11–12–2018, మంగళవారం, కృష్ణాపురం, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు పాదయాత్ర ఆమదాలవలసలో సాగింది. వైఎస్సార్‌గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా మా జీతాలు పెరిగింది లేదన్నారు.. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది. బాబుగారొచ్చాక జీతాల మాట దేవుడెరుగు.. ఉద్యోగ భద్రతే కరువైందని బాధపడ్డారు. అర్బన్ హెల్త్ సెంటర్లను సీఎం ఆరోగ్య కేంద్రాలుగా మార్చి.. కమీషన్ల కోసం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారట. గతంలో ఒక్కో సెంటర్ నిర్వహణకు నెలకు రూ.66,700 ఇస్తే.. ఇప్పుడు దాదాపు ఆరు రెట్లు పెంచేసి ఏకంగా రూ.4.20 లక్షలు ఇస్తున్నారట. మరి ఉద్యోగుల జీతభత్యాలు పెరిగాయా అంటే ఒక్క పైసా పెరగకపోగా ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారట. మందులు, వైద్య సదుపాయాలన్నా మెరుగయ్యాయా అంటే పూర్తిగా పడిపోయాయట. మరి ఆ నిధులన్నీ ఎవరి జేబులు నింపుతున్నాయో అర్థం చేసుకోండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.. సీపీఎస్ ఉద్యోగ సంఘం వారు. తెలంగాణ అసెంబ్లీలోనేమో సీపీఎస్‌ను ఎందుకు రద్దు చేయరని నిలదీస్తారు. ఇక్కడ మాత్రం నా పరిధిలో లేదంటారు. తెలంగాణలోనేమో సీపీఎస్‌ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెడతారు. ఇక్కడ మాత్రం రద్దు చేయాలని అడిగిన పాపానికి ఉద్యోగుల మీద కేసులు పెడతారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని గాంధీ జయంతి రోజు ధర్నా చేసినందుకు 26 మందిపై కేసులు పెట్టారట. వారిలో ఓ ఉద్యోగి తండ్రిగారైన 80 ఏళ్ల వృద్ధుడు సైతం ఉండటం చాలా బాధనిపించింది. రైతుల మీద, ఉద్యోగుల మీద, ప్రజల మీద ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గ పాలన కాక మరేమిటి? ఈరోజు పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఆత్రుతగా ఆరా తీస్తుండటం గమనించాను. పార్టీ పుట్టుక నుంచి వచ్చిన వైరాన్ని సైతం పక్కనపెట్టి, సిద్ధాంతాలకు.. విలువలకు నిస్సిగ్గుగా తిలోదకాలిచ్చి, అనైతిక.. అవకాశవాద పొత్తులతో, ఓటుకు కోట్లు తదితర అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఆంధ్రాలో దోచిన వేల కోట్లతో తెలంగాణ ప్రజా తీర్పును కొనుగోలు చేయాలని చూసిన ఊసరవెల్లికి ఉండేలు దెబ్బలాంటిది.. తెలంగాణ ఎన్నికల ఫలితం. అవినీతి సొమ్ముతో, అనుకూల మీడియాతో ఏదైనా సాధించగలనని, ప్రజలను కొనేయగలనని విర్రవీగే నిరంకుశ నేతలకు చెంపపెట్టులాంటిది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఓటుకు కోట్లు కేసులో మీరే దొంగని తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు పదేపదే మిమ్మల్ని విమర్శిస్తున్నా తేలుకుట్టిన దొంగలా నోరు మెదపకపోవడానికి కారణమేంటి? ఫిరా యింపు ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించండని తెలంగాణలో ప్రచారం చేసిన మీకు.. అదే మాట మన రాష్ట్రంలోనూ చెప్పగల నిజాయితీ, ధైర్యం ఉన్నాయా? - వైఎస్ జగన్