చేసేవన్నీ తప్పుడు పనులు..చెప్పేవి శ్రీరంగ నీతులు



–అధికారంలోకి రావడానికి చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు
– ధాన్యానికి గిట్టుబాటు, మద్దతు ధరల్లేవు
– కోనసీమలో తాగేందుకు మంచినీరు కరువు
– ముమ్మిడివరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ హయాంలో 20 వేల ఇల్లు కట్టించారు
– ఓటు వేసేటప్పుడు మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి
– కరెంటు, ఆర్టీసీ, పెట్రోలు ధరల బాదుడే బాదుడు
– ఇంత మంది ఎంపీలతో నాలుగేళ్లుగా బాబు గాడిదలు కాస్తున్నారా?
– 25 ఎంపీ స్థానాలు టీడీపీకి ఇస్తే ఈ రాష్ట్రాన్ని బతకనిస్తారా?
– ప్రభుత్వ సలహాదారుగా ఇంకా పరకాల ప్రభాకర్‌ కొనసాగుతూనే ఉన్నారు
– ధర్మ పోరాటం దీక్షలో ఇంకా బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాసు కనిపిస్తారు
– బాలకృష్ణ షూటింగ్‌లో వెంకయ్యనాయుడు పాల్గొంటారు
– ఆరు నెలల్లో విభజన హామీలు అమలు చేస్తామన్నారు
– కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నం హామీలు ఏమయ్యాయి?
– మీ పిల్లలను పెద్ద పెద్ద చదువులు మేం చదివిస్తాం
– మెస్, బోర్డింగ్‌ చార్జీలకు విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు
– చిన్న పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు
తూర్పు గోదావరి: చంద్రబాబు చేసేవన్నీ తప్పుడు పనులు, చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి సంసారం చేసిన చంద్రబాబుకు ఏనాడు కూడా విభజన చట్టంలోని హామీలు గుర్తుకు రాలేదన్నారు. చంద్రబాబు దళారులకు నాయకుడిగా మారారని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ముమ్మిడివరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

–  ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇవాళ పొద్దుటి నుంచి మండుతున్న ఎండను ఖాతరు చేయకుండా నాతో పాటు వేల మంది అడుగులో అడుగు వేశారు. ఒకవైపు కష్టాలు చెప్పుకుంటూ, అర్జీలు ఇస్తున్నారు. మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..నీకు తోడుగా మేమంతా ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఈ నడిరోడ్డుపై, ఎండలో నిలవాల్సిన అవసరం లేదు. ఇన్ని వేలమంది నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇవేవి లేక్క చేయకుండా ప్రేమానురాగాలు పంచుతున్నారు, చిక్కటి చిరునవ్వుతో ఆత్మీయతలు పంచుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
– జీవనది గోదావరి ప్రవహించే నేల కోనసీమ..అలాంటి జిల్లాలో ప్రజలకు తాగడానికి నీళ్లు లేకపోవడం బాధాకరం. సాగునీరు సక్రమంగా రాదు. పెట్రోలియం వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉంటాయి. కానీ ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావు.  ఇక్కడి వారంతా గల్ఫ్‌కు వలస వెళ్లాల్సిందే. కోనసీమ ఇలా ఉంటే..బాబు దోపిడీ మాత్రం విచ్చలవిడిగా సాగుతోంది. ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు 300 మందిపై ఆడ, మగ తేడా లేకుండా కేసులు పెట్టారు. 
– అన్నా..ఈ జిల్లా నుంచి చంద్రబాబుకు 14 స్థానాలు ఇచ్చామన్నా..ఇవి సరిపోవు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ముగ్గురిని సంతలో పశువుల్లా కొన్నారన్నా..అయినా ఈ జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమిటన్నా అని అడుగుతున్నారు. ఈ నియోజకవర్గం ప్రజలు అడుగుతున్నారు. అన్నా..చంద్రబాబు మాకు చేసిందన్నా అంటున్నారు. అన్నా..ఈ మీటింగ్‌లో ఈ నీళ్లు చూపించడన్నా..అయ్యా చంద్రబాబు ఇది చెరుకు రసం కాదు..మేం తాగుతున్న నీళ్లు ఇవి అని చూపించమన్నారు. ఇది ఇవాళ కోనసీమ పరిస్థితి. 
