మేమొచ్చాక.. ప్రజా రాజధాని నిర్మిస్తాం

  • మూడేళ్లైనా రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక పడలేదు
  • అన్నీ టెంపరరీ..టెంపరరీ..టెంపరరీనే
  • రాజధానిలో బాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
  • రాష్ట్రమంతా భూముల ధరలు పెంచి రాజధాని ప్రాంతంలో అన్యాయం
  • మూడేళ్ల పాలనలో రోడ్లు కూడా వేయలేదు
  • మూడు పంటలు పండే భూములు తీసుకోవడమే దారుణం
  • రాజధాని రైతులకు అన్యాయం జరగనివ్వం
  • రాజధాని నిర్మించే బాధ్యత వైయస్‌ఆర్‌సీపీదే 
  • ప్రతి రైతుకు మేం అండగా ఉంటాం
  • నిడమర్రు రైతులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు, మోసాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా కనిపించడం లేదని, ఇంతవరకు మాస్టర్‌ ప్లాన్‌ కూడా తయారు కాలేదని ధ్వజమెత్తారు. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం వస్తుందని, రాజధాని నిర్మాణ బాధ్యతలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని, మేం అధికారంలోకి వచ్చాక బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరగనివ్వమని ఆయన భరోసా కల్పించారు. రాజధాని నిర్మాణానికి రెండు వేల ఎకరాలు సరిపోతుందని, మిగతా భూముల్లో రైతులు తమ ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు అని వైయస్‌ జగన్‌ చెప్పారు. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణ బాధిత గ్రామాల్లో వైయస్‌ జగన్‌ గురువారం పర్యటించారు. మధ్యాహ్నం నిడమ్రరు గ్రామంలో ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సంభాషణ యధావిధిగా..

వైయస్‌ జగన్‌: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు రాష్ట్రం మొత్తం చూసేలా..దేశానికి తెలిసేలా ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చాను. ఇప్పటికే మూడు సార్లు ఈ ప్రాంతంలో పర్యటించాను. ల్యాండు ఫూలింగ్‌ వ్యతిరేకించిన రైతులపై టీడీపీ దౌర్జన్యం చేసినప్పుడు, అరటి తోటలకు నిప్పంటించిన సందర్భంలో కూడా వచ్చాను. బాబు ఎక్కడైతే నోటీసులు ఇచ్చారో..బలవంతంగా భూములు తీసుకునే పెనుమాక, ఉండవల్లి, నవనూరు, ఎ్రరబాలేం గ్రామాలకు మనం పోకూడదట. ఎక్కడైతే నోటీసులు ఇచ్చారో అక్కడికి వెళ్లకూడదట. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను అక్కడికి వెళ్లకుండా బాబు అడ్డుకున్నారు. ఎందుకంటే...అక్కడ టెంపరరీ సెక్రటరేట్‌ ఉంది కాబట్టి. ప్రతిపక్ష నాయకులు ఆ రోడ్డు మీద ప్రయాణం చేయకూడదట అని మన ఎమ్మెల్యే ఆర్కే చెప్పినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కత్తి తీసుకొని పొడుస్తున్నట్లు కనిపించింది. బాబు లాంటి సీఎంను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. ఇవాళ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఏ గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేశారో ఆ గ్రామాల వారిని కూడా ఇక్కడికి రమ్మన్నాము. మీరు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు మీరే చెప్పండి. అప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం వస్తుందని దేవున్ని కోరుకుందాం. మీకు ఎల్లవేళలా వైయస్‌ఆర్‌సీపీ తోడుగా ఉంటుంది.
