విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ ఎన్నికల దిశగా సన్నాహాలకు వైఎస్సార్ కాంగ్రెస్ తెరతీసింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేపట్టింది. అందుకోసం ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర పా లకమండలి సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఎన్నికలకు సంబంధించినంతవరకు ఈ కమిటీకి స్పష్టమైన విధివిధానాలను అధిష్టానం నిర్దేశించింది. పార్టీ సంస్థాగత బలోపేతం, నేతలు-కార్యకర్తలతో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎన్నికల వ్యూహాన్ని ఈ ద్విసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. త్వరలో వీరిద్దరూ నగరంలో పర్యటించి కార్యాచరణకు ఉపక్రమిస్తారు.<br/>ఎన్నికల పరిశీలకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు గుణపాఠంచెప్పాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఈ అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని జీవీఎంసీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను సన్నద్ధం చేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పార్టీని సమరసన్నద్ధం చేస్తాం. జిల్లా పార్టీ, నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు అందర్ని అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటాం. పార్టీ విజయానికి అన్ని చర్యలను తీసుకుంటాం. త్వరలో విశాఖలో పర్యటిస్తాం అని వెల్లడించారు.