– ఇవాళ వ్యవసాయం దారుణంగా ఉంది. డెల్టా ప్రాంతానికి మేలు జరగాలని నాన్నగారు కృషి చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఈ జిల్లా పరిస్థితి ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు. పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. లంక భూములను కాపాడేందుకు గట్ల నిర్మాణం చేపట్టే నాథుడు లేడు. ఇదే జిల్లాలో 2011లో రైతులు క్రాప్‌ హాలీడే ప్రకటించారు. ఆ రోజుల్లో వాళ్లు లేవనెత్తిన సమస్యలు ఏంటంటే..అప్పట్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిన సమస్య ఏంటంటే..నవంబర్‌ వచ్చే సరికి తుపాన్‌ వస్తుందని, వరి పంట అంతా నీటిమయం అవుతుందన్నా..జూన్‌ మొదటి వారంలోనే నీళ్లు ఇవ్వమని కోరారు. నేను అడుగుతున్నాను. ఆ రోజు చంద్రబాబు కూడా పిట్టల దొర మాదిరిగా వచ్చారు. నాలుగేళ్లలో జూన్‌ మాసంలో ఒక్కసారైనా నీళ్లు అందాయా? చివరికి జులై వచ్చినా , ఇప్పుడిప్పుడే నారు మళ్లు వేస్తున్నారు. నవంబర్‌ వస్తుందని, మళ్లీ తుపాన్లు వస్తాయని భయపడుతున్నారు.
– అన్నా..వరికి గిట్టుబాటు ధర రూ.1550 అంటున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్తే రూ.1150 కూడా కొనే నాథుడు లేడన్నా అంటున్నారు. కొబ్బరి రైతులకు నాలుగేళ్లుగా మద్దతు ధర లేదన్నా అంటున్నారు. కొబ్బరి రేటు రూ.4500కు పడిపోయిందని వాపోతున్నారు. కొబ్బరి పరిశ్రమ పెడతానని చంద్రబాబు ఎన్నికల్లో గట్టిగా ఊదరగొట్టారు. కొబ్బరి పరిశ్రమ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ కనిపించదు. కనీసం కాస్తోకూస్తో ఉద్యోగాలు రావాలంటే ఇటువంటివి ప్రోత్సహించాలని తెలిసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు.
– నా వద్దకు వచ్చిన రైతులు ఏమన్నారంటే..ఈ నియోజకవర్గంలో 16 వేల ఎకరాల్లో రొయ్యలు పెంచుతున్నాం. నీటిలో పండే రొయ్యలు, చెపలకు కూడా గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారు. అక్వా రంగాన్ని పట్టించుకునే నాథుడు లేడు. రైతుల ఆవేదన చూసిన తరువాత రూ.1.50కే కరెంటు ఇస్తానని పాదయాత్రలో జగన్‌గా నేను చెప్పాను. చంద్రబాబు నక్క జిత్తుల మనిషి కదా? నాలుగు నెలల కోసం రైతులపై ప్రేమ పుట్టుకొచ్చింది. నేను ఇప్పుడే రూ.2లకే ఇస్తానని మొదలుపెట్టారు. చంద్రబాబు ఏ పని చేసినా కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసం అన్నట్లుగా చంద్రబాబు సినిమా టైటిల్‌. 
– ఇదే నియోజకవర ్గంలో తాగునీటి సమస్య 60 గ్రామాల్లో ఉందని చెబుతున్నారు. ఇవాళ పరిస్థితి చూస్తే మమ్మిడివరం, తదితర గ్రామాల్లో ఉప్పునీరు వస్తోంది. డెల్టా కాల్వల ద్వారా వచ్చే గోదావరి నీరు కలుషితమై తాగడానికి వీలు పడటం లేదు. తాగునీటి పథకాలు సరిగా పని చేయడం  లేదు. రక్షిత మంచినీరు దొరకక పడరాని పాట్లు పడుతున్నారు. చంద్రబాబును గట్టిగా అడగమన్నారు. చంద్రబాబు మొదటి సంతకాల్లో రూ.2 లకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తామన్నారు కదా? ఒక్క లీటర్‌ అయినా ఇచ్చారా?
– ఇక్కడి ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుకు చేసుకుంటున్నారు. పోలమ్మ చెరువును రూ.18 కోట్లతో చేపట్టారు. తాగడానికి నీరు ఇచచ్చే ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీళ్లరేవు, కొత్తపాలెం, చాకలిపేట, గోల్లపేట గ్రామాల్లో మంచినీరు లేదు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. అడిగే నాథుడు లేడు. పట్టించుకునే నాథుడు. 
– అన్నా..ఇదే కాట్రేనికోల మండలంలో నాన్నగారి హయాంలో మూలపులం, గోదావరి లంక పాలెంపై వైయస్‌ఆర్‌ బ్రిడ్జి మంజూరు చేసి 30 శాతం పనులు పూర్తి చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ బ్రిడ్జిని పట్టించుకునే నాథుడు లేడు.
