ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు మా పోరాటం ఆగదు: వైఎస్ జగన్

వెలిగొండ ప్రాజెక్టు(ప్రకాశం జిల్లా): సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు పోరాటం చేస్తామని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.  ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో   భాగంగా గురువారం రాత్రి ఆయన  ఇక్కడకు వచ్చారు. ప్రాజెక్టు టెన్నెల్ లోపలికి వెళ్లి  పరిశీలించిన అనంతరం  వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు రైతులు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వహస్తాలతో వెలిగొండ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తీ అవుతుందా అని ఎదురు చూస్తున్నామని ఆవుల రెడ్డి అనే  రైతు చెప్పారు. సాగుకు నీరులేక పాలు అమ్ముకొని బతుకుతున్నట్లు తెలిపారు. వైఎస్ బతికి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారని చెప్పారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు. 1996లో ఎంపీ ఎన్నికల సమయంలో  చంద్రబాబు ఇక్కడకు వచ్చి శంకుస్థాపన చేశారన్నారు.  ఎన్నికల తరువాత ఈ ప్రాజెక్టు గురించి మర్చిపోయారు. 2004 వరకు 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం 13.5 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఏడాదికి కోటిన్నర రూపాయలు కూడా కేటాయించలేదు. ఈ ప్రాజెక్టుకు 4500 కోట్ల రూపాయలు కావలసి ఉండగా, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఉపయోగపడుతుంది. 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరాంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అయితే చంద్రబాబు మొన్నటి బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. నామ మాత్రంగా నిధులు కేటాయిస్తూ రాయలసీమ అంటే  ప్రేమ అని కపట నాటకం ఆడుతున్నరని ఆయన విమర్శించారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసే నీరు 200 నుంచి 400 టీఎంసీల ఉంటుంది. గత ఏడు సంవత్సరాలుగా ఇలాగే జరుగుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో నీరు సముద్రంలో కలుస్తున్నట్లు చెప్పారన్నారు. 60 నుంచి 80 రోజులు వరదలు వస్తాయి. జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలలో నీరు సముద్రంలో కలుస్తుంది. ఆ సమయంలోనే నీటిని నిల్వ చేయవలసిన అవసరం ఉందన్నారు. నీరు నిల్వ చేసే సామర్ధ్యం ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించారు. నదులు వరదలుగా మారే సమయంలో నీటి నిల్వ కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని మన పెద్దలు నిర్ణయించారని చెప్పారు. దీని ద్వారా 200 టీఎంసీల నీరు  నిల్వ చేసి,  ఆ తరువాత కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వవచ్చుని తెలిపారు. ఇటువంటి పోలవరం ప్రజెక్టుని వదిలి, పట్టిసీమ ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని చెప్పారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బు గుంజుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్టు మొదలు పెట్టారని విమర్శించారు. ఆ ప్రాజెక్టు  టెండర్ నిబంధనలు కూడా వారికి అనుకూలమైనవారికి, అనుకూలంగా  ఉండేవిధంగా రూపొందించారని చెప్పారు.  ఆ కాంట్రాక్టర్లు అదనంగా కోట్ చేసినా,  ఆ అదనపు డబ్బుని కూడా బోనస్గా ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు 1600 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top