రాష్ట్ర విభజన పాపంలో చంద్రబాబుకూ భాగం

హైదరాబాద్, 8 నవంబర్ 2013:

కేసులకు భయపడే సోనియాగాంధీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించడం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన పాపంలో సోనియాతో పాటు చంద్రబాబుకూ భాగం ఉందన్నారు. సమైక్య ఉద్యమం దృష్టిని మరల్చేందుకే వైయస్ఆర్ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన నీడను కూడా నమ్మని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో శుక్రవారం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టడానికే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. ఏ ఎన్నికలైనా సర్వే ఫలితాలు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని పద్మ తెలిపారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వంద రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న తరుణంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వ్యవహరిస్తున్న తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయని అన్నారు. విభజన విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటని ప్రతి ఒక్కరూ నిలదీస్తుంటే.. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం వంద రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని, టిడిపికి అనుకూలంగా ఉందని సర్వే లేక్కలు చెబుతున్నాయని, పార్టీ కేడర్‌ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునివ్వడమేమిటని ప్రశ్నించారు.

సమైక్యానికి మద్దతుగా నిలవమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని చంద్రబాబు సోనియాగాంధీ విభజన పాటకు వంత పాడుతున్నారని వాసిరెడ్డి విమర్శించారు. ఎంతసేపూ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం తప్ప చంద్రబాబుకు మరో పనే లేనట్టున్నదన్నారు. శ్రీ జగన్‌పై బురద చల్లితే నాలుగు ఓట్లు, సీట్లు వస్తాయనే దృష్టితోనే ఆయన వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన పాపానికి పాల్పడిన సోనియా దిగివచ్చేలా చంద్రబాబు ఎందుకు వ్యవహరించడంలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ విభజన వాదాన్ని తలకెత్తుకుని రాష్ట్రానికి ఆయన శాపంలా పరిణమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క కేసులో అయినా తాను విచారణకు సిద్ధం అని చంద్రబాబు ఎందుకు అనడంలేదని అన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ధిక్కరించి.. నిర్బంధంలో ఉన్నప్పటికీ వ్యవస్థలకు వ్యతిరేకంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి పోరాడారని పద్మ తెలిపారు.

నయవంచకుడైన చంద్రబాబు సోనియా పాపంలో పాలు పంచుకుంటున్నారని, విభజన వాదంలో కాంగ్రెస్‌కు వంత పాడుతూ కేసులు, విచారణ నుంచి తప్పించుకుంటున్నారు కనుక ఇప్పుడు తన నీడను తానే నమ్మలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఐఎంజీ భారత కేసులో స్వచ్ఛందంగా విచారణకు చంద్రబాబు ఎందుకు సిద్ధపడడంలేదని నిలదీశారు. ఈ రాష్ట్రం కలిసే ఉంటుందని, అప్పటి వరకూ పోరాడతామన్న ఒక్క మాట కూడా ప్రజలకు చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, టీడీపీ వాళ్ళే ఆయనను ఒక బఫూన్‌ మాదిరిగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

Back to Top