ఎవరి అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా మద్దతు ఇస్తాం

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
ఎవరి అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా మద్దతు ఇస్తాం
వైయస్‌ఆర్‌ సీపీకి పోటీగా చంద్రబాబు తీర్మానం
ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాలు

ఢిల్లీ: రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోక్‌సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా.. లేచినిలబడి మద్దతు ఇస్తామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం నుంచి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోరాటం ఉధృతం చేస్తూ వస్తున్నామన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. మోడీ, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేశారో.. జాతీయ పార్టీల నేతలకు వివరించడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి మద్దతు ఇస్తామన్నారన్నారు. పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు వచ్చినప్పుడు వంద మంది సభ్యులు లేచినిలబడ్డారని, మరోసారి సభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందన్నారు. 

అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు రావొచ్చు కదా..

చంద్రబాబుకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలనే చిత్తశుద్ధి ఉంటే మంత్రులు రాజీనామాలు చేసినప్పుడే ఎన్డీయే నుంచి బయటకు రావొచ్చు కదా అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి పోటీగా అవిశ్వాసం ప్రవేశపెట్టాడన్నారు. 9 గంటలకు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు 9:30కి అన్ని పార్టీల మద్దతు కూడగట్టామని తన అనుకూల మీడియాతో లీక్‌లు ఇప్పించుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్, సీపీఎం నిత్యం పోరాటం చేస్తుంటే వారెలా చంద్రబాబుకు మద్దతు ఇస్తారన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 
 
Back to Top