కేంద్ర,రాష్ట్రాల మెడలు వంచుతాం

  • కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట
  • పనికిమాలిన హామీలతో ప్రజలను వంచించిన టీడీపీ, బీజేపీ
  • లోకేష్‌ను అందరూ ఐరన్‌లెగ్‌గా భావిస్తున్నారు
  • ఆత్మగౌరవ యాత్రలో అంబటి రాంబాబు
విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ సాధిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ ఇస్తామన్న నేతల మాటలు నీటి బుడగల్లానే మిగిలిపోయాయని మండిపడ్డారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేపట్టిన పాదయాత్రలో అంబటి పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అంబటి మాట్లాడారు. ఈ సందర్భంగా విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మించి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మిత్రపక్ష బీజేపీ, టీడీపీలు హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తే గుంటూరు, విజయవాడ అంటూ కట్టుకథలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసే చందంగా టీడీపీ, బీజీపీలు పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

ప్రజల్లో పట్టుదల పెంచడానికే పాదయాత్ర
మోసం చేసిన ప్రభుత్వాలను ఎదుర్కొని హామీలను సాధించుకోవాలనే పట్టుదల ప్రజల్లో పెంపొందించే ఉద్దేశ్యంతో వైయస్‌ఆర్‌ సీపీ  అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అంబటి స్పష్టం చేశారు. గుడివాడ అమర్‌నాథ్ అకుంటిత దీక్షతో రైల్వేజోన్‌ సాధన కోసం వైయస్‌ జగన్‌తో చర్చించి ప్రజల్లో జ్ఞానోదయం తీసుకురావాలని పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. గతంలో రైల్వేజోన్‌ కోసం అమర్‌నాథ్ 5 రోజుల పాటు దీక్ష చేస్తే రాజకీయ కుట్రతో అర్థంతరంగా దీక్షను భగ్నం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. సాహసోపేతంగా 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడని కొనియాడారు. చంద్రబాబులా సాయంత్రం 7 గంటలకు కుక్కలు మొరిగే టైంలో చేసే పాదయాత్ర కాదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన వాగ్దానాలను పరిపూర్ణంగా నిర్వహించలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అని రాష్ట్రప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారని అంబటి విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. రుణమాఫీ అన్నాడు. అన్నింటిని నీరుగారుస్తున్నాడని మండిపడ్డారు. 

లోకేష్‌ను మంత్రిని చేస్తే టీడీపీ పనైపోయినట్లే
నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ అనే భావన రాష్ట్ర ప్రజానికంలో పాకుతోందని అంబటి స్పష్టం చేశారు. లోకేష్‌ నామినేషన్‌ వేసే రోజు చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ప్రమాణస్వీకారం రోజున మొగల్తూరులో 5 మంది చనిపోయారు. చంద్రబాబు ఒకసారి మీ కుమారుడి గురించి ఆలోచించుకోండి అని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీనైతే చేశారు కానీ మంత్రివర్గంలో చేర్చుకుంటే మీ పార్టీకి, మీకు ప్రమాదమని చంద్రబాబుకు సూచించారు. కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని,  2019 ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పకపోతే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. దయచేసి ఉత్తరాంధ్ర ప్రజలు ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top