దీక్ష విరమించాలని జగన్మోహన్ రెడ్డికి వినతి

హైదరాబాద్ 30 ఆగస్టు 2013:

రాష్ట్రం కోసం తన దీక్షను విరమించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం విజ్ఞప్తిచేశారు. ఆరోగ్యం క్షీణించడంతో శ్రీ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు గురువారం అర్ధరాత్రి చంచల్‌గుడా జైలునుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. పరీక్షల అనంతరం దీక్షను విరమించాలని వైద్యులు చేసిన విజ్ఞప్తిని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్టీ రాజకీయాల వ్యవహారాల కమిటీ సమావేశమై పరిస్థితిపై చర్చించింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆయన దీక్షను విరమించాలని కోరాలని నిర్ణయించిన క్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ లేఖ రాశారు. పీఏసీ సమావేశానంతరం లోటస్ పాండ్ నివాసంలో శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కలలు గన్న రాష్ట్రం కాంగ్రెస్ నిర్ణయం కారణంగా అతలాకుతలమవడంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందారని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ మొగ్గు చూపిన తర్వాత గడిచిన ఈ నెలరోజుల్లో రాష్ట్రం అగ్నిగుండమైందనీ, ఇంత జరిగినా నిర్ణయంపై ఎటువంటి మార్పు కనిపించలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీక్ష చేస్తానన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని వారించి తాను గుంటూరు నిరాహార దీక్ష చేశానన్నారు. ఆ తదుపరి  తన దీక్ష భగ్నం కావడంతో జగన్ బాబు దీక్ష చేపట్టారని తెలిపారు. ఆయనను ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో వెళ్ళిన తమను జగన్ బాబును చూసేందుకు అనుమతించలేదనీ, తరవాత అనుమతించినప్పటికీ 15నిముషాలలో పోలీసులు రెండుమూడు సార్లు పోలీసులు వచ్చి బయటకు వెళ్ళిపోమని కోరారు. శ్రీ జగన్ వెంట ఉండడానికి అనుమతించాల్సిందిగా కోర్టుకు విన్నవించుకున్నామని చెప్పారు.

అంతకుముందు పార్టీ పీఏసీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తదుపరి భగ్గుమన్న ఉద్యమాలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకోవాలని ఇడుపులపాయలో నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలో తీర్మానించామనీ, దీనిపై నిర్ణయం తీసుకునే స్థితిలో తమ పార్టీ లేదని చెబుతూ తీసుకోగల అధికారం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్న విషయాన్ని స్పష్టంచేశామని కొణతాల జ్ఞాపకం చేశారు. అందరికీ సమన్యాయం చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని మొదటినుంచి కోరుతున్నామన్నారు.  వీటిని వేటిని పరిగణనలోకి తీసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధికోసం నిరంకుశంగా రాష్ట్ర విభజనకే మొగ్గుచూపిందన్నారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలే కాక, ఎంపీలు కూడా రాజీనామా చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిపించి, దమననీతికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో శ్రీమతి విజయమ్మ చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో కేంద్రం ఈ రాక్షస క్రీడను ఆపాలని తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారని వివరించారు. శ్రీమతి విజయమ్మ దీక్షను అప్రజాస్వామికంగా భగ్నం చేసిన తీరును గమనించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి తాను దీక్ష చేస్తానని నిర్ణయించుకున్నారన్నారు. ఆరు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నప్పటికీ అధికారులు కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య పరిస్థితిని తెలిచజేయలేదన్నారు. ఆరోగ్యం క్షీణించినందున కుటుంబసభ్యులకు చెప్పకుండానే ఆస్పత్రికి తరలించారన్నారు. ఇది తెలిసి తల్లిగా శ్రీమతి విజయమ్మ, భార్యగా శ్రీమతి వైయస్ భారతి ఆయనను కలవడానికి కూడా అధికారులు అనుమతించలేదని కొణతాల తీవ్రంగా మండిపడ్డారు. రెండు మూడు గంటల అనంతరం అధికారులు ఆమెను తీసుకెళ్ళి కొద్దిసేపు చూడనిచ్చారన్నారు. ఈరోజు కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అనుమతించడంలేదనీ, ఇంతకంటే దుర్మార్గమూ, దౌర్జన్యమూ ఉండవనీ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారనీ, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమరణ నిరాహార దీక్షను విరమించాల్సిందిగా పీఏసీ సభ్యులు ఆయనకు విజ్ఞప్తిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీక్షను విరమించాలని కోరుతున్నామన్నారు. సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీపై పోరాడాల్సి ఉందనీ, ఇందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరముందనీ ఆయన విజ్ఞప్తిచేశారు. తామంతా జగన్మోహన్ రెడ్డిగారి వెంట ఉంటామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top