మావి శవ రాజకీయాలైతే కాంగ్రెస్ చేసేవేంటి?

హైదరాబాద్ 20 జూలై 2013:

తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపట్టిన ఫీజు పోరుపై ప్రభుత్వం వ్యతిరేకంగా స్పందించడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు గట్టు రామచంద్రరావు తప్పుబట్టారు. తమ పార్టీనే ఆందోళన చేపట్టకుండా ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈపాటికి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని రద్దు చేసి ఉండేదని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి దీక్షతో ప్రభుత్వం వణికిందని చెప్పారు. ఈ కారణంగా తప్పుడు ప్రచారం చేసి తప్పుడు మాటలు మాట్లాడుతోందని తెలిపారు. దీక్ష విఫలమైందనీ, రాజకీయపరమైందనీ, అవసరం లేదనీ అంటూ అవాకులూ చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. సమస్యను పరిష్కరించడం మాని, పోరాడేవారిది తప్పనే కొత్త వాదాన్ని ప్రభుత్వం తెస్తోందన్నారు. పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిచేతనే ఈ దీక్షను విమర్శింపచేయడానికి ప్రభుత్వం పూనుకోవడం దురదృష్టకరమన్నారు. మంత్రులు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. దీక్ష అవసరం లేదనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ దీక్ష కార్పొరేట్ సంస్థల లబ్ధికోసమే చేస్తోందనీ, శవరాజకీయాలు చేస్తోందని విమర్శిస్తుండటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ సంఘాలు ఫీజు రీయింజర్సుమెంటు గురించి చెబితే వింటాము తప్ప వైయస్ఆర్ కాంగ్రెస్ చెబితే వినమని అనడం ఎంతవరకూ సబబన్నారు. ఇలా రకరకాల మాటలు మాట్లాడారన్నారు. బకాయిలే లేకపోతే వరలక్ష్మి అనే బిడ్డ ఎందుకు చనిపోయిందని గట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యం బకాయిలు చెల్లించమని ఒత్తిడి చేయడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. బకాయిలే లేకపోతే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదన్నారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ బొమ్మలు పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నామనడం ఎంతవరకూ సమంజసమన్నారు. రాజశేఖరరెడ్డిగారి ఆశయాల సాధన మా లక్ష్యమని చెప్పారు. రాజశేఖరరెడ్డిగారి కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఆత్మాభిమానం నుంచి పుట్టిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపడడానికి పుట్టిందే తమ పార్టీ అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకూడదనే విదేశీ సంస్కృతిని తెస్తే దాన్ని ఖండించిన పార్టీ తమదన్నారు. పేదవాళ్ళకోసం ఆందోళనలు చేయకూడదంటున్నారు... చనిపోయిన రాజీవ్, ఇందిరా గాంధీ ఫొటోలను పెట్టుకుని వాళ్లు ఆందోళనలకు దిగడం శవరాజకీయాలు కావా అని గట్టు నిలదీశారు. చనిపోయిన వారి ఫొటోలను పెట్టుకుంటేనే శవ రాజకీయాలైతే.. మరి కాంగ్రెస్ వారు ఆ ఫొటోలు ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్పాలన్నారు. ఇవి శవరాజకీయాలు కావా అన్నారు. మేం చేసిన ఆందోళనను పురస్కరించుకుని ఫీజు రీయింబర్సుమెంటు పథకంపై ప్రభుత్వ వాదనను వినిపించడమో లేక శ్వేత పత్రం విడుదల చేయడమో మాని మాపై తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ నేతలు దిగుతున్నారన్నారు.

