చచ్చిన శవం లాంటి సబ్బం హరి: పద్మ

హైదరాబాద్:

రాజకీయంగా సమాధి అయిపోతున్నాననే అక్కసుతోనే సబ్బం హరి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మపై పిచ్చిపిచ్చిగా విమర్శలు చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖపట్నం లోక్‌సభా స్థానం బరి నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలోనే శ్రీమతి విజయమ్మపైన, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మీద అసందర్భ వ్యాఖ్యలు చేశారని పద్మ దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సబ్బం హరి పోటీ నుంచి తప్పుకుని రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.

పెద్దమనిషిగా తనను తాను అభివర్ణించుకునే హరి నిజానికి చాలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని వాసిరెడ్డి విమర్శించారు. విశాఖలో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ హరి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆమె ‌ఆరోపించారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన మరుసటి రోజు వైయస్ఆర్‌సీపీకి ఓటు వేయొద్దు, బీజేపీకి వేయాలని సబ్బం హరి మీడియా సమావేశంలో చెప్పడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాడానన్న సబ్బం విభజనకు కారకులైన టీడీపీ-బీజేపీలకు మద్దతెలా ఇస్తారని నిలదీశారు.

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అండ, చలువతో రాజకీయ‌ంగా పైకి వచ్చిన సబ్బం శ్రీమతి వైయస్ విజయమ్మపై బురద జల్లడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరిపై చర్యలు తీసుకోండి: ఈసీకి ఫిర్యాదు :

బీజేపీ- టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ ప్రచార సమయం ముగిసి మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ జరుగనున్న సమయంలో సబ్బం హరి మీడియా ద్వారా చెప్పడంపై వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడిన హరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ నాయకులు పీఎన్‌వీ ప్రసాద్, కె. శివప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డి మంగళవారంనాడు భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

తాజా వీడియోలు

Back to Top