కక్షపూరితంగా వైయస్‌ఆర్‌ సీపీ ఓట్లు తొలగింపు

స్వార్ధ రాజకీయాలతో ఓట్లను తొలగించడం నేరం
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటర్‌ నమోదు చేసుకోవాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్లను చంద్రబాబు కక్షపూరితంగా తొలగిస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మైనార్టీల ఓట్లు టీడీపీకి రావనే భయంతోనే ఓట్లు తొలగించారని, స్వార్ధ రాజకీయాల కోసం ఓట్లను తొలగించడం నేరమని మండిపడ్డారు. రాయచోటి పట్టణంలో సహారా వెల్ఫేర్‌ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన ఓటర్‌ నమోదు అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని, గతంలో నమోదు చేసుకున్నవారూ సైతం ప్రస్తుతం ఓటరు లిస్టులో తమ పేరు ఉందో.. లేదో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో చాలా ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మసీదులు, ప్రార్థనా మందిరాలు, సహారా వెల్ఫేర్‌ సొసైటీ, తదితరులు ఓటర్‌ నమోదుపై అవగాహన కల్పించి, నూతన ఓటు నమోదు, గల్లంతయిన ఓట్లను తిరిగి నమోదు చేయించడం అభినందనీయమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మనరాష్ట్రంలో చాలా చోట్ల ఆధార్‌ సీడింగ్‌ అని పలు కారణాలతో వైయస్‌ఆర్‌ సీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లు గల్లంతయ్యాయని చాలా మంది చెపుతున్నారన్నారు. 

సహారా వెల్ఫేర్‌ సొసైటీకి అభినందనలు..

ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, దాన్ని రాజకీయ కారణాలతో తొలగించడం నేరమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఒక్క రాయచోటి పట్టణం లోనే సుమారు 20 వేల ఓట్లు తొలగించారని తెలుస్తోందని, తిరిగి ఆ ఓటర్లందరికీ నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 4 వేల ఓట్లను నమోదు చేయించిన సహారా వెల్ఫేర్‌ సొసైటీ వారిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు సైపుల్లా, ఖాదురున్, సహారా సొసైటీ సభ్యులు అమీర్‌ వలి, అతావుల్లా, హల్వా జిలాన్, అఫ్తాబ్, అన్వర్‌ పఠాన్, జిలాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top