ప్రజల బతుకుల్ని ఛిద్రం చేస్తే..అదేం అభివృద్ధి?

18–07–2018, బుధవారం 
ఆదిత్య కళాశాల సెంటర్‌(కాకినాడ), తూర్పుగోదావరి జిల్లా  

వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన నెల్సన్‌ మండేలా శత జయంతి రోజున ఆ మహనీయుడిని స్మరించుకున్నాను. వివక్ష అనే పదం గుర్తుకు రాగానే.. ఏడు పదులు దాటిన అవ్వాతాతలకు, వంద శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ఏ ఆదరణా లేని వితంతు అక్కచెల్లెమ్మలకు, బతుకు భారంగా నెట్టుకొస్తున్న నిరుపేదలకు సైతం.. పార్టీ వివక్షతో సంక్షేమ పథకాలను దూరం చేస్తున్న ఈ పాపపు పాలన గుర్తొచ్చింది. ఉదయం శిబిరం నుంచి అడుగు బయట పెట్టింది మొదలు.. రాత్రి పాదయాత్ర ముగిసే దాకా.. అడుగడుగునా అశేష జనసందోహం. మొదటి కిలోమీటరు పాదయాత్రకే మూడు గంటలకు పైగా సమయం పట్టింది. వేలాది మంది ఆత్మీయులు వెంట రాగా.. కాకినాడ రూరల్, నగరంలో నడక సాగింది.    

కాకినాడ అనగానే.. మాధుర్యంతో దేశ, విదేశాల్లో ఈ ప్రాంతానికే పేరు తెచ్చిన కాకినాడ కాజా, పేరెన్నికగన్న ఆర్యవైశ్య సుబ్బయ్య భోజనం గుర్తొస్తాయి. పెన్షనర్ల ప్యారడైజ్‌గా పేరున్న కాకినాడలో ఇప్పుడు సెటిల్‌ కావాలంటే.. సమస్యలతో తలపడాల్సిందే. దేశంలోని 20 స్మార్ట్‌ సిటీలలో ఒకటిగా తొలి జాబితాలోనే కాకినాడ ఎంపికైంది. కానీ అభివృద్ధి పనుల పురోగతిలో మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచింది. నాలుగేళ్లు బీజేపీతో చేసిన సంసారానికి ఫలితంగా బాబుగారు కాకినాడకు ఇచ్చిన కానుకేమో ఇది.  


నాలుగేళ్లుగా డీఎస్సీ పెట్టకుండా కేవలం టెట్లు మాత్రం నిర్వహించడం వెనుక ఆంతర్యమేంటంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.. నిరుద్యోగ యువకులు. టెట్‌లోని మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటం, అర మార్కు తేడాలోనే తలరాతలు మారే పరిస్థితి ఉండటంతో.. టెట్‌లో ఒక్కసారి అర్హత సాధించిన వారు సైతం మళ్లీ మళ్లీ అదే పరీక్ష రాయాల్సి వస్తోందని చెప్పారు. లక్షలాది మంది అభ్యర్థులు ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి వస్తోందన్నారు. డీఎస్సీ నిర్వహించకుండా టెట్లతోనే సరిపెట్టడం.. ఆ పరీక్షలు నిర్వహించే ప్రయివేటు ఏజెన్సీలకు, ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లకు దోచిపెట్టడానికేనన్నది వారి ఆవేదన.  

కాకినాడలో బైపాస్‌ రోడ్డు పేరిట మా బతుకులను బుల్డోజర్ల కింద నలిపేశారు.. అంటూ సత్యవతక్క కన్నీటి పర్యంతమైంది. కూలి పనులు చేసుకుంటూ పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ముకు జతగా.. ఉన్న చిన్నపాటి ఇంటినీ అమ్ముకుని.. కూతురు పెళ్లికి ఉపయోగపడుతుందని 85 గజాల స్థలం కొందట. అప్పుడు వాళ్లు గజం రూ.3,500కి కొంటే.. బైపాస్‌ రోడ్డుకంటూ ఆ పేదల చిరు ఆస్తిని లాగేసుకుని గజానికి రూ.980 ఇస్తామని లెక్కకట్టిందట ఈ ప్రభుత్వం. మార్కెట్‌ విలువ గజం రూ.15 వేల పైచిలుకేనట. ఆ స్థలం కోసం చేసిన అప్పులు కూడా ఈ పరిహారంతో తీరవంటూ ఆ అక్క బావురుమంది. ఇంతకుముందున్న ఇల్లూ పోయే.. జీవితాంతం చెమటోడ్చి కూడబెట్టుకున్న సొమ్మూ పోయే.. బిడ్డ కోసం కొన్న స్థలమూ పోయే.. కూతురు పెళ్లీ నిలిచిపోయే.. అప్పులు మాత్రం మిగిలిపోయే.. ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం.. అంటూ ఆ అక్క కన్నీరుమున్నీరైంది.  

తోపుడు బండిపై గాజులమ్ముకునే మరో సోదరుడిదీ అదే కష్టం.. తన కష్టాన్నంతా ధారపోసి కూడబెట్టుకున్న సొమ్ముతో పాటు భార్య మెడలోని పుస్తెలు కూడా అమ్మి 90 గజాల స్థలం కొన్నాడట. ‘సార్‌.. కనీసం గవర్నమెంట్‌ రిజిస్ట్రేషన్‌ విలువ కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం.. మీ చావు మీరు చావండని అంటుంటే.. మేము ఏమైపోవాలి.. అంటూ రోదించాడు. కడుపుకట్టుకుని మరీ కట్టుకున్న కలల గూడు చెదిరిపోయిన విషాదం వారిది. నడకుదురు, తోరంగి తదితర గ్రామాల్లో ఇలాంటి నిరుపేదలు మరెందరో ఉన్నారట. వారి కష్టం వింటుంటే గుండె బరువెక్కింది. అభివృద్ధి పనులు ఆహ్వానించదగ్గవే.. కానీ ఆ పనుల మాటున సర్వం కోల్పోతున్న పేదలకు.. న్యాయం చేయకపోతే ఎలా? ప్రజల బతుకుల్ని ఛిద్రం చేస్తే అదేం అభివృద్ధి? పేదల బతుకుల్ని తొక్కేసి.. పెద్దల కడుపులు నింపడమే బాబుగారి మార్కు అభివృద్ధేమో!  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అవినీతిపై తప్ప అభివృద్ధిపై ఏనాడైనా శ్రద్ధ చూపారా? కాకినాడ కోసం పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రో కారిడార్, లాజిస్టిక్స్‌ యూనివర్సిటీ, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, వీసీఐసీ కారిడార్‌లోకి కాకినాడ.. అంటూ పలు హామీలను గుప్పించారు. మీరు ఇచ్చిన హామీలు మీకైనా గుర్తున్నాయా? ఏ ఒక్కటైనా నెరవేర్చానని గుండెలపై చెయ్యేసుకుని చెప్పగలరా?  
-వైయ‌స్‌ జగన్‌    
Back to Top