బినామీలకు దోచిపెడుతున్నారు

అయినవారికి అడ్డగోలు కాంట్రాక్ట్ లు
రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్న బాబు అండ్ కో
టెరా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలిః వాసిరెడ్డి పద్మ

 హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పచ్చసర్కార్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తన బినామీలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అయినవారికి అంతులేని ప్రయోజనాలను చేకూరుస్తోందని ఫైరయ్యారు.  తాజాగా టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.333 కోట్ల ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే పేరుతో ఈ ప్రాజెక్టును సీఎం సొంత మనిషి వేమూరి హరికృష్ణకు చెందిన సోదర సంస్థ టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారని పద్మ అన్నారు. టీడీపీకి ఐటీ సలహాదారు అయిన హరికృష్ణ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలోని మూడు సంస్థల్లో డెరైక్టర్‌గా ఉన్నారని, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో కూడా అనుబంధం ఉందని, అలాంటి వ్యక్తికి ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. టెరా సంస్థ చౌక దుకాణాలకు ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను తీసుకొని వైఫల్యం చెందడంతో బ్లాక్‌లిస్టులో ఉందని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు.

గతంలో ఈవీఎంలు దొంగిలించిన కేసులో మహారాష్ట్రలో హరికృష్ణ నిందితుడు అని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ధారించే కమిటీలో హరికృష్ణ ఒక సభ్యుడని పేర్కొన్నారు. ‘‘కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది వారే. దక్కించుకునేది వారే’’ అన్న పద్ధతిలో చంద్రబాబు పాలన సాగుతోందని పద్మ దుయ్యబట్టారు.

బినామీల కోసమే..
చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించే కమిటీలో సీఎం సొంత మనిషి మధుకాన్ షుగర్స్ అధినేత నామా నాగేశ్వరరావు ఉంటే , విద్యా సంస్థలకు సంబంధించిన కమిటీల్లో మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావులు ఉంటారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సహజంగానే వారిద్దరూ నారాయణ విద్యాసంస్థలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటారని అన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా ఆయా కమిటీల్లో నియమితులయ్యే మంత్రులంతా బినామీల ద్వారా వ్యాపారాలు చేసుకునే వారేనని, వీరు తీసుకునే నిర్ణయాలు బినామీలకు అనుకూలంగానే ఉంటాయన్నారు. సమాజం ఏమనుకుంటుందో, జనం ఏమనుకుంటారోనన్న బెరుకు కూడా లేకుండా చంద్రబాబు రాష్ట్రాన్ని తన మనుషులకు దోచి పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

Back to Top