పవన్ కల్యా‌ణ్‌ పిచ్చి ఆరోపణలు

హైదరాబాద్:

విభజనవాదుల మధ్య వేదికలెక్కి పవన్‌ కళ్యాణ్‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాలనపై ‌పల్లెత్తు మాట అనే అర్హత కూడా పవన్ కల్యా‌ణ్‌కు లేదని ఆమె హెచ్చరించారు. నిజానికి పవన్‌ కళ్యాణ్‌ ఓ మూర్ఖుడని పద్మ ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యా‌ణ్‌కు ఉన్నది తిక్కే అని దానికి లెక్కాపత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనవాదుల సేవలో పవన్‌ తరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

‌మహానేత వైయస్ఆర్ పాలన‌ వల్లే తెలంగాణ విడిపోయిందని పవన్ కల్యా‌ణ్ చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమ‌ని పద్మ విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో పవన్‌ కళ్యాణ్ చదవలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలోనే తెలంగాణ ఆకాంక్ష మొలకెత్తిందనే వాస్తవాన్ని ‌ఆ నివేదికలో పొందుపర్చారని గుర్తుచేశారు.‌ మహానేత వైయస్ఆర్ వల్లనే రాష్ట్రం విడిపోకుండా నిలబడిందని, విభజనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడింది కూడా ఆయనే అని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తారని తెలిపారు. వైయస్ఆర్ జీవించి ఉన్నపుడు ఉన్న ఆంధ్రప్రదే‌శ్ తరహాలో అన్ని రాష్ట్రాలు ఉండాలని ఎన్డీయేలోని పక్షాలు కూడా భావించిన విషయం పవ‌న్ కల్యా‌ణ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.

బీజేపీ, టీడీపీ మద్దతుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ నిద్రపోతున్నారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. అప్పుడేమైంది పవన్‌ కళ్యాణ్ తెలు‌గువారి ఆత్మగౌరవం అని ప్రశ్నించారు. దేశానికి మోడల్‌ సీఎంగా నిలిచిన మహానేత వైయస్ఆర్‌పై అవాకులు చెవాకులు మాట్లాడితే సహించేది లేదని పవన్‌ కళ్యాణ్‌ను పద్మ హెచ్చరించారు.

 వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన ఎంత గొప్పదో పవన్‌ లాంటి మూర్ఖులకు తెలియకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజలు ఆయనను తమ గుండెల్లో పదిలం చేసుకున్నారని వాసిరెడ్డి చెప్పారు. మహానేత మరణిస్తే ఎన్ని గుండెలు క్షోభించాయో చూడగల్గిన మనసు, కళ్లు పవన్‌కు లేవన్నారు. పవన్ చనిపోతే ఆయన భార్య కూడా కన్నీళ్లు కా‌రుస్తోందో లేదో తెలియదన్నారు. ఏ భార్య కన్నీరు కార్చాలో తెలియని పరిస్థితి నెలకొంటుందని ఎద్దేవా చేశారు. మహానేత వైయస్ఆర్ మరణించిన ఐదేళ్ల తరువాత కూడా జనం ఆయ‌నను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. వైయస్ఆర్ కాలి‌ గోటికి కూడా సరిపోని పవన్ కల్యా‌ణ్ మాట్లాడ్డం విచిత్రం‌ అన్నారు. కేసీఆర్‌ను తిట్టకపోవడంపై కూడా పెడార్థాలు తీసే దౌర్భాగ్యం రాజకీయాల్లో నెలకొందని పద్మ విచారం వ్యక్తంచేశారు. శ్రీ జగన్ కేసీఆ‌ర్‌నూ తిట్టలేదు, పవన్ కల్యా‌ణ్‌ను కూడా తిట్టలేదు. తెలంగాణ వచ్చింది ఇద్దరు ఎంపీలున్న కేసీఆర్ వల్ల అని పవ‌న్ ‌భావిస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదని తూర్పారపట్టారు.

మన రాష్ట్ర విభజనకు కారకుడైన మోడీని ఓ వైపు, విభజనకు లేఖ ఇచ్చి చివరి దాకా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబును మరోవైపు, రాజ్యసభలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయిన సొంత అన్న చిరంజీవిని వెనుక వైపు పెట్టుకున్న పవన్‌ కళ్యాణ్ వారినేమీ అనకుండా సమైక్యం కోసం అన్ని రాష్ట్రాలు తిరిగి ముఖ్యమంత్రులను, జాతీయ నాయకులను కలిసి చివరికంటా పోరాడిన‌ శ్రీ వైయస్ జగ‌న్‌ను విమర్శించడం విడ్డూరం అన్నారు. పవన్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల లెక్కలో లేని మనిషి‌ అని విమర్శించారు. అలాంటి వ్యక్తి గురించి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి అందరూ కట్టకట్టుకుని వచ్చి మాట్లాడినా‌ శ్రీ జగన్‌కు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరన్నారు. రాష్ట్రాన్ని నిలువునూ రెండు ముక్కలు చేస్తున్నపుడు నోరెత్తని పవన్‌కు తెలుగు పౌరుషం గురించి మాట్లాడే అర్హత కూడా లేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top