మంత్రులను బర్తరఫ్‌ చేయాలి

 
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: ప్రభుత్వ అసమర్థత వల్లే  కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగిందని, అందుకు బాధ్యుడైన మంత్రులు దేవినేని ఉమా, భూమా అఖిలప్రియలను మంత్రివర్గం నుంచి భర్తరప్‌ చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బోటు ప్రమాదంపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తూతూమంత్రంగా కేసులు నమోదు చేసేందే తప్ప బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు తప్పుపట్టారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు మల్లాది విష్ణుతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన మంత్రి దేవినేని ఉమా నీళ్లలో బోటు మునిగిపోతే ఈ క్షణం వరకు పట్టించుకోవడం లేదన్నారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తిట్టడం కోసమే దేవినేని ఉమా స్పందిస్తుంటారని ఫైర్‌ అయ్యారు.  చంద్రబాబు పాలనను పక్కనపెట్టి  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రకు ఎవరెవరు వెళ్తున్నారని సిక్రెట్‌ కెమెరాలు పెట్టిస్తున్నారని ఆక్షేపించారు. కంప్యూటర్లు కనిపెట్టామని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రికి తన ఇంటి పక్కన అక్రమంగా బోటు నడుపుతున్నా కనిపించలేదా అని ప్రశ్నించారు.  ఇసుక తవ్వకాల వల్లే ఇవన్ని జరుగుతున్నాయని విమర్శించారు. ఎక్కడపడితే అక్కడ కృష్ణానదిలో బోటు ప్రమాదాలు జరుగుతున్నాయని,  వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బోటు ప్రమాదం ఘటనలో ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని ప్రభుత్వం చెబుతుందే తప్ప, నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు.  నాడు గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఎవరిపై చర్యలు తీసుకున్నారు. విచారణ కమిటీలతో కాలయాపన చేయడం చంద్రబాబుకు అలవాటైందని మండిపడ్డారు. అసెంబ్లీలో మాత్రం మైక్‌ పట్టి మాట్లాడుతున్న చంద్రబాబుకు  సంబంధిత మంత్రులను తొలగించే దమ్ముందా అని నిలదీశారు. ఇంతవరకు బాధ్యులను అరెస్టు చేయాలని తప్పుపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మాటల్లో చిత్తశుద్ది లేదు. పవిత్ర సంఘమాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

వైయస్‌ జగన్‌ సవాల్‌ స్వీకరించే దమ్ముందా?
ప్యారడైజ్‌ పేపర్‌ లీక్‌లపై వచ్చిన అభియోగాలపై  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు లేకుండా పోయిందని వెల్లంపల్లి శ్రీనివాసు అన్నారు.  మంత్రి లోకేష్‌కు వర్ధంతికి, జయంతికి తేడా తెలియదు. వైయస్‌ జగన్‌ సవాల్‌కు ఇవాల్టి వరకు ఎవరు కూడా స్పందించలేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో ఉన్న నేతలపై కేసులు ఉన్నాయని లోకేష్‌ అంటున్నారు. సాక్షాత్తు మీ నాన్న చంద్రబాబు ఆడియో, వీడియో కేసుల్లో దొరికిపోయారు. సుజనాచౌదరిపై కేసులు ఉన్నాయి. మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు
 
ప్రభుత్వ అసమర్థత వల్లే బోటు ప్రమాదం
వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు
మొన్న కృష్ణానదిలో జరిగిన సంఘటన దుర దృష్టకరమని,  ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ ఘటన జరిగిందని మల్లాది విష్ణు విమర్శించారు.  కృష్ణానదిలో ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రులు దీనిపై రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి విహార యాత్రకు వెళ్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో మొన్న జరిగిన బోటు దుర్ఘటనే కారణమన్నారు. పవిత్ర సంఘమాన్ని చూడకపోతే పుణ్యం ఉండదని ప్రభుత్వం ప్రచారం చేయడం వల్లే భక్తులు  ఆ విధంగా వెళ్లాల్సి వచ్చిందన్నారు.  ఏపీ టూరిజంలో జరుగుతున్న అవకతవకలను మీరు చూసి చూడనట్లు వదిలేయడం బాధాకరమన్నారు. ఏపీటీడీసీ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన వారంతా కూడా ప్రజలను మభ్యపెట్టేలా ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. నదిలో బోటులో అక్రమంగా ఎలా నడుపుతున్నారు. రివర్‌ బోటింగ్‌ సంస్థకు ఎంవోయూలు చేసేలా మంత్రులు ఒత్తిడి చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. డ్రైవర్‌ మీద చర్యలు తీసుకోవడమే కాదు, యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని, అందర్ని అరెస్టు చేయాలని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు.
 
Back to Top