అలుపు లేదు..గెలుపే ల‌క్ష్యం

- అప్ర‌తిహ‌తంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- ఉద‌యం 4.30 గంట‌ల నుంచే దిన‌చ‌ర్య ప్రారంభం
- జన వాహినితో మమేకానికే  ప్రాధాన్యం
- విస్మ‌య‌పోతున్న రాజ‌కీయ విశ్లేష‌కులు


క‌ర్నూలు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాదిరిగానే ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పిస్తుంటారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు. వారి క‌ష్టాలు తెలుసుకోవాల‌ని, క‌న్నీళ్లు తుడ‌వాల‌ని భావిస్తుంటారు. అందుకే జ‌న‌నేత,  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏది చేప‌ట్టినా అది ప్ర‌భంజ‌నమే. దీక్ష‌లు చేసినా.. ధ‌ర్నాలు చేసినా ప్ర‌భంజ‌నం. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఏపీ ప్ర‌తిప‌క్ష నేత ఏది చేప‌ట్టినా దానికి జ‌నం ప్ర‌భంజ‌న‌మై వ‌స్తున్నారు. ఇందుకోసం వైయ‌స్ జ‌గ‌న్ అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో మోస‌పోయిన వారిని అండ‌గా నిలిచేందుకు అవిశ్రాంతంగా ఉద్య‌మిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ  నెల 6వ తేదీ నుంచి ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర అప్ర‌తిహతంగా సాగుతోంది.  జ‌న‌నేత ఎక్క‌డికి వెళ్లినా వేలాది జ‌నం త‌ర‌లివ‌చ్చి ఆయ‌న అడుగులో అడుగులు వేస్తున్నారు. త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఆయ‌న ప్రదర్శిస్తున్న పరిణతి రాష్ట్ర ప్రజలను అచ్చెరువొందిస్తోంది. చంద్ర‌బాబు హామీల‌తో మోస‌పోయిన ప్ర‌తి ఒక్క‌రిని  పరామర్శించి, వారిలో మనో స్థైర్యం పెంచేందుకు వెళ్తున్న వైయ‌స్‌ జగన్ పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అబ్బురపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మాట్లాడుతున్న తీరు పార్టీలకతీతంగా ప్రజల మనసు లను దోచుకుంది.  

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
జననేత వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. 7 రోజుల పాటు వైయ‌స్ఆర్ జిల్లాలో పాద‌యాత్ర చేసిన వైయ‌స్ జ‌గ‌న్ ఈ నెల 14నుంచి క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అడుగ‌డుగునా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, విద్యార్థి సంఘాల నాయ‌కులు త‌మ గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. వ్య‌వ‌సాయ కూలీలు, రైతులు త‌మ స్థితిని వివ‌రించి మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం తీసుకురావాల‌ని కోరుతున్నారు.  బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడేది ఒక్క వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌యే అని ప్రజలంతా బలంగా విశ్వసిస్తున్నారు. విసుగు, విరామం లేకుండా.. అలుపెరగకుండా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. దారిపొడవునా సామాన్యుల గుండె చప్పుళ్లు వింటూ.. జనంతో మమేకమవుతూ పేటలు, గ్రామాలు దాటుతున్నారు. 

చ‌లిని లెక్క చేయ‌ని జ‌న‌నేత‌
అస‌లే చ‌లికాలం..అయినా స‌రే ఆయ‌న సంక‌ల్పం ముందు అన్ని త‌క్కువే అని రుజువ‌వుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్  జగన్‌ దినచర్య తెల్లవారు జాము 4.30 గంటల నుంచే ప్రారంభమవుతుంది. గంట వ్యాయామం తర్వాత.. పత్రికా పఠనం.. అనంతరం ముఖ్యులతో ఫోన్‌ సంభాషణ.. తర్వాత ఉదయం 6.00 – 6.30 గంటలకే సిద్ధమై పార్టీ ప్రముఖులు, ఇతర ముఖ్యులతో భేటీ అవుతారు. ఆ రోజు సాగే పాదయాత్ర మార్గం గురించి చర్చిస్తారు. నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. క్షణం ఆలస్యం చేయకుండా ప్రజలతో మమేకం కావడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. రాత్రి ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమించినా ఎట్టిపరిస్థితుల్లో ఉదయం 8 – 8.10 గంటలకల్లా ఆయన తన టెంట్‌ నుంచి బయటకు వస్తారు. అప్పటికే బయట గుమికూడిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడతారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఓపికగా వింటున్నారు. వారితో ఆత్మీయంగా మెలుగుతూ ఆదరాభిమానాలు చూపడంలో ఆయనకు ఆయనే సాటి. 

 ఆకలిదప్పులు లేవు.. 
పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆక‌లిద‌ప్పులు లెక్క చేయ‌డం లేదు. ఉదయం అల్పాహారంగా కేవలం గ్లాస్‌ జ్యూస్‌ మాత్రమే తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయం మించిపోతున్నా తన కోసం వచ్చిన వారందర్నీ ఓపిగ్గా పలకరించాకే ఆయన భోజనానికి వెళతారు. అంత చేసినా ఆయన మధ్యాహ్న భోజనంలో తీసుకునేది ఒకే ఒక పుల్కా, పప్పు, మూడు కూరలు మాత్రమే.  రాత్రి పూట భోజనం ఒక పుల్కా, కొంచెం ఎగ్‌ బుర్జీ, పప్పు, మరో కూరతో ముగిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కప్పు పాలు తాగుతారు.  నిర్వాహకులు భోజన విరామానికీ, విశ్రాంతికీ సమయం కేటాయించినా గత తొమ్మిది రోజుల్లో ఎన్నడూ ఆయన విశ్రమించిన దాఖలాల్లేవు. అలా నడుం వాల్చగానే  పదండి.. పదండి.. చాలా దూరం పోవాల్సి ఉంది.. అంటూ బయటకు వచ్చి సహాయకులను అప్రమత్తం చేయడం గమనార్హం. గమ్యం చేరే వరకూ విరామం లేదు మనకు.. అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కదం తొక్కుతూ పదం పాడుతూ ముందడుగు వేస్తున్న జన వాహినితో మమేకానికే ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ రోజుకు యాత్ర ఎక్కడ ముగించాలో అక్కడికి చేరేలోగా సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవడం, వాళ్ల సమస్యలు వినడమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతోంది. తెల్లటి చొక్కా, క్రీమ్‌ కలర్‌ ప్యాంట్, కాళ్లకు బూట్లతో రహదారిపై నడుస్తూ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ జగన్‌ యాత్ర సాగిస్తున్నారు. జనం ఎదురేగి చేసే అభివాదాలకు ప్రత్యాభివాదాలు, నమస్కారాలకు ప్రతి నమస్కారాలు, ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ.. జనం చెప్పే సమస్యలు వింటూ.. సలహాలు తీసుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు.  దేశ చ‌రిత్ర‌లోనే ఇంత సుదీర్ఘ‌మైన పాద‌యాత్ర చేసిన నాయ‌కులు లేరు. ఏకంగా 3 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్టిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎంద‌రో రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అచ్చం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాదిరిగానే ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఈ యాత్ర‌ను చూస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ అనుకున్న‌ది సాధిస్తార‌ని విశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.
 

Back to Top