- ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇచ్చి తీరాల్సిందే
- ప్రత్యేకహోదా కోసం అందరూ కలిసి పోరాడాలి
- రాజీపడిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు
- వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్
న్యూఢిల్లీః ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా ఏపీ ప్రజల హక్కుల కోసం ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెండేళ్లుగా రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. హోదా కోసం అన్ని పార్టీలన నేతలను కలుపుకొనిపోతున్నారు. హోదా ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే ప్రగల్భాలు పలికిన టీడీపీ, బీజేపీలు ఐదుకోట్ల ఆంధ్రులను మోసం చేశాయి. ఈనేపథ్యంలో వైయస్సార్సీపీ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది.
ప్రత్యేక హోదా విషయంలో విస్తృతంగా ఉద్యమం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
అందులో భాగంగా నిన్న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించిన వైయస్ జగన్ బృందం...కాసేపటి క్రితం సీపీఐ సీనియర్ నేత డి రాజను కలిశారు. డి రాజాతో సమావేశం అనంతరం మీడియాతో వైయస్ జగన్ మాట్లాడారు. జీఎస్టీ బిల్ రూపొందిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పనిసరైందన్నారు. జీఎస్టీ బిల్ రాకముందు సేల్స్ టాక్స్ రాష్ట్రం పరిధిలో ఉండేదని, ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్లిందన్నారు. కేంద్రం జీఎస్టీ రాయతీలను ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే అందిస్తుంది కాబట్టి ఆధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పని సరి అని వైయస్ జగన్ అన్నారు.
లక్ష 65వేల కోట్ల రూపాయలు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని అరుణ్ జైట్లీ అనడం తగదని వైయస్ జగన్ అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులనే ప్రత్యేక ప్యాకేజీ అనడం తగదని చంద్రబాబే అన్నారని.... కాబట్టి కేంద్రం రాష్ట్రానికి ఇంతవరకు ఇచ్చిందేమీ లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి పోరాడాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. హోదావిషయంలో రాజీ పడిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. స్వాతంత్ర్యం కోసం దేశం యావత్తూ దశాబ్ధాలపాటు పోరాడింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ సీపీ కూడా ఎంతకాలమైనా పోరాటం చేస్తూనే ఉంటాం. హోదా సాధించేదాకా వెనక్కి తగ్గేదేలేదు' అని వైయస్ జగన్ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
సమావేశమనంతరం డి. రాజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అందరం కలసి పోరాడుదామని రాజా అన్నారు. గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ పీఎంగా ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. పార్టీలు అధికారం మారినా ప్రభుత్వం స్థిరంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా తప్పని సరిగా ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేయడం తగదన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10సంవత్సరాలు కావాలని అన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు...ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. ప్రత్యేకహోదాపై ఉద్యమించేందుకు ఇతర లెఫ్ట్ పార్టీలతో చర్చిస్తామని రాజా తెలిపారు.