వైయస్ఆర్ సీపీలోకి తానేటి వనిత

హైదరాబాద్:

4 నవంబర్ 2012 : టిడిపి ఎమ్మెల్యే తానేటి వనితతో సహా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్. విజయమ్మ సమక్షంలో తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీ రావుతో పాటు గోపాలపురం టిడిపి ఎమ్మెల్యే వనిత వైయస్ఆర్ సీపీలో చేరారు. అలాగే కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు, చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జి కర్రా రాజారావు, దెందులూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌  కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పోలిపర్తి సత్యవతి, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ బొబ్బా సుబ్బారావు తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి విజయమ్మ సాదరంగా పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా తానేటి వనిత ప్రసంగిస్తూ, టిడిపిలో తనకు అవమానాలు ఎదురయ్యాయనీ, ఎంతో మనస్తాపం చెందాననీ చెప్పారు. తన అభిప్రాయాలకు టిడిపిలో విలువ లేకుండా చేశారని, ఎలాంటి సంజాయిషీ అడగకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వైయస్ లాగే జగన్మోహన
రెడ్డి కూడా అందరికి సమన్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని, ప్రస్తుతం చేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను కష్టపడి చిత్తశుద్ధితో పని చేస్తానని ఆమె ప్రకటించారు. టిడిపి మాజీ ఎంఎల్ఏ పెండ్యాల కృష్ణబాబు మాట్లాడుతూ, టీడీపీలో 30 ఏళ్లు కష్టపడి పనిచేశాననీ అయితే ఆ పార్టీ ఇప్పుడు
చంద్రబాబు ఫ్యామిలీ పార్టీగా మారిందనీ విమర్శించారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ
పరిస్థితి జీరోయేనని ఆయన వ్యాఖ్యానించారు.
విజయమ్మ ప్రసంగిస్తూ, వైయస్ ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారనీ, జగన్ బాబు కూడా అంతేననీ అన్నారు. అలాగే వైయస్ఆర్ సీపీ నాయకులు, శ్రేణులూ ప్రజాపక్షంగా జనం మధ్యే ఉండి పని చేయాలని ఆమె కోరారు. వర్ష బీభత్సంతో ప్రజలు కష్టాలలో ఉన్నారనీ, వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలనీ ఆమె పిలుపు ఇచ్చారు. తాను ముంపు ప్రాంతాలలో పర్యటించడానికి వెళుతున్నానని ఆమె చెప్పారు. వైయస్ఆర్ సీపీలో చేరిన నాయకులందరినీ ఆమె అభినందించారు. ఈ కార్యక్రమం వైయస్ఆర్ సీపీ నాయకులు టి. బాలరాజు అధ్యక్షతన జరిగింది. జోహార్ వైయస్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, విజయమ్మ సారథ్యం వర్ధిల్లాలి అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

Back to Top