పేదవాడు చదువుకోడానికి డబ్బే ఆటంకమైతే ఫీజు రీయింబర్సుమెంటు అనే భరోసాను మహానేత కల్పించారనీ, ఆ భరోసానే లేకపోతే ఈ పథకానికి అర్థమేంటన్నారు. ఎంతమందికి ఇచ్చారు.. ఎంత డబ్బు చెల్లించారు అనేది పక్కకు పెడితే ఓ పిల్లాడికి కాలేజీలో సీటొస్తే అతడిని చదివిస్తారా లేదా.. అందులో ఎంత ఫీజు ఉంటే అంతా చెల్లిస్తారా లేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఒక మంచి కాలేజీలో సీటొస్తే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం వారికక్కడ చదువుకునే హక్కు లేదన్నారు. అవి పెద్ద వాళ్ళు చదువుకునే కాలేజీలేనా? అని నిలదీశారు. బాగా ఉన్న కాలేజీలకు లక్షా నలభై వేలనీ, బాగా లేని కాలేజీలకు తక్కువనీ, ఇంకా బాగా లేని కాలేజీలకు మరింత తక్కువ ఫీజనీ... ఇలా రకరకాల ఫీజులు నిర్ణయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థికి 35వేల రూపాయలే ప్రభుత్వం చెల్లిస్తుందనీ, మిగిలిన ఫీజును ఆ పిల్లవాడే కట్టుకోవాలనీ చెబుతోందన్నారు.

గతంలో కూడా ప్రభుత్వం 68శాతం ఫీజు మాత్రమే చెల్లించిందన్నారు. మిగిలిన ఫీజు కోసం కాలేజీలు వత్తిడి చేస్తున్నాయన్నారు. మా దీక్షకు వచ్చిన విద్యార్థుల వివరాలపై ఇంటెలిజెన్సు విభాగం ఆరాతీసిందన్నారు. వాళ్ళు విద్యార్థులే కారని వ్యాఖ్యానిస్తున్నారన్నారు. విద్యార్థులంటే పితాని సత్యనారాయణ, బసవరాజు సారయ్య, బాలరాజులా ఉండాలట. ఫీజు రీయింబర్సుమెంటు పథకంలో ఇదే పరిస్థితి మీకే వస్తే ఎలా స్పందిస్తారని ఆయన పితాని సత్యనారాయణను ప్రశ్నించారు. తండ్రి పాత్ర వహించాల్సిన ప్రభుత్వం దానిని విస్మరించి ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌నను అరవై వేల కోట్ల రూపాయలు పెంచి.. పథకాలు తగ్గించి మీరు ప్రజలకు చేస్తున్న మేలేమిటని ప్రశ్నించారు. కిందటేడాది 85 కాలేజీలకు లక్షా ఐదు వేల రూపాయల ఫీజును నిర్ణయించారనీ, ఇప్పుడు దాన్ని లక్షా పదమూడు వేలకు పెంచారనీ చెప్పారు. ఈ కాలేజీల సంఖ్య 175కి పెరిగిందన్నారు. ఈ కాలేజీలలో పేద విద్యార్థులు చదువుకోలేని విధంగా నిబంధనలు పెట్టడం దారుణమని తెలిపారు. పేదవాళ్ళకోసం పోరాడటమే రాజకీయమైతే మేము కచ్చితంగా దానిని పాటిస్తామని గట్టు స్పష్టంచేశారు. అలాంటి రాజకీయం కోసం పేదవాళ్ళ పక్షాన మేము కచ్చితంగా నిలబడతామని చెప్పారు.

కార్పొరేట్ సంస్థలకోసం పనిచేసింది ప్రభుత్వమేనన్నారు. అందుకు ఫీజు నిర్ణయం.. వాటిల్లో సీటొచ్చిన పేద విద్యార్థికి కేవలం ముపై అయిదు వేల రూపాయలే చెల్లిస్తామనడం దీనికి తార్కాణమన్నారు. ఫీజు రీయింబర్సుమెంటును పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్యను తగ్గించి బకాయిలు లేవని ప్రభుత్వం చెబుతోందన్నారు. మౌలిక అవసరమైన విద్య, వైద్యం అంశాలలో ప్రభుత్వం ఎందుకింత కటువుగా వ్యవహరిస్తోందనా గట్టు రామచంద్రరావు ప్రభుత్వాన్ని నిలదీశారు.

Back to Top