పున్నమిఘాట్ లో వైయస్ జగన్ పుష్కర స్నానం
మహానేత, తన తండ్రి వైయస్సార్ కు పిండప్రదానం
షిరిడీ ఆలయంలో ప్రత్యేక పూజలు
పీఠాధిపతి జయేంద్రసరస్వతి ఆశీర్వాదం తీసుకున్న జననేత
విజయవాడ: వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానశ్రయానికి చేరుకున్న వైయస్ జగన్‌కు ఎయిర్‌పోర్టు వద్ద వైయస్సార్సీపీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, రక్షణనిధి, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, ఇతర నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
గన్నపురం ఎయిర్ పోర్ట్ లో సోదరీమణులు వైయస్ జగన్ కు రాఖీలు కట్టి అపూర్వ స్వాగతం పలికారు. ఈసందర్భంగా వైయస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆతర్వాత అక్కడి నుంచి వైయస్ జగన్ నేరుగా వీఐపీ ఘాట్ కు చేరుకొని పుష్కరస్నానం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..పన్నెండేళ్లకోసారి జరిగే పుష్కరాల ద్వారా చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని వైయస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు.
పుష్కర స్నానానికి ముందు .. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి వైయస్ జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత లబ్బిపేటలోని షిరిడీసాయిని దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.