––––––––––––
కోటిరెడ్డి: పెనుమాక గ్రామం
 నాకు మూడున్నర ఎకరాల పొలం ఉంది.  భూ సమీకరణ చట్టం చేసినప్పుడు ఎవరైతే ఇష్టపూర్వకంగా భూమి ఇస్తారో ఇవ్వండి, ఎవరి వద్ద బలవంతంగా తీసుకోమని నాడు చంద్రబాబు చెప్పారు. అభ్యంతరాలు ఉంటే తెలపండి అన్నారు. అభ్యంతరాలు తెలియజేస్తే ల్యాండ్‌ ఫూలింగ్‌ లిస్టు నుంచి తీసివేస్తామన్నారు.  ఇక్కడ ఎకరాకు దాదాపు రూ.2.10 కోట్లు మార్కెటు ధర ఉంది. ప్రభుత్వం మాకు రూ.18 లక్షలు ఇస్తుందట. గతంలో రూ.2.50 కోట్లకు  ఎకరా భూమి అమ్ముకుంటే, చంద్రబాబు ఈ ధరకు అమ్ముకోవద్దు, ఇంతకంటే ఎక్కువ ధర వస్తుందని సీఎం చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 200 శాతం రిజిస్ట్రేషన్‌ రేట్లు పెంచారు. ఇక్కడ మాత్రం పెంచలేదు. 

వైయస్‌ జగన్‌: రిజిస్ట్రేషన్‌ రేట్లు రాష్ట్రవ్యాప్తంగా పెంచేశారు. బాబు ఆదాయం పెంచుకునేందుకు ఈ రేట్లు పెంచారు. ఎక్కడైతే భూములు లాక్కోవాలనుకున్నాడో అక్కడ రేట్లు పెరగకుండా జీవోలు ఇచ్చారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలన్న ఆలోచన బాబుకు లేదు. రైతులను ఎప్పుడు మోసం చేయాలన్నదే ఆయన దుర్భుద్ది. బాబు సీఎం అయి ఇవాల్టీకి మూడేళ్లు కావొస్తుంది. రాజధానిలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా ఒక ఇటుక కనిపించ లేదు. టెంపరరీ సెక్రటరేట్, టెంపరరీ అసెంబ్లీ అంటారు. అన్ని టెంపరరీ..టెంపరరీ తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. కారణం ఏంటంటే సింగపూర్‌ వెళ్తే అక్కడి వారితో మాస్టర్‌ ప్లాన్‌ అంటారు, చైనా వెళ్తే అక్కడి వారితో మాస్టర్‌ప్లాన్‌ అంటారు. సినిమా సెట్టింగ్‌లు బాగున్నాయి. ఆ డైరెక్టర్‌తో మాస్టర్‌ ప్లాన్‌ గీయిస్తానని బాబు చెబుతున్నారు. అసెంబ్లీ ఎక్కడో, సెక్రటరేట్‌ ఎక్కడో ఎవరికి తెలియదు. రాజధానిప్రాంతంలో స్కీంలు ఏ రకంగా ఉన్నాయంటే..చివరకు కాంట్రాక్టర్లను వదలలేదు. గుడి భూములు, మద్యం, ఇసుకను వదల్లేదు. టెంపరరీ సెక్రటరేట్‌ను రూ.650 కోట్లతో నిర్మిస్తున్నారు. టెంపరరీకే ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. మరో వైపు ప్లాట్లు కట్టి అమ్ముతున్నారు. అడుగుకు రూ.10 వేలు వెచ్చించి టెంపరరీ సెక్రటరేట్‌ కడుతున్నారు. రాజధాని కట్టడానికి ఎన్ని ఎకరాలు కావాలో బాబుకు క్లారీటి ఉందా? కారణం ఏంటంటే ఇప్పటి వరకు ల్యాండు పూలింగ్‌ ద్వారా 33 వేల ఎకరాలు సేకరించారు. వీటిలో 27 ఎకరాలు బలవంతంగా సేకరించారు. చివరకు అసైండ్‌ భూములు అని కూడా చూడకుండా ధౌర్జన్యంగా తీసుకున్నారు. ప్రస్తుతానికి 48 వేల ఎకరాలు బాబు ఆధీనంలో ఉంటే..