విశాఖ భూదోపిడీలో అధికార పెద్దల జిమ్మిక్కులు..విఠలాచార్య సినిమాను మరిపిస్తున్నాయి..

  
09–09–2018, ఆదివారం,
తాటిచెట్లపాలెం, విశాఖ జిల్లా  

ఈరోజు విశాఖ నగరంలో గోపాలపట్నం నుంచి కంచరపాలెం వరకు.. నాన్నగారి హయాంలో ఏర్పాటైన విశాలమైన బీఆర్‌టీఎస్‌ రహదారిలో యాత్ర సాగింది. నాన్నగారి పాలనలో విశాఖపట్నం మహా విశాఖగా రూపుదిద్దుకుంది. మౌలిక వసతుల కల్పన మొదలుకుని.. ఐటీ కారిడార్లు, సెజ్‌లు, ఫార్మాసిటీలతో అభివృద్ధిలో దూసుకెళ్లింది. కానీ ఈ నాలుగున్నరేళ్లలో భూదోపిడీలు, అరాచకాలతో రెక్కలు తెగిన పక్షిలా మారింది. విశాఖలో అసలు భూములకన్నా.. అన్యాక్రాంతమైనవే ఎక్కువేమో అనిపిస్తోంది. 100 గజాల నిరుపేదల స్థలాలు మొదలుకుని.. వేల ఎకరాల ప్రభుత్వ భూముల వరకు.. అక్రమార్కుల కన్నుపడనివి లేవంటే అతిశయోక్తి కాదేమో! ఎక్కడో బర్మా నుంచి వచ్చి ఇక్కడ కాందిశీకులుగా స్థిరపడ్డవారికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన స్థలంపై కన్ను పడిందట ఈ పచ్చ నేతలకు. ఆ పునరావాస కేంద్రంలో ఉన్న కాందిశీకులు నా దగ్గరకొచ్చి ఆ విషయాన్ని మొరపెట్టుకున్నారు. తమకిచ్చిన భూమిని.. తప్పుడు రికార్డులు చూపించి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

విశాఖలో జరుగుతున్న భూమాయ వింటుంటే.. దిగ్భ్రాంతి కలుగుతోంది. ఈ దోపిడీలో అధికార పెద్దల జిమ్మిక్కులు విఠలాచార్య సినిమా మాయాజాలాన్ని మరిపిస్తున్నాయి. లేని స్వాతంత్య్ర సమరయోధుల పేర.. తప్పుడు రికార్డులు సృష్టించి భూములు కొల్లగొడుతున్నారంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హుద్‌హుద్‌ తుపానుకు కోలుకోలేని విధంగా విశాఖ నష్టపోతే.. ఈ ప్రభుత్వ పెద్దలు, వారి బినామీలు మాత్రం ఊహకందని రీతిలో భారీగా లబ్ధి పొందారు. దాదాపు లక్ష ఎకరాల భూరికార్డులు హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాయని ప్రభుత్వం మాయ మాటలు చెబుతోంది. అదే సమయంలో.. తప్పుడు రికార్డులతో భూములన్నీ పచ్చ రాబందులకు పలహారమయ్యాయి. ‘ఎంతటి సంక్షోభంలోనైనా నేను అవకాశాలు వెతుక్కుంటాను’అని బాబుగారు పదే పదే చెబుతుంటారు.. అది ఇదేనేమో! 


ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన.. నిజంగా ‘కల్పనే’. సరళాదేవి బలహీనవర్గానికి చెందిన పేద మహిళ. తను దుస్తులు కుడుతూ.. భర్త నైట్‌వాచ్‌మన్‌గా పనిచేస్తూ.. బిడ్డల్ని చదివించుకున్నారు. ఇద్దరు కొడుకులూ రెండున్నరేళ్ల కిందట మంచి మార్కులతో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. కూతురు మెడిసిన్‌ చదువుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగానే కావడంతో ఉన్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టారు.. అప్పుల పాలయ్యారు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగానికైనా నోటిఫికేషన్‌ పడకపోదా.. అని బిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం వచ్చినా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఆ తల్లి ఆశపడుతోంది.  

ఎంసీఏ చేసిన సత్యాపతిదీ అదే బాధ. ఎస్సీ కోటాలోనైనా చిన్నపాటి ఉద్యోగం రాకపోదా.. అని ఎదురుచూశాడు. బాబుగారి భృతి అయినా వస్తుందేమోనని ఆశపడ్డాడు. చివరికి ప్రభుత్వం చిన్న అటెండర్‌ ఉద్యోగం ఇచ్చినా చేరిపోవాలనుకున్నాడు. ఆశలన్నీ అడియాసలయ్యాయి. కనీసం రేషన్‌ కార్డుకూ గతి లేదు. భార్యాపిల్లల్ని ఎలా పోషించుకోవాలంటూ దిగులుపడ్డాడు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ విశాఖలోనే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి.. ఆర్భాటంగా మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. కనీసం వాటికి పెట్టిన ఖర్చుమేరకైనా రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరిందా? ఈ నాలుగున్నరేళ్లలో కొత్తగా వచ్చిన ఐటీ కంపెనీల కన్నా మూతపడ్డవే ఎక్కువ.. అన్నది వాస్తవం కాదా?
-వైయ‌స్‌ జగన్‌

Back to Top