– గోదావరి పాయపై ఆ రోజుల్లో వైయస్‌ఆర్‌ హయాంలో రూ.10 కోట్లతో గ్రామాలను అనుసంధానం చేయాలని ప్రతిపాదనలు తయారు చేస్తే వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత పట్టించుకునే నాథుడు లేడు. ఇవాళ ఆ గ్రామాల ప్రజలు నీటిలో ఈదుకుంటూ వస్తున్నారు.
– అన్నా..ఇక్కడే చమురు ఉంది. ఆయిల్‌ ఉంది. ఇక్కడి నుంచి అవి తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదు. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం పైప్‌లైన్‌ కోసం 63 తీర ప్రాంతాలను గుర్తించి, వారికి ఒక్కొ కుటుంబానికి రూ.6700 చొప్పున ప్రతి నెల ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందన్నారు. కేవలం ఆరు నెలలు ఇచ్చి..11 నెలలుగా బకాయిలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా అంటున్నారు. కనీసం మానవత్వం లేని ఈ ప్రభుత్వాన్ని చూస్తే బాధేసింది.
– గుజరాత్‌ కెమికల్‌ కార్పొరేషన్‌ ఓఎన్‌జీసీలో విలీనం అయిన తరువాత ఉద్యోగాలు ఒక్కటిగా తీసేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. చంద్రబాబు విశాఖలో మీటింగ్‌లు పెట్టి ఏపీకి రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. కొత్త ఉద్యోగాల కథ దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారని అడుగుతున్నారు.
– చంద్రబాబు పాలనలో ప్రజలంతా విస్తుపోయి నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నాన్నగారి పాలన గురించి చెప్పుకుంటూ..ఇదే నియోజకవర్గంలో 20 వేల  ఇల్లు కట్టించారని చెప్పుకుంటున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క  ఇల్లు కూడా కట్టించిన పాపాన పోలేదని చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా?
–నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఆలోచించండి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు వేసేసమయంలో మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవారు నాయకులు కావాలా? మోసాలు చేసేవారు నాయకులు కావాలా?
– నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజు మైక్‌ పట్టుకుని పిల్లలు తాగి చెడిపోతున్నారన్నారు. ఆయన వచ్చిన వెంటనే ఏ గ్రామంలో కూడా బెల్టు షాపులు లేకుండా చేస్తానన్నారు. ఈ రోజు ఏ దైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌  ప్లాంటు ఉందో లేదో తెలియదు కానీ, మందు షాపు లేని గ్రామం ఉందా? మన ఇంటి ముందే మందు షాపు పెట్టి పిల్లలతో తాగిస్తున్నారు. ఈయన హైటెక్‌ పాలనలో ఫోన్‌ కొడితే చాలు మందు బాటిల్‌ నేరుగా ఇంటికి తెస్తున్నారు.
– నాలుగేళ్లలో పెట్రోల్‌ ధరల బాదుడే బాదుడు. పక్క రాష్ట్రాలతో పోల్చితే ప్రతి లీటర్‌పైన అదనంగా రూ.7 వసూలు చేస్తున్నారు. కరెంటు చార్జీలు కూడా రూ.500, వెయ్యి చొప్పున వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే భయపడాల్సి వస్తోంది. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నట్లుగా ఉంది. 
–చంద్రబాబు చేసిన రుణమాఫీ రైతులకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కాదు కద..వడ్డీ లేని రుణాలు అందడం లేదు.
– చంద్రబాబు గజదొంగలకు నాయకుడు..దళారులకు నాయకుడిగా ఉన్నారు. రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి మూడు నాలుగు రెట్లు అధికంగా హెరిటేజ్‌లో అమ్ముకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి.
– ఆరోజు ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలపై విఫరీతమైన ప్రేమ చూపించారు. పొదుపు సంఘాలను తానే కనిపెట్టాననన్నారు. రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. 