ఎక్కడ కూడా అసెంబ్లీ కనిపించడం లేదు. బాబు తనకు నచ్చిన వాళ్లకు..నచ్చిన రేట్లకు ఇచ్చుకుంటు పోతున్నారు. బాబు తన సొంత వ్యాపారం ఏస్థాయిలో చేస్తున్నారంటే 1600 ఎకరాలు సింగపూర్‌ కంపెనీలకు ఇస్తున్నారు. అంతేకాకుండా రూ. 5700 వేల కోట్లు పెట్టుబడి పెట్టి మనకు 42 శాతమట.  సింగపూర్‌ వాళ్లు కేవలం రూ.600 వేల కోట్లు పెట్టుబడి పెడతారట..వాళ్లకేమో 52 శాతం ఇస్తారట. బాబు  ఇష్టమొచ్చినట్లు కమీషన్లు తీసుకొని మన భూములు వాళ్లకు కట్టబెడుతున్నారు. మీ మాటలు వింటుంటే బాధనిపిస్తుంది. రైతులకు పట్టాలు ఎక్కడ ఇస్తున్నారంటే..ఎకరా తీసుకున్న వారికి కేవలం వెయ్యి గజాల స్థలం ఇస్తారట. మెట్ట పొలం అయితే 800 గజాలు ఇస్తారట. అది కూడా ఎక్కడో ఇస్తున్నారు. ఎస్సీలకు ఎంత దారుణంగా జరుగుతుందో వారి నోట్లో నుంచే వినిపిస్తాం. పట్టాలిచ్చిన ఎవరికి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. పేపర్‌ మీద రాసి ఇస్తున్నారు. ఆ పేపర్‌ తీసుకొని వెళ్తే ఆ భూములు ఎక్కడున్నాయో రైతులకు తెలియడం లేదు. కారణం ఆ భూముల్లో మార్కింగ్‌ లేదు. రోడ్లు లేవు. కరెంటు లేదు. రిజిస్ట్రేషన్‌ చేయిస్తే ఆ ప్లాట్లు అమ్ముకునే వీలుంటుంది. ఇదే మాదిరిగానే చంద్రబాబు మ్యానిఫెస్టోలో రకరకాలుగా హామీ ఇచ్చారు. వాటికే దిక్కు లేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టినటువంటి దానికే దిక్కు లేదు. ఇప్పుడు ఇస్తున్న చెత్త కాగితాలకు ఏం గ్యారెంటీ ఉంటుంది.
––––––––––––––––––––
జగనన్న సీఎం కావాలి:  నాగరత్న: నిడమ్రరు
మేం ఎస్సీలం..ఇక్కడ భూములు కొంతమందికే ఉన్నాయి. భూములిచ్చిన వారికి నెలకు రూ. 2 వేల పింఛన్లు ఇస్తామన్నారు. అయితే టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికే పింఛన్లు వస్తున్నాయి. అది కూడా మూడు నెలలకొసారి ఇస్తున్నారు.  ఉచిత విద్య అన్నారు. అది లేదు. ఇల్లు లేదు ఎలా బతకాలి. అప్పుడేమో ఇళ్ల జోలికి రాము అన్నారు. ఉచిత వైద్యం అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగమన్నారు. ఎవరికీ ఉద్యోగం రాలేదు.  2019 నాటికి జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది.

