<strong>కొల్లాపూర్:</strong> తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేసిన ఒకే ఒక సిఎం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సి. జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేసింది, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది ఆ మహానేతే అన్న విషయం టిఆర్‌ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలు, విద్యార్థులను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవడమే పనిగా పెట్టుకుని కొందరు నాయకులు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వైయస్‌ను విమర్శిస్తే ఆత్మవంచనే అవుతుందని అన్నారు.<br/>కొల్లాపూర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో వైయస్‌ఆర్‌సిపికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే టిఆర్ఎస్ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నాయకుల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, మోస రాజకీయాలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెబుతారని జగదీశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టిఆర్ఎస్ నాయకులు వైయస్‌ఆర్ పిసిపై విమర్శలు చేయడం ఏమిటో వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.