తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతుల భేటీ అయ్యాయి. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు శ్రీ వైయస్ జగన్‌తో సమావేశమై భూసమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను శ్రీ వైయస్ జగన్‌కు వివరించిన రైతులు. భూసమీకరణకు ఒప్పుకోకపోతే, భూసేకరణకు సిద్ధమవుతున్నారని, ఈ పరిస్థితుల్లో తమకు శ్రీ వైయస్ జగన్ తప్ప, మరే అండ లేదని చెప్పుకొచ్చిన రైతులు. భూములు ఇవ్వకపోయినా, తీసుకున్నట్లు రికార్డుల్లో చూపడంతో పాటు, వాటిని ప్లాట్లుగా చేసినట్లు రికార్డులు తయారుచేసి, ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేశారని వెల్లడి. ఇంకా తమ భూముల గుండా రోడ్లు వేయడంతో పాటు, ఎత్తిపోస్తున్న నీటిని కూడా తరలిస్తున్నారని, పక్కనే రిజర్వాయర్ ఉంటే, దానికి గండికొట్టి తమ భూముల్లో పారిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్న రైతులు. తొలి విడత సమీకరణలో భూములిస్తే, ఏ మాత్రం అనుకూలంగా లేని లోతట్టు ప్రాంతాల్లో ప్లాట్లు చూపారని, ఇప్పుడు రెండో విడత సమీకరణలో మళ్లీ భూముల కోసం వేధిస్తున్నారని వెల్లడి. ఈ సందర్భంగా ఏయే రైతు ఏం మాట్లాడారంటే..: డాక్టర్ గాదె గంగాధరనాయుడు (కన్నారావునాయుడు). ఉండవల్లి: – ఉండవల్లిలో భూసమీకరణలో 1100 ఎకరాలు కావాలనుకుంటే ఇచ్చింది 250 ఎకరాలు మాత్రమే. అందులో రైతులు ఇచ్చింది 70 నుంచి 80 ఎకరాలు మాత్రమే. అక్కడ పారిశ్రామికవేత్తలు ఇచ్చిందే ఎక్కువ. రూ.150 కోట్లతో కరకట్ట రోడ్డు విస్తరణకు మీ ప్రభుత్వంలో ముందు కెళ్లారు. అదే రోడ్డు కోసం వాళ్లు రూ.1100 కోట్ల నుంచి రూ.1200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు సీడ్ యాక్సెస్ రోడ్డు అన్నది అవసరమే లేదు. అయినా రోడ్డు కోసం అయితే భూమి ఇస్తామన్నా, ఎక్కువ భూములు ఇవ్వమని అడుగుతున్నారు. కరకట్ట విస్తరణ ద్వారా 4 లేన్ రోడ్డు వేసుకోవచ్చు. మేము సమీకరణలో వస్తే దేవాలయ భూముల్లో ప్లాట్లు ఇస్తామంటున్నారు. కానీ దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. నిజానికి ఉండవల్లి గ్రామానికి ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు. కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ జరుగుతోంది. బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మున్నంగి శ్రీధర్‌రెడ్డి. ఉండవల్లి: – మేం అధికారులను కలవడానికి వెళ్తే సరిగ్గా సమయం కూడా ఇవ్వలేదు. సీఆర్డీయే అధికారులు మాతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు లోతట్టు ప్రాంతాల్లో ఇస్తున్నారు. సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉండవల్లి అనేది లోతట్టు ప్రాంతం. మేం భూములు ఇవ్వకుండానే ప్లానులు గీసేశారు. ఉండవల్లి గ్రామాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఉండవల్లి భూములు చాలా విలువైనవి. రాజధాని రాకముందే మా గ్రామంలో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇప్పటివరకూ ఉండవల్లి రోడ్డునే డెవలప్ చేయలేదు. ఉండవల్లిలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉంటున్నారు. అయినా కనీసం రోడ్డు కూడా డెవలప్ చేయరా?. కొండవీటి వాగుకు ఎత్తిపోతల పథకాలు పెట్టారు. వరద వచ్చినప్పుడు ఇటు కొండవీటి వాగులోనూ, అటు కృష్ణానదిలోనూ వరద దాదాపుగా ఉంటుంది. అలాంటప్పుడు నీటిని ఎలా తొలగించగలరు. మరి ఎత్తిపోతల పథకాలకు చేసే ఖర్చు దేని కోసం?. రాజధానికి భూములు ఇస్తే పిల్లలకు స్కూలు ఫీజులు, ఫీజు రియింబర్స్‌మెంట్ అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాజధానిలో ప్లాట్లను కనీసం అభివృద్ధి కూడా చేయలేదు. రాజధానిలో తవ్వుకున్న మట్టిని అమ్ముకుంటున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతం. ఇంకా తవ్వితే.. మరింత ముంపు