– చిన్న పిల్లలను మోసం చేయడం అన్యాయం అంటారు. చిన్నపిల్లలను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. 40 లక్షల ఉద్యోగాలు అని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ఈయన విదేశాలకు వెళ్తే చాలు ఈయనకు సంబంధించిన మీడియాలో విఫరీతంగా చూపిస్తారు. ఆయన విదేశాల్లో ఉంటారు..ఇక్కడ ఏయిర్‌పోర్టు, బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చిందని రాస్తారు. ఆయన సత్యనాదేళ్లకు ట్యూషన్‌ చెబుతున్నారని వార్తలు రాస్తున్నారు. నాలుగేళ్లలో ఉద్యోగాలు కనిపించాయా? ఆ ఉద్యోగాలు కాస్తోకూస్తో వచ్చే అవకాశం ప్రత్యేక హోదా ద్వారా వస్తాయి. హోదా వస్తే ఇన్‌కం ట్యాక్స్‌ కట్టాల్సిన పని ఉండదు. హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయని, ఆసుపత్రి వస్తుంది. కానీ చంద్రబాబు నాలుగేళ్లలో ఆడుతున్న డ్రామాలు చూశాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని, పదిహేనేళ్లు హోదా తెస్తామన్నారు. సీఎం కాగానే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని అంటారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటారు. 2016, జనవరి 27న మీడియా సమావేశంలో ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువ వచ్చాయా అని చంద్రబాబు సవాలు విసిరారు. ఇదే పెద్ద మనిషి నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారు. కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రివర్గంలో ఉన్నారు. నాలుగేళ్లు సంసారం కలిసి చేస్తారు. అప్పుడు వీరికి ఏమీ గుర్తుకు రావు. విభజన చట్టంలో ఏమి ఉన్నాయో కూడా అసలు గుర్తుకు రావు. ఈ మధ్య ధర్మపోరాటం అని గొప్పగా చేశారు. ఆ ధర్మా పోరాటంలో ఆశ్చర్యంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాను పార్లమెంట్‌ సాక్షిగా ఇస్తామన్నారు. ఆరు నెలల్లోగానే మన రాష్ట్రానికి ఇస్తామని చెప్పినవన్నీ కూడా కార్యాచరణలోకి తీసుకువస్తామన్నారు. ఆరు నెలల్లోనే  ఇస్తామన్నది, కార్యచరణలోకి తెస్తామన్నవాటిలో కడపలో ఉక్కు పరిశ్రమ, వైజాగ్‌–చెన్నై కారిడార్, విశాఖ రైల్వే జోన్, దుగ్గిరాజపట్నం ఇస్తామన్నారు. చంద్రబాబు నీవు ముఖ్యమంత్రి అయ్యింది 2014 జూన్‌లో అయ్యావు. అక్కడి నుంచి ఏడాది సమయం తీసుకున్నా కూడా కేంద్రం  ఇవన్నీ ఇవ్వకపోతే నీవు నిద్రపోతున్నావా అని అడుగుతున్నాను. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి..ధర్మ పోరాట యుద్ధం అని మూడు గంటల పాటు పోరాటం చేస్తే ఏమి వస్తుంది. మోడీ ఇవన్నీ చేయలేదని స్క్రీన్‌ మీదా చూపించారు. ఇవే వీడియో క్లిప్పింగ్‌లు యువభేరీలు చూపించాం. నీవు ఎన్నిసార్లు ఊసరవెళ్లి మాదిరిగా రంగులు మార్చావో చెప్పి ఉంటే బాగుండేది. చంద్రబాబు, ఆయన కొడుకు ఏమంటున్నారు. ఈ సారి టీడీపీకి 25 ఎంపీ స్థానాలు ఇవ్వాలట. ప్రస్తుతం టీడీపీకి బీజేపీతో కలిసి 17 మంది ఎంపీలు, మరో ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. 20 మంది ఎంపీలను పెట్టుకొని నాలుగేళ్లుగా గాడిదలు కాస్తున్నారా? ఆయన కొడుకు పప్పు బాబు కూడా 25 మంది ఎంపీలు కావాలని అడుగుతున్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రాన్ని బతకనిస్తారా? ఇంతదారుణంగా పాలన సాగిస్తున్నారు. ఒకవైపు బీజేపీతో యుద్ధమంటారు. మరోవైపు టీటీడీలో మహారాష్ట్ర బీజేపీకి చెందిన మంత్రి భార్యను సభ్యురాలిగా నియమించారు. మరోవైపు బాలకృష్ణ ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా షూటింగ్‌లో పక్కనే వెంకయ్యనాయుడు కనిపిస్తారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా నిన్ననే చంద్రబాబు స్పీచ్‌ ఇస్తుంటారు. పక్కనే కామినేని శ్రీనివాస్‌ ఉంటారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఏమీ చేయకపోయినా మోడీని కలిశారని విష ప్రచారం చేస్తుంటారు. రోజు విజయసాయిరెడ్డితో మాట్లాడానికి మోడీకి పనీ పాట లేదా? మా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత పని మీద ఢిల్లీకి Ðð ళ్లే ఆయన..బీజేపీ నాయకుడు రాంమాధవ్‌ ఇంటికి వెళ్లారని మంట వేస్తారు. బీజేపీ కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలాసీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను చంద్రబాబు పక్కనే పెట్టుకున్నారు. ఈయన మాత్రం సలహాదారు పదవికి రాజీనామా చేసినా కూడా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. చేసేవన్నీ తప్పుడు పనులు..చెప్పేవి శ్రీరంగ నీతులు
– చంద్రబాబు ఏ కులాన్ని వదలిపెట్టలేదు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని కులాలను మోసం చేశారు. ఇప్పుడు వెబ్‌సైట్‌లో టీడీపీ మేనిఫెస్టో కనిపించడం లేదు. 
