నాన్నగారిలా జనం గుండెల్లో స్థానం సంపాదించాలన్నదే నా పుట్టినరోజు సంకల్పం

 21.12.2018, శుక్రవారం 
దామోదరపురం క్రాస్, శ్రీకాకుళం జిల్లా 

సరిగ్గా పదిహేనేళ్ల క్రితం 2003, జూన్‌ 11న... తన పాదయాత్రలో భాగంగా, ఇదే దండుగోపాలపురంలో నాన్నగారు బసచేశారు. అదే గ్రామంలో, అదే చోట నేడు నేనూ బస చేయడం విశేషం. నా 327 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో జరిగిన అపురూపమైన సంఘటన ఇది. నా పుట్టిన రోజునాడు ఇటువంటి ప్రదేశంలో నిదురించే అవకాశం రావడం దైవ నిర్ణయం. నాన్నగారే నా జన్మదినాన స్వయంగా ఆశీర్వదించిన మధురానుభూతి కలిగింది.  

‘ప్రతి పేదవాడి ముఖాన నవ్వులు చూసినప్పుడే నా నిజమైన పుట్టినరోజు’ అని నాన్నగారు తరచూ అనే మాటలు పదే పదే గుర్తొచ్చాయి. జనం మెచ్చిన పాలన అందించిన ఆయన ఆ జనం గుండెల్లో నిలిచిపోయారు. జనహితంలో ఆయన కన్నా రెండడుగులు ముందుకు వేయాలని, నాన్నగారిలా జనం గుండెల్లో స్థానం సంపాదించాలన్నదే నా పుట్టినరోజు సంకల్పం. అప్పట్లో నాన్నగారు ఇక్కడ విడిది చేసిన రోజు కొన్ని వందల కోయిలలు ఇక్కడికి వచ్చి, తమ కుహూ కుహూ రాగాలతో సంగీతామృతాన్ని పంచాయని స్థానికులు గుర్తుచేసుకున్నారు.   

శిబిరం నుంచి బయటకు రాగానే ఎందరో ఆత్మీయులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వరుస తుపానులతో ప్రజలు కష్టాల్లో ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని, నా సూచన మేరకు పార్టీ శ్రేణులు, ఆత్మీయ అభిమాన జనం.. ఆడంబరాలకు దూరంగా ఉండి, అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిసి సంతోషం కలిగింది. దారి పొడవునా ఎంతో మంది అక్కచెల్లెమ్మలు, చిన్నచిన్న పిల్లలు సైతం పూలు పట్టుకుని వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులకు నాతో అన్నప్రాసనలు, మరికొందరు అక్షరాభ్యాసాలు చేయించారు. వారందరి ప్రేమ, ఆప్యాయతలు నా పుట్టినరోజును మరింత ఆనందమయం చేశాయి.  

ఈ నియోజకవర్గంలో మంత్రిగారి అరాచకాలు దళిత మహిళ చుక్కా గున్నమ్మతో మొదలయ్యాయట. చాకిపల్లి దళితవాడకు చెందిన గున్నమ్మకు భర్త చనిపోయి ఐదేళ్లయిందట. ఒక్కగానొక్క కూతురుతో బతుకుతోంది. గతంలో ఉన్న కాస్త స్థలాన్ని అంగన్‌వాడీ కేంద్రానికి వితరణగా ఇచ్చిన కుటుంబం వారిది. ఆ కేంద్రానికి దగ్గర్లోనే చిన్నబడ్డీ కొట్టు పెట్టుకుని జీవిస్తోంది. నాన్నగారంటే ఎనలేని అభిమానం. ఆ ఊరికి సర్పంచ్‌ కూడా అయింది. ఇక్కడి నాయకుడు మంత్రి పదవి చేపట్టిన మరునాడే, పార్టీ వివక్షతో, దుగ్ధతో జేసీబీలు తెప్పించి, వారి బడ్డీకొట్టును పెకలించి, ధ్వంసం చేయించి మరీ.. అదే స్థానంలో మరో బడ్డీకొట్టును పచ్చచొక్కాతో పెట్టించారట. ఉపాధి కోల్పోయిన గున్నమ్మ కూలీగా మారింది. ఇది చాలదన్నట్లు ఆమెకు వితంతు పింఛన్‌ కూడా రానీయకుండా, నాలుగేళ్లు వేధించిన దుర్మార్గం ఈ నేతలది. ఇంతకన్నా పైశాచికత్వం ఉంటుందా? ఈ నియోజకవర్గంలో ఈ తరహా అరాచకాలు లేని గ్రామమే లేదట.  

తాళ్లవలసలో పది దళిత కుటుంబాలు నాలుగున్నర ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పొంది సాగుచేసుకుంటున్నాయట. కేవలం రాజకీయకక్షతోనే నీరు–చెట్టు పేరు చెప్పి ఆ భూముల్ని చెరువులో కలిపేశారని ఆ దళిత సోదరులు వాపోయారు. ఎస్బీ కొత్తూరులో నిర్దాక్షిణ్యంగా యాభై ఎనిమిది మంది పింఛన్లు తొలగిస్తే, కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సివచ్చిందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉన్నది అహంకారంతో విర్రవీగడానికా? పదవులొచ్చింది ప్రజలను పీడించడానికా? 

చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాజధాని భూములు మొదలుకొని గ్రామస్థాయి నీరు–చెట్టు వరకూ ప్రతి చోటా అధిక శాతం పేదవారైన బడుగు బలహీన వర్గాలు, దళితులనే బలి చేస్తుండటం వాస్తవం కాదా? రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా దళితులపై దౌర్జన్యాలు, దారుణాలు, అరాచకాలు, అఘాయిత్యాలు జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనన్న వాస్తవాన్ని కాదనగలరా? మరి ఎవర్ని మోసగించడానికి మీ దళిత తేజం?.   
- వైఎస్‌ జగన్‌   

 

తాజా వీడియోలు

Back to Top