బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం


అగ్రిగోల్డ్‌ బాధితులకు మనోధైర్యం కల్పించేందుకు రిలే దీక్షలు
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి రూపాయి చెల్లిస్తాం
అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి

విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని, ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ బాధితులకు మనోధైర్యం కల్పించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రెండ్రోజులుగా మండల స్థాయిలో రిలే దీక్షలు చేపట్టామన్నారు. విజయవాడలో చేపట్టిన రిలే దీక్షలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలకు బాధితులు స్వచ్ఛందంగా తరలివచ్చి వారి బాధలను చెప్పుకుంటున్నారన్నారు. వారికి భరోసా ఇస్తూ అధైర్యపడొద్దు అండగా ఉంటామనే హామీ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం ధర్నాలతో స్పందించకపోతే వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాధితులకు ప్రతి రూపాయి ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, అండగా ఉంటామని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మండల కేంద్రాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులతో కలిసి బాసట కమిటీ రిలే దీక్షలు చేపట్టిందన్నారు. బాధితులకు భరోసా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను అప్పనంగా కాజేయాలని కుట్రలు చేస్తోందన్నారు. హాయ్‌లాండ్‌ను కాజేసేందుకు కొత్త నాటకం ఆడుతుందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top