వైయస్‌ జగన్‌: భూములు తీసుకున్న వారికి అన్యాయం చే స్తామని చంద్రబాబు ల్యాంగ్‌ ఫూలింగ్‌ సమయంలో చెప్పారు. మిగిలిన రైతులతో పాటు సమానంగా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. మనస్సున ముఖ్యమంత్రి ఎస్సీలకు వంద గజాలు ఎక్కువే ఇస్తారు.  ఇక్కడ మాత్రం ఎస్సీలకు కేవలం 800 గజాలే ఇస్తారట. ఈ మాదిరిగా విపక్ష చూపడంతో పాటు భయభ్రాంతులకు గురి చేసి వారికి అసైన్డ్‌ పట్టాలు ఉన్నా..వారి పేర్లు అడంగల్‌లో తొలగించారు. ఆ  భూములు ప్రభుత్వానివే అని బలవంతంగా లాక్కుకుంటున్నారు. ఎస్సీలు, లంక భూముల రైతులకు ఇంతవరకు కనీసం ప్లాట్లు కూడా ఇవ్వలేదు. ఇస్తామని హామీ ఇచ్చే నాథుడు లేడు. ఏ ఊర్లో భూములు తీసుకున్నారో అక్కడే ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ ఇస్తున్నారో చెప్పడం లేదు. రాజధాని ప్రాంతంలో ఎస్సీలు, బీసీలు ఉండకూడదన్నది బాబు ఆరాటం. అక్కడ తెల్ల గడ్డం వాళ్లు, నల్ల కోటు వేసుకున్న వారికే అవకాశం కల్పిస్తారేమో. ఆ రోజు ఒక్క ఇల్లు కూడా తీయమన్నారు. ఇవాళ ఏం చేస్తున్నారంటే..ఎవరైతే ల్యాండ్‌ ఫూలింగ్‌కు ఇవ్వమని చెబుతున్నారో వారిపై కక్షగట్టారు. సింగపూర్‌ వాళ్లకు నచ్చలేదని ఆ ఇల్లు కూల్చివేస్తున్నారు. ఆ ఇళ్లను ధ్వంసం చేసి రోడ్డు వేస్తున్నారు. ఇంతవరకు గ్రామకంఠాల సమస్యను తేల్చలేదు. అందరికి పట్టాలిచ్చి ఇల్లు కట్టించాల్సింది పోయి..తనకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారికి మాత్రమే పట్టాలిస్తున్నారు. రైతుల వద్ద నుంచి లిస్టు తీసుకొని వాళ్లకు తెలియకుండానే 5, 10 సెంట్లు మాయం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. తనకు నచ్చిన వారికి ఆ మాయం చేసిన భూములు ఇస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు అనంతవరం గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తిపై అక్రమ కేసు పెట్టారు. దీంతో సీఆర్‌డీఏ ఆఫీస్‌ వద్ద అతను నిప్పంటించుకున్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. నిరుద్యోగభృతి అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. మాడల్‌ విలేజ్‌గా చేస్తామన్న వ్యక్తి ఏమీ చేయలేదు. రైతు కూలీలకు రూ.2500 పింఛన్‌ ఇస్తామన్నారు. అది కూడా మొక్కుబడిగా ఇస్తున్నారు. దానిమీద నమ్మకం లేక రైతులు వలస వెళ్తున్నారు. నాలుగు నెలలకు ఒకసారి పింఛన్‌ ఇస్తున్నారు. జాబు రావాలంటే బాబు పోవాలి.
–––––––––––––
వైయస్‌ఆర్‌ హయాంలో 1800 గజాలు ఇచ్చారు:  సురేష్‌: ఉద్దండరాయపాలెం 
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జక్కంపూడి గ్రామంలో ఒక్కొక్కరికి 1800 గజాల స్థలం ఇచ్చారు. ఇక్కడ రాజధానికి భూములిచ్చిన రైతులకు 800 గజాలు ఇచ్చి బాబు గొప్పలు చెప్పుకుంటున్నారు.  మాకు నాలుగు ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. మా పొలం అడంగళ్‌లో లేకుండా రద్దు చేశారు. ఎందుకు ఇలా చేశారని తహశీల్దార్‌ను అడిగితే అడంగలే కదా రద్దు అయింది. భూములు అక్కడు ఉన్నాయని సమాధానం చెప్పారు. 

