కేసీఆర్ ఆటలు సాగనివ్వం

  • కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీ-వైయస్సార్సీపీ
  • కేసీఆర్ అహంకారపూరిత పాలనపై నేతల ఫైర్
  • ఫాం హౌస్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక

హైదరాబాద్ః రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు  ఇలా అందరినీ మోసం చేస్తూ కేసీఆర్ నయవంచక పాలన సాగిస్తున్నారని తెలంగాణ వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండారాఘవరెడ్డి, శివకుమార్ లు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కేసీఆర్ అహంకారపూరిత పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు.  కేసీఆర్ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశానికి వైయస్సార్సీపీని ఆహ్వానించకపోవడం పట్ల కేసీఆర్ అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వారు ఏమన్నారంటే...ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పిన కేసీఆర్ అన్నం పెట్టే రైతన్నల చేత కన్నీరుపెట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మేనిఫెస్టో భగవద్గీత అని చెప్పారు. రుణమాఫీ అన్నారు. మొదటి కేబినెట్ లోనే 43 నిర్ణయాలు చేశామని చెప్పారు. ఈ హామీలన్నీ ఏమైయిపోయాయని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు.  రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం, ఆఖరికి ప్రజల తీర్పు ను కూడా కేసీఆర్ గౌరవించడం లేదని అన్నారు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ కేసీఆర్  రాజ్యాంగానికి విరుద్ధంగా మోసాలతో రాష్ట్రాలను నడిపిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉద్యమనాయకుడిగా కేసీఆర్ కు ప్రజలు పట్టం కడితే అహంకారమదంతో ప్రవర్తిస్తున్నాడని  మండిపడ్డారు. వైయస్సార్సీపీని చూస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు.  

మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చేశారు.  ప్రాజెక్ట్ లంటేనే వైయస్సార్...వైయస్సార్ అంటేనే ప్రాజెక్ట్ లని చెప్పారు. కానీ, కేసీఆర్ ప్రాజెక్ట్ ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో 36 ప్రాజెక్ట్ లకు 40 వేల కోట్లు కేటాయించి  50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదేనన్నారు.  అలాంటి మహనీయుని కనుమరుగు చేయాలనుకుంటున్న టీఆర్ఎస్ ఆటలు సాగనీయమని హెచ్చరించారు.  వైయస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీ వెళ్లి పోయినంత మాత్రాన టీఆర్ఎస్ లో విలీనమైందనుకోవడం మూర్ఖత్వమన్నారు. కేసీఆర్  కుటుంబపాలన అంతం ప్రారంభమైందన్నారు. 

రెండున్నరేళ్ల కేసీఆర్ పాలనలో  తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ నినాదం తప్ప ఒరిగిందేమీ లేదని శివకుమార్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కొత్త నాటకాలకు తెరతీస్తూ  కేసీఆర్ ఫాంహౌస్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు. పూటకోమాటతో ప్రజలను మభ్యపెడుతున్నారని, తనకు నచ్చిన విధంగా జిల్లాల నిర్ణయం చేసుకుంటూ కంటితుడుపు చర్యగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారని విమర్శించారు. వైయస్సార్సీపీ ఎదిగితే తమ మనుగడకు దెబ్బవస్తుందని కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని వైయస్సార్సీపీకి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి కోర్టులు అనేకసార్లు మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే ధోరణి అవలంభిస్తే కేసీఆర్ కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 


Back to Top