ప్రమాదం ఉంటుంది. కొద్దిపాటి వర్షాలకు నీరు చేరిపోతోంది. ఉండవల్లి అనేది లోతైన ప్రాంతం. అసలు రాజధానికి పనికి రాదు. కాబట్టి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించాలి. దొంతిరెడ్డి వేమారెడ్డి. మంగళగిరి వైయస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి: – తాడేపల్లిలో భూముల రేట్లకు దాదాపుగా రేట్లు ఉంటాయి. హైవేకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఎలాగైనా ఇక్కడ భూములు తీసుకుని, తనకు సంబంధించిన వారికి ఈ విలువైన భూముల్లో ప్లాట్లు ఇవ్వాలన్నది ప్రయత్నం. అందుకే రైతులను భయపెట్టి, భూములు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కళ్లం శ్రీకాంత్‌రెడ్డి. పెనుమాక: – మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. కాని మా భూములు లాగేసుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చినా మా మండలంలో ఎప్పుడూ రాలేదు. రెండు పంటలు గ్యారంటీగా పండుతాయి. అలాంటి భూములను లాగేసుకుంటున్నారు. తరతరాల నుంచి వచ్చిన భూములను ఎలా ఇస్తాం?. ల్యాండ్ పూలింగ్‌కు సహకరించని రైతుల భూముల చుట్టూ డెవలప్‌మెంట్ పేరుతో మట్టి తవ్వి తీసేస్తున్నారు. అలా ఉద్దేశ పూర్వకంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు. ప్రకృతిని ఎదురించి మేం వ్యవసాయం చేస్తున్నాం. ఈ బెదిరింపులకు మేం లొంగేది లేదు. మేకా శివారెడ్డి. పెనుమాక: – రాజధాని గ్రామాల్లో ఉన్న జనాభా ఎంత? కోట్ల మంది జనాభా ఉన్నట్టుగా అన్ని రోడ్లు అవసరమా? చిన్న చిన్న రోడ్లు అంటూ మొత్తం రైతుల భూములను నాశనం చేస్తున్నారు. కొర్రప్రోలు జగదీశ్వర్‌రెడ్డి. ఉండవల్లి: – ప్రజా రాజధాని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రాజధానిలో అనేక ప్రైవేట్ కాలేజీలకు భూములు ఇచ్చారు. మరి ఎవరైనా, ఉచితంగా సీట్లు రైతుల పిల్లలకు ఇచ్చారా?. రైతులు ఇష్టపడితే తీసుకోండి. కానీ, బలవంతంగా తీసుకోవద్దు. ల్యాండ్ పూలింగ్‌లో మేం ఇవ్వబోమని అధికారికంగా పత్రాలు ఇచ్చాం. వాటిని పట్టించుకోలేదు. కొండవీటి వాగు లేదు, నీళ్లు రావు అన్నారు. ఇప్పుడు హై పవర్ పంపులు ఎందుకు పెట్టారు. మళ్లీ ఇప్పుడు రూ.450 కోట్లు ఎత్తిపోతలకు ఖర్చు పెడతారా!. నీటి తరలింపు అంటూ కొత్త పదజాలం పెట్టి, ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల డబ్బును ఇలా వృథా చేస్తున్నారు. నేషనల్ హైవే కి.మీ.కు రూ.20 కోట్లు గరిష్టంగా ఖర్చవుతుండగా, అమరావతిలో దారుణంగా ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కావాల్సింది కాంట్రాక్టర్ల బాగే. గుంటక నరేష్‌రెడ్డి. పెనుమాక: – 12 ఏళ్లుగా భూములను కాపాడుకోవడం కోసం పోరాడుతున్నాం. మా భూములు మాకు వదిలేస్తే మేమే అభివృద్ధి చెందుతాం. మా భూములకు ఇచ్చే రిటర్న్‌బుల్ ప్లాట్ల వల్ల మేం తీవ్రంగా నష్టపోతాం. 12 సంవత్సరాల నుంచి మా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులకు అనుమతి ఇవ్వడం లేదు. ఏ నిర్మాణ చేసుకోవాలనుకున్నా పర్మిషన్లు రావడం లేదు. విలువైన మా భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేది లేదు. రైతుల పోరాటానికి మీరు మద్దతు పలకాలి. మేకా వెంకటరెడ్డి. పెనుమాక: – నాకు లింగాయపాలెంలో 6 ఎకరాల పొలం ఉంది. నేను ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వలేదు. నేను ఇవ్వకపోయినా, నా భూమిలో వేరే వాళ్లకు రిటర్న్‌బుల్ ప్లాట్లు ఇచ్చారు. వాళ్లకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేశారు. 