వైయస్‌ జగన్‌: సురేష్‌ ఇక్కడికి రాకముందే నన్ను కలిశాడు. సురేష్‌ ఎస్సీ, తన కుటుంబానికి నాలుగు ఎకరాలు అసైన్డ్‌ భూములు ఉన్నాయి. వాటికి సంబంధించిన డీకే పట్టా. అడంగళ్, టైటిల్‌ లీడ్స్‌ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేసిందంటే పేదవాళ్లను మోసం చేయాలని కుట్ర చేసింది. అడంగళ్‌లో సురేష్‌ వాళ్ల నాన్న పేరు తీసివేసి ప్రభుత్వ భూమి అని నమోదు చేశారు. వాళ్ల నాన్న పేరు కొట్టేసి ప్రభుత్వ భూమిగా మార్చుకుంది. పేదవాళ్లకు మేలు చేయాలన్న ఆలోచన చేయకుండా ఎలా లాక్కోవాలన్నదే బాబు దుర్భుద్ది. ఏ ఊరులో ఉన్న వారికి ఆ ఊరులోనే ఇల్లు ఇస్తామన్నారు. ఆ ప్రాంతంలో మాత్రం ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు వారి గ్రామంలో అలాట్‌ చేయలేదు. మా భూములు ఎక్కడ ఉన్నాయని అడిగితే పలికే నాథుడు లేడు. ఇంత దారుణంగా అన్యాయం చేస్తున్నారు. వీళ్ల పేర్లు కనిపించకుండా మోసం చేస్తూ.బాబు తన బినామీలతో భూములు కొనుగోలు చేయించే కార్యక్రమాలు చేశారు. రాజధాని అన్నది ఒక స్కాం కింద నడుస్తోంది. రాజధాని ఫలాన చోట పెడతామని చెబితే రైతులు సంతోషపడతారు. కానీ బాబు రాజధాని ఇక్కడ పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ రాజధాని ఫలాన చోట∙వస్తుందని తన బినామీలకు లీకులు ఇచ్చారు. బాబు బినామీలు భూములు కొనుగోలు చేసిన తరువాత రాజధాని అక్కడ కాదు ఇక్కడే అని ప్రకటించారు. తన బినామీలు భూములు కొనుగోలు చేసిన ప్రాంతాన్ని ల్యాండ్‌ ఫూలింగ్‌ నుంచి తప్పించారు. ఆ తరువాత బాబు తన బినామీలు ఎక్కువ రేటుకు భూములు అమ్ముకునేందుకు ఈ రెండు జిల్లాలను జోనింగ్‌ చేశారు. మిగిలిన రైతులు పోటీకిS రాకుండా వాళ్లను అగ్రీ జోన్‌లో పెట్టారు. ఇంత దారుణంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని చేస్తు రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. బాబును గట్టిగా ప్రశ్నించకూడదట. రేపు పేపర్లో చూడండి. బాబు మంత్రులు టీవీల ముందుకు వచ్చి వైయస్‌ జగన్‌కు ఇక్కడ రాజధాని రావడం ఇష్టం లేదని బండ వేస్తారు. అయ్య చంద్రబాబు నీవు బాడుగ ఇంట్లో ఉన్నావు. రాబోయే రోజుల్లో నేను ఇక్కడే ఇల్లు కొనుగోలు చేసి నివాసం చేస్తాను. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంతవరకు ఒక్క ఇటుక వేయలేదు. రేపొద్దున్న రాజధాని కట్టాలన్నా.. అది వైయస్‌ఆర్‌సీపీనే. మేమొచ్చాక రైతులకు నష్టం జరిగించే విధంగా చేయం. రాజధానికి కావాల్సింది రోడ్లు, అంతవరకే భూములు తీసుకోవాలి, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరేట్‌ కట్టడానికి రెండు వేల ఎకరాలు ఉంటే చాలు. మిగతా భూముల్లో రైతులు వారి ఇష్టప్రకారం చేసుకోవచ్చు. అవసరమైతే అమ్ముకుంటారు, లేదంటే వ్యవసాయం చేసుకుంటారు. బాబు రైతుల కళ్లలో కన్నీరు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పూర్తిగా మార్చుతాం. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి. ఈ రెండేళ్లు మన భూములను కాపాడుకుందాం. ఆ తరువాత మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఆ తరువాత మంచి రేటు వచ్చేలా చూస్తాం. బ్రహ్మండమైన రాజధాని కడుతాం. మేలు చేయాల్సిన చంద్రబాబు ఎవరైతే తనకు నచ్చుతారో, కమీషన్లు ఇస్తారో వాళ్లకు భూములు అప్పన్నంగా ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు . వాళ్లు కమర్శియల్‌ మాల్స్‌ కట్టుకోవచ్చట. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మాల్స్‌ కట్టకూడదట. అక్కడ మంగళి షాపులు, కూరగాయల షాపులు పెట్టుకోవాలని నిబంధనలు పెడుతున్నారు. బాబుకు నచ్చిన వాళ్లు 22 ఫ్లోర్లు కట్టుకోవచ్చట. రైతులు మాత్రం 12 ప్లోర్లే కట్టాలట. ఇదెక్కడి న్యాయం