– ఇటువంటి అబద్దాలు చెప్పే వ్యక్తిని, మోసాలు చేసే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే వ్యవస్థలో మార్పు రాదు. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు రావాలంటే జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావచ్చు. 
– పొరపాటున ఇటువంటి వ్యక్తిని క్షమిస్తే ..చంద్రబాబు రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? ఎన్నికల సమయంలో మీ అందరి వద్దకు వచ్చి మైక్‌ పట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 98 శాతం పూర్తి చేశానని కాలీఫ్లవర్‌ పువ్వులు పెడతారు. ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా? చంద్రబాబుకు ఓటు వేయండి..ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? నమ్మరు అని ఆయనకు తెలుసు. అందుకే బంగారానికి బోనస్‌గా బెంజి కారు ఇస్తామంటారు. ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తారు. కొత్తగా మహిళా సాధికార మిత్రలను తయారు చేశారు. వారు మీ వద్దకు వచ్చి ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు ఇస్తారు. డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి తీసుకున్నదే. కానీ ఓట్లు వేసేటప్పుడు మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసే వారిని బంగాళఖాతంలో కలిపేయండి. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ నవరత్నాలతో ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యం. ఈ మీటింగ్‌లో అక్కచెల్లెమ్మలకు ఏం చేస్తామన్నది చెబుతున్నాను. ఇవాళ మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా? ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.30 వేలు ఇస్తున్నారు. అది కూడా రెండేళ్లుగా అందడం లేదు. మన పిల్లలను ఇవాళ చదివించే పరిస్థితిలో ఉన్నామా? పిల్లలను చదివించేందుకు పేదవాడు ఉన్న ఇల్లు, పొలం అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తాం. ఆ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి. పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ పేద కుటుంబం నుంచి ఒక్కడైనా పెద్ద చదువులు చదవాలని నాన్నగారు అనే వారు. మహానేత హయాంలో మీ పిల్లలను ఏం చదివిస్తావో చదివించండి..నేనున్నానని చెప్పేవారు. మహానేత చనిపోయిన తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. చంద్రబాబు అనే వ్యక్తికి ఎన్నికలప్పుడే మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారు. నాలుగు కత్తెర్లు, ఇస్తీ్ర పెట్టెలు ఇస్తే అది బీసీలపైన ప్రేమా అవుతుందా? బీసీలకు మేలు చేసింది వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి తల్లికి చెబుతున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు. దగ్గరుండి నేను చదివిస్తాను. అంతేకాదు..ఉచితంగా పేదవారిని చదివించడమే కాదు..హాస్టల్‌ మెస్‌ చార్జీల కోసం ప్రతి విద్యార్థికి రూ.20 వేల చొప్పున ప్రతి ఏటా చెల్లిస్తామని మాట ఇస్తున్నాను. నాన్నగారు పేద వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెబుతున్నాను.
– అంతేకాదు ఇవాళ మనం చేయబోయే గొప్ప విప్లవాత్మక మార్పు ఏంటో తెలుసా? మన పిల్లలు ఇంజినీర్లు అయితేనే, డాక్టర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. వారు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలన్నా..ఆ పునాదులు చిట్టి పిల్లల నుంచే మొదలవుతున్నాయి. ఆ చిట్టి పిల్లలు బడి బాట పడినప్పుడే మన బతుకులు మారుతాయి. ప్రతి తల్లికి చెబుతున్నాను. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత ..ఆ తల్లి తన బిడ్డలను ఏ బడికి పంపించినా ఫర్వాలేదు. ఏడాదికి ఆ తల్లికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇస్తున్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32 శాతం మందికి చదువుకునే పరిస్థితి లేక చదువుకు దూరంగా ఉన్నారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక చదువురాని పిల్లాడు ఒక్కడూ లేకుండా చేస్తాను. ఇవి నవరత్నాల్లో మనం చేసే గొప్ప కార్యక్రమం. ఇందులో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా అర్జీలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా..






 
Back to Top