేర్ల మాత్రమే నమోదు
చేస్తున్నారని, వరద సాయంలో వివక్ష చూపడం తగదని వైఎస్ జగన్ సూచన చేశారు.
సర్వేల పేరుతో ఒకరు...ఇద్దరు పేర్లు రాసుకోవటం సరికాదన్నారు. బాధితులను
ఆదుకోవడం పోయి... చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్
విమర్శించారు. మోసపూరిత హామీలతో బాబు అధికారంలోకి వచ్చారని ఆయన
మండిపడ్డారు. చంద్రబాబు పాలన అంతా మోసం... మోసం... మోసం అన్న పదాల చుట్టే
తిరుగుతుందని ద్వజమెత్తారు.

కరవు మండలాల ప్రకటన,
ఇన్ పుట్ సబ్సిడీలోనూ చంద్రబాబు ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నారని వైఎస్
జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కొత్త ఇళ్లు కట్టిస్తామన్న
చంద్రబాబు...ఇప్పుడు 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లను  కూల్చివేస్తామని చెప్పడం
అన్యాయమన్నారు. చంద్రబాబు మాత్రం అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ... పేదల
కడుపు కొడతాననడం దారుణమన్నారు.  వరద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అన్నివిధాల తోడుగా ఉంటుందని, వరద సాయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు
వస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

కాగా వైఎస్
జగన్  గత మూడు రోజులుగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని వరద
ప్రభావిత ప్రాంతాల్లో  పర్యటిస్తున్నారు. తొలుత 23, 24 తేదీల్లోనే పర్యటన
ఉంటుందని భావించినా, వరద నష్టం తీవ్రంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు ఈ
జిల్లాల్లో పర్యటనను వైఎస్ జగన్ పొడిగించారు. గురువారం రాత్రికి ఆయన
నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్
నుంచి గోదావరి జిల్లాలకు వెళతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా
దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శించి ప్రత్యక్షంగా పంట నష్టం వివరాల్ని,
ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకుంటారు.
Back to Top