––––––––––––––––––
జెరీబు భూములను మెట్టగా మార్చారు:  బాలాజీ, ఉండవల్లి
పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఏటా మూడు పంటలు పండుతాయని, నిబంధనల ప్రకారం ఈ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకోకూడదు. దీంతో జెరీబు భూములను మెట్టగా మార్చారు. భూసేకరణ చట్టం ప్రకారం సర్వే చేయాలి. ఆ సర్వే ప్రకారం రైతు, కైలు రైతుల నుంచి అభిప్రాయలు తీసుకోవాలి. ఈ భూములు తీసుకోవడం వల్ల జీవనోపాధి కోల్పొతారో, లేదో తేల్చాలి.  ప్రభుత్వం మాత్రం ఈపీటీఆర్‌ఐ వాళ్లతో సర్వే చేయించేందుకు మా గ్రామానికి ముగ్గురు వ్యక్తులను పంపించారు. వారిలో ఇద్దరికి తెలుగు రాదు. ఒకరికి ఈ ప్రాంతంపై అవగాహన లేదు. వాళ్లు ఇంటింటికి తిరిగి అభిప్రాయాలు సేకరించాలి. ఈ సర్వే జరగకముందు ప్రిలిమనరీ నోటిఫికేషన్‌లో పెనుమాక, ఉండవల్లిలో జñ రీబు భూములు ఉన్నాయని చెప్పారు. ఫైనల్‌ రిపోర్టులో మెట్ట భూములుగా మార్చారు. మూడు పంటలు పండే భూములు తీసుకోకూడదు. భూ సేకరణ కింద కేవలం ఒక హెక్టార్‌ మాత్రమే తీసుకోవాలి. మావి మూడు పంటలు పండే భూములు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో 36 రకాల పంటలు పండుతాయి. ఈ భూములను ఏ రకంగా మెట్ట భూములుగా మార్చుతారు. గ్రామ కంఠాలపై కూడా స్పష్టత లేదు. టీడీపీ బినామీలు రూ.2 కోట్ల నుంచి రూ.2.30 కోట్లకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. మిగతా 29 గ్రామాల్లో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ రేట్లు పెరగలేదు. మాకు తక్కువ నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు.

వైయస్‌ జగన్‌: ప్రభుత్వం చేపట్టిన ఈపీటీఆర్‌ఐ సర్వే కూడా బోగస్సే. ఆ సర్వే రిపోర్టు గ్రామం ముందు ఉంచాలి. ఆ సర్వేపై చర్చ జరగాలని, ఆ తరువాత నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. దానిమీద అభ్యంతరాలు స్వీకరించాలి. ఇవన్నీ ఏమీ జరగకుండానే భూ సమీకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. మాములుగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని ప్రాంతాన్ని డెవలప్‌ చేయాలంటే ఎయిర్‌పోర్టు నుంచి గుంటూరుకు రోడ్లు వేయాలి. బాబు సీఎం అయి మూడేళ్లు అవుతుంది. సూరాయిపాలెం నుంచి మంగళగిరి టోల్‌ప్లాజా వరకు ఎన్‌హెచ్‌ 9 – ఎన్‌హెచ్‌ 5ను కలిపాలి. అక్కడ కనీసం రోడ్లు కూడా వేయించలేదు. ఇవాళ కొత్తగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు అని వారి కడుపు కొట్టే నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏ రకంగా మోసం చేస్తున్నారో, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తాం. రెండేళ్లు భూములను కాపాడుకుంటే ఆ తరువాత మీ భూములు ఎవరూ తీసుకోరు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా తోడుగా ఉంటుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top