మెగా డీఎస్సీ కాస్తా 'దగా డీఎస్సీ'గా మారింది.. 

'యువగళం' బ్యాచ్‌కు దొడ్డిదారిన ఉద్యోగాలు

విద్యాశాఖ లూటీపై ఆర్టీఐ ద్వారా ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని.

ఏపీ సచివాలయంలో విద్యా, క్రీడాశాఖల కార్యాలయాల్లో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన మాజీ మంత్రి పేర్ని 
వెంకట్రామయ్య (నాని)

2025 మెగా డియస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరిన పేర్ని నాని.

అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని). 

అమరావతి: "విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన 2025 డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, తీవ్ర నిర్వహణా లోపాలు జరిగాయని వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో ఈ నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ తన 'యువగళం' పాదయాత్రలో వెంట నడిచిన వారికి తమ సొంత సంస్థ హెరిటేజ్‌లో ఉద్యోగాలిచ్చినంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు 'పేకాట' (బ్రిడ్జ్) ఆడే వారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణతో పాటు ఈ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తాము సచివాలయంలో ఆర్టీఐ (RTI) ద్వారా 16 రకాల అంశాలపై దరఖాస్తు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  డియస్సీపై మంత్రి లోకేష్ ట్విట్టర్ సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన 2025 డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణా లోపాలు, దొడ్డిదారి నియామకాలు జరిగాయి. "మెగా డీఎస్సీ" అని ప్రచారం ఊదరగొట్టి చివరకు అభ్యర్థులకు పెద్ద దగా చేశారు. ఈ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా (క్రీడల కోటా) కింద జరిగిన అక్రమాలను బట్టబయలు చేసేందుకు సచివాలయం లోని విద్యా, స్పోర్ట్స్ శాఖల కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (RTI) కింద అధికారికంగా తాము దరఖాస్తు చేశాం. 

- మెరిట్ లిస్టు మాయం – గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ లాంటి గందరగోళం:

డీఎస్సీ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రదర్శించడం సాంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా ఏ జిల్లాలోనూ మెరిట్ లిస్టును డిస్‌ప్లే చేయలేదు. ఆన్‌లైన్‌లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో జాబితా పెట్టిన ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ డీఎస్సీ నియామక ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా మార్చేశారంటే.. ఇది విద్యాశాఖ మంత్రి లోకేష్‌కే కాదు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా అర్థం కానంత గందరగోళంగా (GST చట్టం తరహాలో) తయారైంది.

- లోకేష్ 'హెరిటేజ్' కంపెనీలా ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ:

మంత్రి లోకేష్ తన 'యువగళం' పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి, తన సొంత సంస్థ హెరిటేజ్‌లో ఉద్యోగాలిచ్చినంత సులభంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టారు. క్రీడల కోటా నియామకాల కోసం నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గతంలో 29 క్రీడలు మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఉండగా, దాన్ని ఏకంగా 67 క్రీడలకు పెంచారు. ఇందులో భాగంగా డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందేలా 'బ్రిడ్జ్' (పేకాట రూపం) ఆటను సైతం 'బి కేటగిరీ' (40వ ఆట) కింద చేర్చి, అందులో నిపుణులంటూ తమ అనుయాయులకు దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది.

- పార్టీ అంతర్గత హత్యల బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలా?:

టీడీపీ పార్టీలో అంతర్గతంగా గొడవలు పడి, ఒకరినొకరు హత్యలు చేసుకుంటే.. ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారని పేర్ని నాని నిలదీశారు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే లోకేష్ తన సొంత కంపెనీ అయిన హెరిటేజ్‌లో ఇచ్చుకోవాలి తప్ప, పవిత్రమైన ఉపాధ్యాయ పోస్టులను, ప్రజల సొమ్మును దొడ్డిదారిన కట్టబెట్టడం ఎంతవరకు న్యాయం. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఇంత నీచంగా వ్యవహరిస్తారా? 

- ఆర్టీఐ (RTI) ద్వారా డిమాండ్ చేసిన 16 రకాల కీలక అంశాలు:

డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత కోసం క్రీడల శాఖ మరియు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వద్ద తాము దరఖాస్తు చేసి రశీదు పొందామని, ఈ క్రింది వివరాలను తక్షణమే ప్రభుత్వం బయటపెట్టాలి. 
16 వేల ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? 
ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు, వారు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేంటి?
స్పోర్ట్స్ కోటాలో రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరు? వారిని ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి వినతులను పరిశీలించారా?
టెట్ (TET), డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో (Evaluation) కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీలు ఇవ్వాలి.

ఈ నేపథ్యంలో ప్రజలు నమ్మి అధికారం ఇస్తే, పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగాలను తమ అనుయాయులకు దొడ్డిదారిన కట్టబెట్టేలా డీఎస్సీని ఇంత నీచంగా వాడుకోవడం కూటమి ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని పేర్ని నాని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలు ఏడాది తర్వాత తెలిస్తే ప్రశ్నించడం తప్పా అని నిలదీస్తూ, నిజం ఎప్పుడు బయటపడితే అప్పుడు నిలదీయడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల అర్హతలు నిజమైనవే అయితే, వారు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి సర్టిఫికెట్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. మంత్రి లోకేష్ ఇకనైనా ట్విట్టర్‌లో సొల్లు కబుర్లు చెప్పడం మానేసి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ 'దగా డీఎస్సీ' అక్రమాలపై తక్షణమే సమాధానం చెప్పాలని, ఆర్టీఐ ద్వారా తాము అడిగిన 16 రకాల అంశాల పూర్తి సమాచారాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

- పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... 

డీఎస్సీ అక్రమాలు ఏడాది తర్వాత తెలిస్తే అడిగితే తప్పా? అని పేర్ని నాని ప్రసార మాధ్యమాలను ప్రశ్నించారు. నిజం ఎప్పుడు బయటపడితే అప్పుడు ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అన్నారు. ఒకవేళ ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులు తమ అర్హతలు నిజమైనవి, తాము నిజాయితీగా ఉద్యోగాలు సాధించామని అనుకుంటే.. ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ సర్టిఫికెట్లను బయటపెట్టవచ్చని సూచించారు.

Back to Top