2029లో మీరు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. నా పొలం నాకు ఇప్పించండి. శంకర్రావు. ఎర్రపాబాలెం: – నాకు మూడు ఎకరాల పొలం ఉంది. నేను భూములు ఇవ్వలేదు. నేను భూములు ఇవ్వలేదని నా పొలంలో మొత్తం రోడ్డుకు ఇచ్చేశారు. సాగులో ఉన్న నా పొలాన్ని ధ్వంసం చేశారు. నా చేనులో నుంచి వాగులా మార్చి పెద్ద కాలువ తవ్వేశారు. టీడీపీ నాయకులు, సీఆర్డీయే అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగాను. నా భూమిలో తవ్విన మట్టిని అమ్మేసుకున్నారు. ఒక రాత్రి నేను కాపలా ఉండి, అక్రమంగా తరలిస్తున్న మట్టిని తవ్వుతుండగా పట్టుకుని, పోలీసులకు అప్పగించాను. ఎవరు భూములు ఇవ్వకపోతే, అందులో రోడ్లు వేయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉంటే పేదలు, రైతులు అనే వాళ్లు ఉండరు. సందీప్. అమరావతి రైతు: – దళిత రైతుల భూముల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించడానికి అడ్డు పడుతున్నారు. వైద్యం కోసం డబ్బులు లేక మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దళిత రైతులకు వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను అమలు చేయాలి. ఆ జీవోల ప్రకారం ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయాలి. మా ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా పోలీసులు, అధికారులు ముందుకు రావడం లేదు. చిన్న. పెనుమాక: – పెనుమాకలో నాకున్న 80 సెంట్లు పోతుంది. పూలింగ్‌కు ఇవ్వకుండా పెనుమాకలో 250 ఎకరాలు ఉంది. ఇందులో డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరు చెప్పి భూములు లాగేసుకుంటున్నారు. రైతుల భూములను బలవంతంగా సేకరిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తున్న గ్రామాలకు మీ సహాయం అవసరం. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. భూముల కోసం రైతులను విపరీతంగా భయపెడుతున్నారు. – మా భూములు ఇవ్వమని చెప్పాం. గతంలో ప్రీ డేట్ వేసి అవార్డు ప్రకటించేశారు. హైకోర్టు స్టే ఉన్నా సరే వీటిని పట్టించుకోలేదు. ఇప్పుటికి రోజుకు 10 సార్లు అధికారులు ఫోన్లు చేస్తున్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సర్క్యులేషన్ లేని పత్రికలో భూ సేకరణ ప్రకటన ఇచ్చారు. నాకున్న 20 ఎకరాలు తీసుకుంటామంటూ ల్యాండ్ అక్విజేషన్ నోటిఫై చేశారు. చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి ఒత్తిళ్లు తెస్తున్నారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొన్ని గ్రామాల్లో 660 ఎకరాల భూములను రాజధాని నుంచి మినహాయించారు. ఇప్పుడు మళ్లీ ఆ భూములు లాగేసుకుంటున్నారు. జంగా నాగిరెడ్డి. నిడమర్రు: – మా గ్రామంలో విస్తృతంగా వ్యవసాయం చేసే వాళ్లం. భూములు తీసుకుంటామని 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. అధికారులు మాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రాజధాని గ్రామంలో భూములు కోల్పోయిన వాళ్లు కూలి పనులకు వెళ్తున్నారు. ప్రజల శాశ్వత జీవనాధారం పోతోంది. రైతులకు మీరు న్యాయసహాయం అందిస్తామని చెప్పడం మాకు సంతోషంగా ఉంది: సురేష్. వెలగపూడి: – 29 గ్రామాల్లో ఎక్కడా రైతులకు సెంటు భూమి కూడా ఉండొద్దన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. నందమూరి బాలకృష్ణకు 250 ఎకరాల భూమి ఉంది. అమరావతిలో ప్రతిపాదిస్తున్న ఎయిర్‌పోర్టుకు ఆ భూమి కేవలం 8 కి.మీ దూరం మాత్రమే. అంటే అక్కడి వరకు మాత్రమే భూమి తీసుకుంటారు. ఆ విధంగా ఆయన భూమికి విలువ మరింత పెరిగేలా కుట్ర. ఇంకా అమరావతిలో లారీ మట్టి రూ.10 వేలకు అమ్మేస్తున్నారు. వెస్ట్ బైపాస్‌లో అలా మట్టి తరలిస్తున్నారు. చివరకు టోల్‌గేట్‌లో ఆపితే, వాళ్లను బెదిరించారు. ఇప్పుడు అమరావతిలో అలా మట్టి దోపిడి చేస్తున్నారు. చంద్రశేఖర్. పెనుమాక: – మా భూమి పూలింగ్‌కు ఇవ్వలేదని, మాకు కరెంటు, నీరు కట్ చేశారు. తోడిన నీటిని తరలిస్తున్నారు. ఆ భూమి రిజర్వాయర్ పక్కనే ఉంది. కావాలని గండి కొట్టి, నీరు పంపిస్తున్నారు. రేపు మీరు మాకు ఆ భూమి తిరిగి ఇచ్చినా, మేము అక్కడికి పోలేని స్థితికి తీసుకొచ్చారు.