జగన్మోహన్ రెడ్డికి మేలు కలగాలి

హైదరాబాద్ 22 జూన్ 2013:

హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో లోక కల్యాణార్థం వందలాది వేదపండితులు శత  చండీయాగం  నిర్వహించారు. మంత్రోచ్చారణల మధ్య శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వైయస్ఆర్‌ కాంగ్రెస్  అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై కుట్రలు తొలగిపోవాలని యాగం సందర్భంగా పూజలు నిర్వహించారు.  వందలాది మంది భక్తులు, జగన్మోహన్ రెడ్డిగారి అభిమానులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు గోపూజ, వృషభ పూజ, అశ్వపూజ, గోప్రదక్షిణ, యాగ మంటప ప్రవేశం జరిగాయి. గోవులను, అశ్వాలను, వృషభాలను మంటపం వద్దకు తీసుకొచ్చి పూజలు చేశారు. అనంతరం వేదబ్రహ్మ కేఎల్ సత్యనారాయణస్వామి బృందం గణపతి పూజ, స్వస్తి వచనం, నాంది కంకణ ధారణ, షోడశ కుంభ పూజ, కలశ స్థాపన, మహారుద్ర పారాయణం, సుబ్రహ్మణ్య సూక్తపారాయణం నిర్వహించింది. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యునిగా వైయస్ వివేకానందరెడ్డి పాల్గొని కంకణ ధారణ చేశారు.

శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి పేరుతో సంకల్పం చెప్పారు. మూడు రోజులు సాగే ఈ యాగంలో పాల్గొనేందుకు వందలాది మంది కంకణ ధారణ చేశారు. తర్వాత పంచముఖ హనుమత్ పారాయణం, మహానైవేద్యం, మహా మంగళ హారతి నిర్వహించారు. తర్వాత కార్యక్రమాల కమిటీ చెర్మైన్ వడ్డేపల్లి నర్సింగరావు, రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో వెయ్యిమందికి అన్నప్రసాద వితరణ చేశారు.

సాయంత్రం ఐదు గంటలకు వేద ఘోష, అంకురార్పణ, దీక్షాహోమం, సుందరకాండ పారాయణం, శతచండీ పారాయణం, నవగ్రహ జపాలు, సహస్రమోదక శతనారికేళ మహాగణపతి హోమం, సుబ్రహ్మణ్య స్వరసప్తసూక్త హోమం, మహాబలి, మహాపూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ సభ్యులు వెంకటకృష్ణారెడ్డి, భక్తవత్సల రెడ్డి, పట్టుబాల భాస్కర్‌రెడ్డి, రాకేష్ రెడ్డిలు తమ సతీమణులతో సహా పాల్గొన్నారు. శ్రీ జగన్‌పై జరుగుతున్న కుట్రలు తొలగిపోవాలని సంకల్పం చెప్పారు. వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని లోక కల్యాణార్థం శ్రీ జగన్‌పై సాగుతున్న కుట్రలు తొలగిపోవాలని సంకల్పిస్తూ పూజలు చేశారు. సినీనటుడు విజయచందర్, వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Back to Top